ఆత్మ-1 ~ దైవదర్శనం

ఆత్మ-1

భగవద్గీతలో ఆత్మ గురించి ఇలా చెప్పబడింది. ఈ విశ్వమంతా వ్యాపించివున్న ఆత్మనాశనం లేనిది. దానినెవరూ అంతం చేయలేరు. నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఆత్మ చంపేది కాని చచ్చేది కాని కాదు,ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితమూ, శాశ్వతమూ,అనాది సిద్ధమూ అయిన ఆత్మ నిత్యం. మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టేసి కొత్తబట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృశించిన శరీరాలను వదలి కొత్త దేహాలు పొందుతుంది. ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు; అగ్ని కాల్చలేదు; నీరు తడుపలేదు;గాలి ఎండబెట్టలేదు. ఆత్మ ఖండించరానిది,కాలనిది, తడవనిది, ఎండనిది; అది నిత్యం,సర్వవ్యాప్తం, శాశ్వతం, చలనరహితం,సనాతనం. ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు. వికారాలకు గురికాదు. ఇది స్థిరమైనది, అభిన్నము, ఆకారము లేనిది. దేశ, కాల, నిమిత్తాలకు అతీతమైనదీను. నిత్య పరిశుద్ధం. పరిపూర్ణము.


ఆ ఆత్మయే బ్రహ్మమని ఇదివరలో చెప్పుకున్నాం. ‘ అయమాత్మా బ్రహ్మ’ – అని బృహదారణ్యకోపనిషత్తు నందు చెప్పబడింది. అంటే ఈ జీవాత్మయే బ్రహ్మ. ఐతరేయోపనిషత్తు తృతీయాధ్యాయం మానవునికీ భగవంతునికీ ఉండే సంబంధాన్ని వివరిస్తుంది. అన్ని కార్యకలాపాలకూ ఆత్మే ఆధారమనీ, ఆ ఆత్మే బ్రహ్మమనీ చెబుతోంది. శరీరం లయమైనా ఆత్మలయమవ్వదు. నిత్యము, శుద్ధము, బుద్ధము (అంటే జ్ఞానరూపము), ముక్తము ( బంధం లేనిది), ఇది ఇంత అని చెప్పడానికి తగ్గ కారణం లేపోడం వల్ల నిరవధికము. దేశాన్ని బట్టి గాని కాలాన్ని బట్టి గాని దీనికి పరిమితులు లేవు గనుక అనంతమని చెప్పబడింది. జ్ఞానానికి అవధి లేదు గనుక సర్వజ్ఞమని చెప్పబడింది.

   

స్వయం ప్రకాశము, విజ్ఞాన మయము. నామరూప రహితము, గుణరహితము, అద్వితీయము, నిత్యబోధా స్వరూపము, సచ్చిదానందము, ఉపాధి రహితము. బ్రహ్మము సత్యము, జ్ఞానము, అనంతమని చెప్పబడింది. సర్వ వ్యాపి, సర్వజ్ఞుడు. ఏకము అద్వితీయము అవడం చేత వాస్తవానికి లక్షణాలు చెప్పలేం. అంచేతనే మనో వాక్కులకు అతీతమైనదని, అనిర్వచనీయమని చెప్పబడింది. ఈ లక్షణాలు సాధకుడు అవగాహన చేసుకునేందుకు బ్రహ్మము ప్రపంచంలో ఉండే వస్తువువంటిది కాదని చెప్పడానికే సత్యత్వాది లక్షణాలు అరుంధతీ న్యాయంగా చెప్పబడ్డాయి. అరుంధతీ న్యాయమంటే – అరుంధతీ నక్షత్రం చూప దలచుకునే  వాడు దాని దగ్గరే ఉన్న ఒక పెద్ద నక్షత్రాన్ని అదే అరుంధతి అని చూపి, తర్వాత అది కాదు నిజమైన అరుంధతి అని చెప్పి, నిజమైన అరుంధతిని ఏ విధంగా చూపుతాడో అలాగే ఈ సత్యత్వాది లక్షణాలు చెప్పబడ్డాయి.


ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంకొకడు దీన్ని గురించి విచిత్రంగా మాట్లాడుతున్నాడు. మరొకడు వింతగా వింటున్నాడు. అయితే ఈ ఆత్మ స్వరూపస్వభావాలు పూర్తిగా తెలుసుకున్న వాడు ఒక్కడూ లేడని భగవద్గీతలో చెప్పబడింది. శాస్త్రం అవిద్యచేత కలిగే భేదం తొలగించడం కోసమే గాని, బ్రహ్మమంటే ‘ఇది’ అని కొమ్ము పట్టుకొని ఎద్దును చూపినట్లు చూపడానికి కాదు శాస్త్ర ప్రయోజనం. బ్రహ్మ ఏ ప్రమాణానికీ విషయం కాదు. శాస్త్రం అవిద్యా కల్పితమైన సంసారాన్ని తొలగించి, ఆత్మస్వరూపాన్ని మనకు అంద  చెయ్యడానికే..
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive