అంజనేయుని మాటే ఆదర్శం .. ~ దైవదర్శనం

అంజనేయుని మాటే ఆదర్శం ..


.
"మనోజపం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్దిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీ రామదూతం శిరసానమామి...!"
.
భక్తి, యుక్తి, శక్తి, త్రివేణీ సంగమంలా సంగమించిన తత్వం హనుమంతునిది. సీతారాములకు ప్రాణదాత. మూర్త్భీవించిన దాసభక్తి స్వరూపుడు. కార్యదీక్షాపరుడే కాక మానవజాతికి మార్గదర్శకుడు, అభయప్రదాత ఆంజనేయస్వామి. సీతారాములను కలుపువారు శ్రీమద్రామాయణంలో పేర్కొన్నట్లు ఇద్దరు. ఒకరు విశ్వామిత్రుడు, రెండవవాడు ఆంజనేయస్వామి. లోక కళ్యాణార్థం సీతారాముల కళ్యాణాన్ని జరిపించినవాడు విశ్వామిత్రుడైతే విడిపోయిన జంటను మరల కలిపి జగత్కల్యాణం గావించినవాడు ఆంజనేయుడు.సీతారాముల్ని కలపడమనేది యోగం. చేతనాచేతనా జీవరాశికి ప్రతీక అయిన సీతను అనగా వేదమాతను, పరమేశ్వరునితో ఐక్యం చేయడమే యోగం. సంధానకర్త యోగేశ్వరుడైన హనుమంతుడు. హనుమంతుడు వానరుడు. ఆత్మతత్వాన్ని దర్శింపజేసేది వానర శబ్ద వాచ్యం. భగవత్ తత్వాన్ని దర్శింపజేయగలిగినది వేదం కనుక వానరము వేదస్వరూపం. వానరము చూడటానికి కురూపిగా కనిపిస్తుంది కదా? విద్యావంతుడు, విద్యాస్వరూపుడు, వేదవేత్త అయిన హనుమంతుడు బహు సుందరుడే అన్నారు శ్రీ శంకర భగవత్పాదులు. మారుతి మాటే ఆదర్శం.
.
శ్రీమద్రామాయణంలో శ్రీరామ, హనుమ సమావేశం ఒక చారిత్రాత్మక ఘట్టం. పంపా సరోవరాన ధనుర్థారులై తాపస వేషులైన రామలక్ష్మణును బ్రహ్మచారి రూపంలో సందర్శించిన హనుమంతుడు, ‘‘మీరు రాజర్షుల్లా ఉన్నారు. తాపసవరులు. తేజోమూర్తులు. మీ దేహకాంతి ఈ ఋష్యమూకాన్నంతా వెలిగిస్తున్నది.2చివరకు ఈ సర్వ సర్వం సహచక్రానే్న పాలించగల మీరు ఈ తాప వేధారులెందుకైనార’’ న్నాడు. వారి దగ్గర నుంచి సమాధానం లేదు. అప్పుడు తానెవరో చెప్పాలి గదా అనుకొని, నేను సుగ్రీవుని మంత్రిని అన్నాడు. శ్రీరామ చంద్రుడు అవశుడై ఆంజనేయుడిని చూసి, ‘‘మాటతీరులో వెగటు గొలిపే వేగం కాని, విసుగు పుట్టించే మాంద్యం కాని లేవు. ప్రతి మాటలో సంస్కారం ఉట్టిపడుతోంది. కంఠస్వరం మనోహరంగా ఉంది’’ అన్నాడు. హనుమంతుని బుద్ధిబలం, పాండిత్యం, మాటనేర్పు శ్రీరామచంద్రుణ్ణి ఆకర్షింపజేశాయి. ఇటువంటి దూత గల ప్రభువుదే కార్యసిద్ధి. ఇటువంటి వాడు సచివుడుగా ఉండే సాధించలేనిది ఏదీ ఉండదు అని శ్రీరాము డు స్వయంగా లక్ష్మణునితో అన్నాడు. అదీ ఆంజనేయుని వ్యక్తిత్వం. ఆంజనేయస్వామి భక్తి అనుపమానం, ఆదర్శం, స్వార్థరహితం, స్వచ్ఛం. తన శక్తియుక్తులన్నీ స్వామి సేవకు వినియోగించాడు. అందుకే దేశంలో శ్రీరామచంద్రుడికి ఎన్ని ఆలయాలున్నాయో, అంతకు కొంచెం ఎక్కువగానే స్వామి భక్తుడైన ఆంజనేయుడికి ఆలయాలుండటం విశేషం..
.
అపారశక్తి ఉన్నా అది తెలియక అణగి ఉం డటం, ఎదుటివాళ్లు అది తెలియజెప్పేదాకా దాన్ని తెలుసుకోలేకపోవడం ఆంజనేయస్వామి స్వభావం. అది ఆయనకు శాపం వల్ల వచ్చింది. జాంబవంతుని ప్రశంసతో ఆంజనేయుడు త్రివిక్రమునిగా విజృంభించాడు. సూక్ష్మరూపుడై లంకలో ప్రవేశించి లంకిణిని జయించాడు. ఇక సీతానే్వషణలో ఆయన చూపిన శక్తియుక్తులు అసామాన్యం. తన మాటతీరుతోనే సీతమ్మకు ఆప్తుడైనాడు. రాముడిచ్చిన అంగుళీయకాన్ని సీతకిచ్చాడు. సీత తన ఆనవాలుగా చూడామణి ఇవ్వగా పుచ్చుకున్నాడు.
.
తర్వాత రాక్షస బలం తెలుసుకోవడానికి, తన శక్తియుక్తులు వారికి తెలిపేందుకోసం అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, అడ్డువచ్చిన రాక్షసులను సంహరించాడు. రావణ పుత్రుడైన అక్షయ కుమారుడిని అంతం చేశాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డట్టు నటించి రావణదర్బారులోకి ప్రవేశించాడు. రావణుడికి సీత సామాన్య స్ర్తికాదని హితబోధ చేశాడు. రావణుడు తోకకు నిప్పు పెట్టించగా లంకాదహనం చేసి, సీతమ్మ వద్దకు మళ్లీ వచ్చాడు.‘‘హనుమా, రాముడీ లంకపైకి దండెత్తివచ్చేండదుకు, ప్రమాణము నీవే. నీమాటపైన ఆధారపడియే రాముడి శ్రేష్ట ప్రయత్నం. నీవు ఏం ప్రయత్నం చేస్తావో, ఎలా చేస్తావో నాదుఃఖాన్ని మాత్రం నాశనం చేయమని’’ సీతమ్మ చేత చెప్పించుకున్న ఆప్తుడు హనుమ. ‘‘తల్లీ ఎందరో వానరవీరులు రామునికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా బలవంతులైన వారిని దూతలుగా పంపరు కదా, కనుకనే నన్ను పంపించారు. ఇదే నీకు సాక్ష్య’’ మన్నాడు హనుమ. ఇందులోని రాజనీతి, హనుమంతుని వినయం అత్యద్భుతం.
.
సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణునికి ప్రాణదానం చేశాడు. యుద్ధంలో మరణించిన వానరసైన్యాన్నంతటిని బతికించాడు. రావణుని స్వయంగా ఎదుర్కొనడానికి లక్ష్మణుడు వెళుతుంటే, ఈ భృత్యుడుండగా మీకెందుకు శ్రమ అంటూ రావణున్ని ఎదుర్కొన్నాడు. హనుమ అరచేతితో రావణున్ని గట్టిగా చరిచాడు. ఆ దెబ్బకి రావణుడు, భూకంపానికి పర్వతాలు కంపించినట్టుగా కంపించి, ‘‘షభష్ వానరవీరా భేష్ పరాక్రమంలో శత్రువైనా ప్రశంసింప దగిన వాడివి’’ అని మనసారా ఆంజనేయుణ్ణి ప్రశంసించాడు. విభీషణుడు, ఆంజనేయుడు రాత్రివేళ ఒక కొరివి కట్టెను తీసుకొని తిరుగుతూ జాంబవంతుని వద్దకు వచ్చారు. గాయాలతో మూలుగుతున్న జాంబవంతుడు, విభీషణా ఆంజనేయుడు బతికిఉన్నాడా? ఆంజనేయుడు ఒక్కడు బతికి ఉంటే చాలు, సర్వ సైన్యము హతమైనా బ్రతికి ఉన్నట్లే. హనుమ ఒక్కడు హతుడైతే సైన్యమంతా లేనట్లేఅని అన్నాడు. ఇంతకంటె ఆంజనేయుడి శక్తియుక్తులకు తార్కాణమేం కావాలి..?
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List