పుణ్యనిధి ~ దైవదర్శనం

పుణ్యనిధి

మనిషి గోప్యంగా దాచుకునే నిధి పుణ్యం. శుభకర్మల ఆచరణ వల్ల పుణ్యం కలుగుతుంది. అది మానవుణ్ని పవిత్రంగా ఉంచుతుంది. అనంతర కాలంలో పుణ్య ఫలితం కనిపిస్తుందని పెద్దలు చెబుతారు.
మానవ జీవితం పాపపుణ్య సమ్మిళితమై ఉంటుంది. మూర్ఖుడు ఆ రెండింటి భేదాన్ని తెలుసుకోలేడు. పాపకర్మలను ఆచరిస్తాడు. పతనమవుతాడు. జ్ఞాని పుణ్యకర్మలను చెయ్యడం వల్ల అతడి ప్రతిభ రాణిస్తుంది. అతడు పదేపదే ఉత్తమ క్రియలను ఆచరణలో పెడతాడు. తద్వారా స్వర్గాన్ని పొందుతాడని విదురనీతి.

నిరంతరం పుణ్యశీలుడైన వ్యక్తికి అతడి మనసు గుర్తించి నడుచుకునే సహధర్మచారిణి లభిస్తుంది. సత్‌సంతానం కలుగుతుంది. ప్రాణతుల్యమైన స్నేహితులు లభిస్తారని సుభాషితం. పుణ్య సాధనకు పరోపకారమే ఉత్తమ మార్గమని చెబుతుంది భారతం.

ప్రహ్లాదుడు విష్ణుభక్తి విడువనందుకు హిరణ్యకశిపుడు శిక్షించాలనుకుంటాడు. అతడి భటులు ప్రహ్లాదుణ్ని పర్వతంపై నుంచి కిందికి తోస్తారు. సముద్రం మధ్యలో పడేస్తారు. క్రూర సర్పాలతో కాటు వేయిస్తారు. ప్రహ్లాదుడికి రవంతైనా హాని జరగదు. అందుకు కారణం నిరంతర విష్ణుస్మరణ వల్ల కలిగిన పుణ్యం అని ఆ కథ చెబుతుంది. ఆపదలు మనిషిని చుట్టుముట్టినప్పుడు పూర్వం చేసిన పుణ్యమే ఒడ్డున పడేస్తుందని భర్తృహరి సుభాషిత త్రిశతిలో అంటాడు.

మనిషి తన జీవితంలో ఎంత పుణ్యం ఆచరించాలో చెప్పే పరిమితులేమీ లేవు. కొండంత గొప్ప పని చేస్తేనే పుణ్యం కలుగుతుందని అపోహపడనవసరం లేదంటాడు వేమన. చిన్న విత్తనంలోనే మర్రిచెట్టు ఒదిగి ఉన్నట్లు మనిషి చేసే చిన్న చిన్న మంచి పనులే పుణ్యాల రాశిని పెంచగలవు. పుణ్యవంతులను దర్శించినా, స్పృశించినా, వారి కీర్తిని గానం చేసినా అక్షయమైన స్వర్గసుఖం లభిస్తుందంటారు. నిత్యం ఆ సజ్జన సాంగత్యం సర్వపాపాలను హరిస్తుందని పద్మపురాణ కథనం

అతిథి సత్కారం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. పుణ్యసంపాదన ఆతిథ్యంతో ముడివడింది. మనుచరిత్ర ప్రకారం- ఇంటికి వచ్చిన సిద్ధుణ్ని చక్కని ఆతిథ్యంతో తృప్తిపరుస్తాడు ప్రవరుడు. ఆ పుణ్యకర్మాచరణకు ప్రతిగా పాదలేపనం పొంది హిమాలయాలను దర్శించుకుంటాడు. సరైన ఆతిథ్యం ఇవ్వకపోవడం వల్ల కలిగే నష్టాన్ని మహాభారతం చెబుతుంది.

కీర్తికండూతి ఎంతటివారినైనా పతనం చేస్తుంది. కీర్తికాముకులు నిజం తెలుసుకోలేక పదుగురి మెప్పుకోసం చేసిన పుణ్యాలను చెప్పుకొంటారు. దీనివల్ల పుణ్యహీనత జరుగుతుందని స్కాంద పురాణంలోని యయాతి కథ చెబుతుంది.
పూర్వం బ్రహ్మ హత్యా పాతకం వల్ల దేవేంద్రుడు పదవీభ్రష్టుడవుతాడు. ఇంద్రుడి స్థానంలో నిలపడానికి దేవర్షులు యయాతిని స్వర్గానికి తీసుకువస్తారు. యయాతి తాను చేసిన దానధర్మాలను ఒక్కొక్కటీ దేవతలకు వివరిస్తాడు. వారు ఆనందిస్తారు. యయాతి చేసిన పుణ్యవిధులేమిటో మరిన్ని చెప్పమని అడుగుతారు. ఆనందపరవశుడైన యయాతి రహస్యంగా చేసిన పుణ్యకర్మలనూ దేవతలకు వినిపిస్తాడు. మరుక్షణమే పదవీచ్యుతుడై భూమిమీద పడతాడు.

భారతదేశం పుణ్యభూమి. ఇక్కడి ప్రతి అణువూ ఒక పుణ్యస్థలం. ప్రతి నదీ ఒక పుణ్యతీర్థం. ఎన్నో గొప్ప వ్రతాలు ఆచరించినందువల్ల మహామహులు నడయాడిన ఈ నేలపై జన్మ లభించింది. కాబట్టి మనందరం పుణ్యాత్ములమే. పుణ్యకర్మలను చేసుకుంటూ సాగడమే మనముందున్న కర్తవ్యం!
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...