బడంగ్‌పేట్ వేంకటేశ్వరుడు. ~ దైవదర్శనం

బడంగ్‌పేట్ వేంకటేశ్వరుడు.


ముడుపు కడితే.. తీరేను కోర్కెలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారు స్వయంభూగా వెలసిన ఆలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో అత్యంత మహిమ కలిగిన ఆలయంగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం బడంగ్‌పేట్ గ్రామ శివార్లలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఈ ఆలయం ‘కాశీబుగ్గ శ్రీ పుష్కరిణి’ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. సువిశాలమైన ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఆలయం అలరారుతోంది. స్వయంభూగా వెలసిన ఈ ఆలయం మహిమ అత్యద్భుతం. విశాలమైన ఏకశిలపై పద్మావతి, అలవేలుమంగ అమ్మవార్లతో కలిసి శ్రీ వేంకటేశ్వరస్వామి వారు స్వయంభూగా ఒక గుహలో వేంచేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. స్వామివారి వరదహస్తం కింద శివస్వరూపం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. శ్రీ వేంకటేశ్వరస్వామి మూలవిగ్రహం ఈ విధంగా ఉండటం చాలా అరుదనే చెప్పుకోవాలి. స్వామి వారి దర్శనం ఒక మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ఆలయ చరిత్రకు సంబంధించి మూడుచోట్ల శిలాశాసనాలు ఉన్నాయి. దీని ప్రకారం దాదాపు అయిదు వందల సంవత్సరాలకు పూర్వమే స్వామి వారు వెలసి ఉండవచ్చని భావిస్తున్నారు.
భక్తుల కోరికలను నెరవేర్చే దేవుడిగా ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పేరుంది. భక్తులు ఎవరైనా తమ కోరికలను స్వామికి తెలియచేస్తూ, ‘ముడుపు’ కడితే ఏడాది తిరగకుండానే వారి కోరికలు నెరవేరతాయన్నది భక్తుల నమ్మకం. ఈ కారణంగానే చాలా మంది భక్తులు ముడుపులు కడుతూ, ఫలితం పొందుతూ ఉంటారు. అనేక మంది భక్తులు ‘కోరికలు నెరవేరుస్తున్న స్వామి’ అంటూ తమ స్వీయ అనుభవాలను చెబుతూ ఉంటారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రధాన ద్వారం నుండి లోపలకు వెళ్లగానే నాలుగువైపులా మండపాలున్నాయి. ఎడమవైపు గుడిలో ఆళ్వారులు వేంచేసి ఉన్నారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో నెల రోజుల పాటు గోదా ఉత్సవాలు, గోదాకళ్యాణం నిర్వహిస్తారు. అలాగే కార్తీకమాసంలో ఆకాశదీపారాధన, శ్రావణమాసంలో విశేషమైన పూజలు, ఆళ్వారుల తిరునక్షత్రాలు, పెరుమాళ్ల తిరునక్షత్రం తదితర కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతాయి.
ఆలయం ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభానికి ఆనుకుని గరుత్మంతుడి విగ్రహం ఉంది. భక్తులు ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభం ప్రదక్షిణ చేసుకుని ఆళ్వారుల దర్శనం చేసుకుంటారు. వేంకటేశ్వరస్వామి గర్భాలయం వెలుపల కుడివైపు ‘వీరాంజనేయస్వామి’ విగ్రహం ఉంది. భక్తులు హనుమంతుడిని దర్శనం చేసుకుని, అక్కడ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వస్వామి దర్శనానికి వెళతారు. ఇక్కడి హనుమంతుడు కూడా చాలా మహిమ కలిగి ఉన్నాడని భక్తుల నమ్మకం. హనుమంతుడిని నమ్మకంతో, భక్తితో పూజించే భక్తుల కోరికలు నెరవేరతాయని భక్తులు చెబుతున్నారు. ఆ తర్వాత హనుమంతుడి దర్శనం చేసుకుని పద్మావతి, అలమేలుమంగ సహిత శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి వెళతారు.
ప్రత్యేకతలు
కాశీబుగ్గ శ్రీ పుష్కరిణి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయం ప్రాంగణం దాదాపు నాలుగు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రధాన ఆలయానికి తూర్పువైపు ఆరుబయట పెద్ద పుష్కరిణి ఉంది. పుష్కరిణి నిర్మాణం కళాత్మకంగా ఉంది. బడంగ్‌పేట గ్రామం దక్షిణం వైపున కురిసే వర్షపు నీరు ఈ పుష్కరిణిలోకి చేరుతుంది. అధికంగా చేరే నీటిని బయటకు పంపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. సాంకేతికంగా ఇదో అత్యద్భుతమైన కట్టడం. పుష్కరిణి మధ్య భాగంలో చక్రస్నాన మండపం ఉంది. బ్రహ్మోత్సవాల సమయంలో చక్రతీర్థం రోజు చక్రపెరుమాళ్లకు ఈ మండపంలో చక్రతీర్థోత్సవం జరుపుతారు. బ్రహోత్సవాల్లో విశేషమైన ఉత్సవమిది. పుష్కరిణి శిథిలావస్థకు చేరడం వల్ల దీన్ని పునరుద్దరించాల్సిన అవసరం ఉంది. జీర్ణోద్ధరణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం దాతలెవరైనా ముందుకు వస్తే పుష్కరిణిని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు వీలవుతుంది. గతంలో ఆలయానికి వచ్చే భక్తులు తొలుత పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాతే స్వామి దర్శనానికి వెళ్లేవారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. వాస్తురీత్యా పుష్కరిణికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పుష్కరిణిలోకి చేరే నీటిని ఆలయం పూజలకు వినియోగించునేందుకు వీలుంది. భక్తులు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేయవచ్చు. అలాగే ఈ నీటిని విశాలంగా ఉన్న ఆలయ ప్రాంగణంలో పూలు, పళ్ల మొక్కలు పెంచేందుకు ఉపయోగించుకునే వీలుంది. పుష్కరిణికి వాయవ్యం వైపు రామానుజస్వామి మండపం, తూర్పున మృత్సజ్గ్రహణ మండపం, నైరుతీలో కళ్యాణ మండపం ఉన్నాయి. బడంగ్‌పేట గ్రామం నుండి ఆలయానికి వచ్చే దారిలో శ్రీ వేంకటేశ్వరస్వామికి సంబధించిన మరో మండపం, రథశాల ఉన్నాయి.
ఆలయ ప్రాంగణం చుట్టూ భారీ ప్రహరీ ఉంది. ఈ ప్రహరీ వందలాది సంవత్సరాల క్రితం నిర్మించారని తెలుస్తోంది. అందువల్ల ఈ ప్రహరీ చాలా భాగం కూలిపోయి శిథిలావస్థకు చేరింది. ప్రహరీని కూడా పునర్మించాల్సిన అవసరం ఉంది. ఆలయ ప్రాంగణంలో వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మండువేసవిలో సైతం ఈ ఆలయం ప్రాంగణం చల్లగా ఉండటం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆలయ అభివృద్ధికి అనేక పనులు జరుగుతున్నాయి. ఈ పనులు మరింత వేగంగా కొనసాగేందుకు దాతలు ముందుకు వస్తే బాగుంటుంది. ప్రధానమైన శ్రీవేంకటేశ్వరుడి ఆలయంతో పాటు ఈ ఆలయాన్ని ఆనుకుని శివాలయం ఉంది. ఈ శివాలయాన్ని ‘కాశీబుగ్గ శివాలయం’ అని పిలుస్తారు. కార్తీక మాసంలో దీపాలతో శివాలయం కళకళలాడుతూ ఉంటుంది.
వార్షికోత్సవాలు
ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో 9రోజుల పాటు వార్షికోత్సవాలు నిర్వహిస్తుంటారు. వైశాఖ శుద్ధ తదియ నుండి ఏకాదశి వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగానే ఈ నెల (మే) 13 నుండి 21 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల వేంకటాచార్యులు, అర్చకులు చక్రవర్తుల మదన్ మోహన్ చార్యులు, జగన్ మోహన్‌చార్యులు చెప్పారు. బ్రహోత్సవాల్లో భాగంగా 16న అంకురారోపణ, 18న ఉదయం 11 గంటలకు పద్మావతి, వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం, 19న హనుమత్‌వాహన సేవ, 20న రథోత్సవం, 21న పండిత సన్మానం ఉంటాయని వేంకటాచార్యులు వివరించారు.
మార్గం
హైదరాబాద్ (కోఠి ఉమెన్స్ కాలేజీ) నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బడంగ్‌పేటకు వెళ్లేందుకు ఆర్టీసి సిటీ బస్సులున్నాయి. కోఠి ఉమెన్స్ కాలేజీ స్టాప్ నుండి బయలుదేరే బస్సుల్లో 203, 102 బి, 479 బస్సులు బడంగ్‌పేట వెళతాయి. పీసల్‌బండ / మిథాని డిపో చౌరస్తా నుండి బస్సులు ఆటోలు అందుబాటులో ఉన్నాయి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List