నమస్కారం కేవలం ఓ సాంస్కృతిక అంశం మాత్రమే కాదు. దాని వెనుక ఓ విజ్ఞానం ఉంది. మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతీసారీ ఓ చిన్న శక్తి విస్పోటనం సంభవిస్తుంది.
మీరొక వ్యక్తిని చూసినప్పుడు, అది మీరు పనిచేసే చోటైనా, వీధిలో అయినా, ఇంట్లో అయినా లేదా మరెక్కడైనా సరే, మానవ బుద్ధినైజం ఎలాంటిదంటే, అది చూసిన క్షణమే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికొచ్చేస్తుంది. “ ఆ మనిషిలో ఇది బాగుంది, ఈ మనిషిలో ఇది బాలేదు. అతను మంచివాడు, అతను మంచివాడు కాదు, అతను అందంగా ఉన్నాడు, అతను వికారంగా ఉన్నాడు” ఇలా ఎన్నో నిర్ణయాలకు వచ్చేస్తుంది. వీటన్నిటిని మీరు ప్రయత్నపూర్వకంగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఒక్క క్షణంలోనే ఈ అభిప్రాయాలు, తీర్మానాలు జరిగిపోతాయి. మీ తీర్మానాలు పూర్తిగా తప్పయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అవన్నీ జీవితంలోని మీ గతానుభావాలనుండీ వస్తున్నాయి. దేన్నైనా, ఎవరినైనా వాళ్ళు ప్రస్తుతమున్నట్టుగా మీరు గ్రహించడానికి ఇవి అనుమతించవు. ప్రస్తుతమున్నట్టుగా విషయాలని, మనుషులని గ్రహించడం చాలా ముఖ్యం. మీరు ఏ రంగంలో అయినా సమర్థవంతంగా పని చేయాలంటే, మీ ముందుకు ఎవరైనా వచ్చినప్పుడు, వారిని ప్రస్తుతం వారు ఉన్నట్టుగా అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. వారు నిన్న ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు. వారు ఈ క్షణంలో ఎలా ఉన్నారనేది చాలా ముఖ్యం. కాబట్టి, మొదట మీరు శిరస్సు వంచి నమస్కరించాలి. ఒక్కసారి మీరలా చేస్తే, మీ ఇష్టాయిష్టాలు బలపడకుండా, మెత్తబడతాయి. ఎందుకంటే వారిలో ఉన్న సృష్టి మూలాన్ని మీరు గుర్తిస్తారు. నమస్కారం చేయడం వెనక ఉన్న ఉద్దేశ్యమిదే.
సృష్టికర్త హస్త ప్రమేయం లేనిదేది సృష్టిలో లేదు. సృష్టి మూలం, ప్రతీ కణంలోనూ ప్రతీ అణువులోనూ పనిచేస్తోంది. అందుకే భారత సంస్కృతిలో, మీరు పైకి ఆకాశం వంక చూసినా, కిందికి భూమి వంక చూసినా, మీ సంస్కృతి శిరస్సు వంచి అభివాదం చేయమని చెబుతారు. మీరొక స్త్రీని కాని, పురుషుడిని కాని, పిల్లాడిని కాని, ఆవుని కాని, చెట్టుని కాని చూసారనుకోండి, మిమల్ని శిరస్సు వంచి అభివాదం చేయమంటోంది ఈ సంస్కృతి. మీలో కూడా సృష్టి మూలం ఉందన్న విషయాన్ని ఇది నిరంతరం గుర్తుచేస్తూ ఉంటుంది. మీరు దీన్ని గుర్తిస్తే, మీరు నమస్కారం చేసిన ప్రతీసారి మీరు మీ సహజ ప్రవృత్తి వైపు అడుగులు వేస్తున్నట్టే.
దీనికి మరో కోణం కూడా ఉంది. మీ అరచేతుల్లో ఎన్నో నాడుల కొసలు ఉంటాయి – దీన్ని ఈనాటి వైద్య శాస్త్రం కూడా కనుగొంది. వాస్తవానికి మీ నాలుక కన్నా, కంఠం కన్నా మీ చేతులే ఎక్కువ మాట్లాడుతాయి. యోగా ముద్రలకు సంబంధించి పూర్తి శాస్త్రమే ఉంది. మీ చేతిని కొన్ని ప్రత్యేకమైన రీతుల్లో అమరిస్తే, మీరు మీ పూర్తి వ్యవస్థనే భిన్నంగా పనిచేసేటట్లు చేయవచ్చు. మీరు మీ చేతులని జోడించిన క్షణమే, మీ ద్వైత భావనలు, మీ ఇష్టాయిష్టాలు, మీ కోరికలు, మీరు ఈసడించుకునే విషయాలు, ఇవన్నీ సమమై, తొలిగిపోతాయి. ఇలా మీరెవరో వ్యక్తీకరించుకోవడంలో ఒక రకమైన ఏకత్వం ఉంటుంది. అప్పుడు మీలోని శక్తులన్నీ ఒక్కటిగా పనిచేస్తాయి.
కాబట్టి నమస్కారం కేవలం ఓ సాంస్కృతిక అంశమే కాదు. దాని వెనకల ఓ సైన్స్ ఉంది. మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతీసారీ, ఓ చిన్న శక్తి విస్పోటనం సంభవిస్తోంది. ఇలా చేయడం వల్ల మీ జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరుగుతోంది, అంటే మిమ్మల్ని మీరు అవతలి వ్యక్తికి అర్పించుకుంటున్నారు. ఆ సమర్పణంతో మీరు అవతలి ప్రాణిని మీతో సహకరించే జీవిగా చేసుకుంటారు. మీరు కేవలం ఇచ్చే స్థితిలో ఉంటేనే, మీ చుట్టూ విషయాలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తాయి. ఇది ప్రతీ జీవికీ వర్తిస్తుంది. దాని చుట్టూ ఉన్న జీవరాసుల సహకారం ఉంటేనే, అది వృద్ధి చెందుతుంది.
No comments:
Post a Comment