చరిత్రలో మొదటి ధర్నా చేసిన వాడు భరతుడు, తన మాట నెగ్గించుకోడానికి. రాముడు తండ్రి మాట మీద పట్టాభిషేకం కాదనుకుని పదునాలుగేళ్ళ వనవాసానికి వచ్చేసేడు. భరతుడు అప్పుడు పట్టణం లో లేడు, మేనమామ ఇంట ఉన్నాడు. దశరధుడు మరణించాడు, భరతుడిని వెంఠనే రమ్మని కబురు చేశారు. మరణ వార్త భరతునికి చెప్పకనే చేరింది, రాజ్యంలోకి రాగానే,తల్లిని నిలదీశాడు,నిందించాడు కూడా,తనకోసం రాజ్యం అడిగినందుకు. ”రాముణ్ణి తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తా”నని ప్రజలకి ప్రకటించి అడవులకు బయలుదేరాడు, మందీ మార్బలంతో, అలంకరించిన పట్టపుటేనుగుతో. రాముని దగ్గరకు పోయాడు, కాళ్ళ దగ్గర కూచున్నాడు. ”అన్నా! నేను రాజ్యం కావాలనికోరలేదు, నాకు రాజ్యం వద్దు, దానిని పాలించడానికి సమర్ధుడవు నువ్వే, వచ్చెయ్యి వెనక్కి,” అని ప్రాధేయపడ్డాడు. రాముడు వినలేదు, ”తండ్రిగారి మాట నిలబెట్టాడానికి అడవులకు వచ్చాను తమ్ముడూ, నన్ను ధర్మం తప్పమంటావా? వద్దు, వెళ్ళి రాజ్యం పరిపాలించ”మన్నాడు, రాముడు. భరతుడు శతవిధాల రమ్మనడం, రాముడు సహస్రవిధాలా రానని చెప్పడం జరిగిపోయింది. భరతుడు విసిగిపోయాడు,
సుమంత్రా! భూమిపై దర్భలను పరచుము, ఇచ్చటనే కూర్చొనియుందును.ధనవంతునకు అప్పు ఇచ్చి నిర్ధనుడైన బ్రాహ్మణుడు వానినుండి ధనము రాబట్టుకొనుటకు వాని గృహద్వారము కడ అన్నపానీయములు మాని పరుండునట్లు శ్రీరాముడు అయోధ్యకు మరలి వచ్చువరకు నిరాహార దీక్షను బూని ముఖమునకు ముసుగు ధరించి ఇచటనే పడియుందును, అని అంటే సుమంత్రుడు రాముని వైపుచూస్తే, ఇక తానే కుశాసనం తెచ్చుకుని వేసుకుని కూచున్నాడు,
భరతుడు. అప్పుడు రాముడు ”తమ్ముడూ నేను నీకు చేసిన అపకారమేంటయ్యా?”కాని పట్టాభిషిక్తులు కానున్న క్షత్రియులట్లు అడ్డగించుట తగదు అని చెబుతూ ఇంకా చాలా చెప్పేరు, చివరికి ”తండ్రిగారి మాట నిలబెట్టడానికి పదునాలుగేళ్ళు వనవాసం చేసి పూర్తి చేసిన తరవాత తిరిగివచ్చి, ఈ తమ్మునితో కూడి రాజ్యభారం వహిస్తా”నని ప్రజల ఎదుట చెప్పేరు. అప్పుడిక భరతుడు షరతులు చెప్పేడు, రాముని మాట వినడానికి,
1. అన్నా! ఇవి బంగారు పాదుకలు వీటిలో నీకాళ్ళొక సారి ఉంచి వాటిని నాకు ప్రసాదించు, అవియే సమస్థ లోక క్షేమము చూడగలవు అంటే పాదుకలలో కాళ్ళుంచి తీసి పాదుకలు అనుగ్రహించాడు.
2.అన్నా! రాజ్యపాలన అంతా పాదుకల ప్రతినిధిగా అంటే నీ ప్రతినిధిగా పదునాలుగేళ్ళు జరిపిస్తా, పదునాలుగేళ్ళయిన మరునాటికి నువ్వు రాలేదో నేను అగ్ని ప్రవేశం చేస్తా అంటె రాముడు ఒప్పుకున్నారు. అలా చరిత్రలో మొదటి ధర్నా శాంతి యుతంగా ముగిసింది.
No comments:
Post a Comment