మహాభారతంలో పేర్కొన్న ప్రాగ్జోతిష్యపురమే... నేటి అస్సాం రాష్ట్రం. ఈశాన్య రాష్ట్రాల పర్యాటకరంగంలో పేరుప్రఖ్యాతులుగాంచిన ఈ రాష్ట్రంలో ఉన్న విశేష పర్యాటక కేంద్రమే మజులి ద్వీపం. ఈ ద్వీపంలో... వందల ఏళ్ళుగా రాజవంశాలు, ఇతర పాలకులు వాడిన ఆయుధాలు, ధరించిన దుస్తులు నేటికీ మనం దర్శించుకోవచ్చు. మజులి ద్వీపవాసులు ఇప్పటికీ అదే తరహా దుస్తులను వాడుతుండడం హర్షించదగ్గ విషయం. హస్తకళలకు ఎంతో పేరుగాంచిన ఈ ప్రాంతం... పర్యాటక సోయగాల విషయంలో కూడా అంతే పేరుప్రఖ్యాతులు పొందింది.
అబ్బురపరిచే ‘రాస్‌లీలా’...
అలనాడు రాధాకృష్ణులు రాసక్రీడలాడిన ప్రదేశంగా చెప్పబడుతున్న ఈ ద్వీపంలో... ద్వీపవాసులు ఆ ఆనవాయితీని ఇప్పటికీ పాటిస్తుండడం విశేషం. ప్రతి ఏడాది మూడు రోజులపాటు ఎంతో అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాన్ని ‘రాస్‌లీలా’ ఉత్సవం అంటారు. కన్నులపండువగా జరిగే ఈ ఉత్సవంలో శ్రీకృష్ణుడు, గోపికల రాసలీలలను కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు. మజులి ద్వీపంలో జరిగే ఓ రకమైన ఆధ్యాత్మిక ఉత్సవం ఇది. ఇక్కడి గిరిజనులు ధరించే రంగురంగుల దుస్తులు, పూసలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. యువతీయువకులు రాధామాధవుల వేషధారణలో వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటారు. ముఖ్యంగా గోపికల వేషధారణలో సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు ఒయలుపోతూ ప్రదర్శించే నృత్యాలు ఆద్యంతం విశేషంగా ఆకట్టుకుంటాయి. మొత్తంగా ఈ ఉత్సవం ద్వాపరయుగాన్ని తలపిస్తుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి ద్వీపం...
ద్వీపం అనగానే ఎవరికైనా ఇట్టే గుర్తుకు వచ్చేది సముద్రం మధ్యలో ఉన్న భూమి. అయితే నదుల మధ్య కూడా కొన్ని ద్వీపాలు ఉంటాయి. అలాంటి అరుదైన ద్వీపమే ఈ మజులి ద్వీపం. ప్రపంచంలో ఇలా నదుల మధ్య ఉండే అరుదైన మంచినీటి ద్వీపాల్లో ఇదే పెద్ద ద్వీపం కావడం విశేషం. అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఏర్పడిన ఈ మజులి ద్వీపం సౌందర్యాన్ని మనసారా వీక్షించడానికి రెండు కళ్ళూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ ద్వీపం మధ్యలో నిర్మించిన కాటేజ్‌లలో నుండి సూర్యాస్తమయాన్ని చూడటం ఓ మరచిపోలేని మధురమైన అనుభూతి.
కొత్త జంటల మజిలీ... ఈ ‘మజులి’...
మజులి ద్వీపంలో చెట్లు, చేమలూ.. పుట్టలూ, నదీ జలాలు... ఇలా మజులి ద్వీపం గురించి ఏం చెప్పుకున్నా అవన్నీ కాలుష్యానికి దూరంగా, అతీతంగా నిలిచి ఉన్నాయి. మనిషి కాలుష్య కర్కషత్వం ఈ ప్రాంతంపై పడలేదు కాబట్టి ఇప్పటికీ. .. మజులి సౌందర్యం ఏ మాత్రం ధ్వంసం కాకుండా, స్వచ్ఛంగా, ఆహ్లాదాన్ని పంచుతోంది. ఏ రుతువులో చూసినా... తాజాదనం తొణకి సలాడే ఈ అద్భత ద్వీపంలో మానవ సంచారం గత ఐదు వందల ఏళ్ళ నుండి ఉన్నప్పటికీ... నేటికి పచ్చని సౌందర్యంతో ప్రకృతికాంత పరవశిస్తూనే వుంది.
అందుకే కొత్తగా పెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం అని చెప్పవచ్చు. అస్సాం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా హనీమూన్ కపుల్ ఇక్కడ సందడి చేస్తారు. కొత్త వాతా వరణంలో, పూర్తి కొత్తదనంతో గడపాలను కునే జంటలకు ‘మజులి’ ఓ అద్భుతమైన అనుభవాన్నిస్తుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
No comments:
Post a Comment