భగవంతుణ్ణి నిలబెట్టిన భక్తుడు. ~ దైవదర్శనం

భగవంతుణ్ణి నిలబెట్టిన భక్తుడు.


భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానికి ఉన్నది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో తిరుపతిలాగా మహారాష్టల్రోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ‘విఠోబా’ పేరుతో వెలసియున్నాడు. విఠోబా లేక వితోబా అనే పేరు పురాణాలలో కూడా ఉన్నది. ఈ పండరినాథ భక్తితత్వాన్ని జ్ఞానేశ్వర్, నామదేవ్, ఏక్‌నాథ్, తుకారాం వంటి సంత్‌లు, సాధువులు ప్రాచుర్యంలోకి తెచ్చారు. మహావిష్ణువు పండరిలో వెలసిన విషయం గురించి రకరకాల గాథలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది పుండరీకుని వృత్తాంతము. (మహారాష్టల్రో పుండరీకుడు అంటారు) పుండరీకుడు ఒక బ్రాహ్మణ యువకుడు. మొదట్లో అతడు పరమవైష్టికుడే. తల్లిదండ్రుల ఎడ పరమభక్తిగలవాడు. ఒక రోజున స్వామి పుండరీకుని ఇంటికి వచ్చాడట. ఆ సమయంలో ఆ భక్త శిఖామణి తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నాడట. అందువల్ల వాళ్ల సేవకు భంగం కలగకుండా, మాట్లాడకుండా ఒక ఇటుక రాయిని ఆ అతిథి వేపు వేశాడట. దీనిపైన కాసేపు కూర్చోండి అన్న అర్థంతో. స్వామి పుండరీకుని మాతాపితరుల పట్ల దృఢ భక్తికి సంతసించి అక్కడే ఆ ఇటుక రాయిపై నిలబడి అలాగే ఉండిపోయారని అదే క్రమంలో ‘పండరిపురం’ అయిందని ఈ గాథ తెలుపుతున్నది.
మరొక కథలో పుండరీకుడు భార్యను గుర్రంపై ఎక్కించుకొని కాశీకి బయలుదేరాడట. 

తల్లిదండ్రులను మాత్రం నడిపించాడు. వారు అలా వస్తూ వస్తూ కుక్కుటస్వామి ఆశ్రమం చేరుకొంటారు. యాత్రికులు విశ్రాంతి తీసుకోవాలనుకొంటారు. ఆ రోజు రాత్రి పుండరీకునికి నిద్రపట్టలేదు. వేకువ ఝామున అతనికి కొందరు అందమైన యువతులు కనబడ్డారు. కాని వాళ్లు మురికిగుడ్డలు ధరించి ఉన్నారు. వాళ్లు ఆ ఆశ్రమం చేరి దాన్ని శుభ్రపరచి ఆ ఋషి వర్యుని వస్త్రాలు ఉతికి శుభ్రం చేసి, ప్రార్థనలు చేసి తిరిగి వచ్చినప్పుడు చూస్తే వాళ్లు స్వచ్ఛమైన కాంతులీనుతున్న బట్టలతో వెలిగిపోతున్నారు. వాళ్లు వెంటనే మాయమైనారు. ఈ దృశ్యం పుండరీకునిలో కొంతమార్పు తెచ్చింది. మరుసటి రోజు రాత్రి మెళకువతో ఉన్నాడు పుండరీకుడు. నిన్నటిది నిజమో భ్రమో తెలుసుకోవాలని అతనికి అనిపించింది. రెండోరోజున వాళ్లు వచ్చారు. ధైర్యం తెచ్చుకుని మీరెవరు అని వాళ్లను అడిగారు పుండరీకుడు. ‘మేము గంగా, యమున అనే నదులం’’ అని వాళ్లు చెప్పారు. పాపాలు చేసిన వాళ్లు తమలో మునగడం వల్ల వాళ్ల పాపం మాకు చేరి మేము మురికిగా కనిపించాం. కాని ఈ ఋషివర్యుని సేవతో మాకు అంటుకున్న పాపరాశి దగ్ధమై తిరిగి మేము పుణ్యవంతులుగా మారాము. ఈ ఋషి చేసుకొన్న తల్లితండ్రుల సేవే ఇతనికి ఇంతటి శక్తి నిచ్చింది అని చెప్పారు. దాంతో ఈ పుండరీకునికి తాను చేస్తున్న తప్పు తెలిసింది. దాంతో అతనిలో హృదయ పరివర్తనవచ్చింది. ఇక నన్ను పాపం నుంచి రక్షించాల్సింది దేవదేవుడే నని భగవంతుని ప్రార్థించాడు. అప్పట్నుంచి తల్లితండ్రుల సేవ పుండరీకుడు ఏమరలేదు. భగవంతునిపై భక్తినీ మరువలేదు. దానితో మహావిష్ణువు ప్రత్యక్షమై నీకేమి కావాలని అడిగితే నీవే ఈ పండరిపురానే్న వైకుంఠం చేయమని కోరాడాభక్తుడు. భక్తుని కోరికను తీర్చే వికుంఠుడు విఠలనామంతో పండరిలో కొలువైయ్యాడని ఈ కథనం చెప్తోంది. ఇక్కడే నిలబడిపోయిన శ్రీకృష్ణ పరమాత్మ విఠల నామంతో ప్రస్తుతించబడుతున్నారు. ‘విఠల’ అనే పదం ‘విట్టు’ అనే పదం నుండి వచ్చింది. కన్నడంలో మరాటలో ‘విట్టు’ అంటే ‘ఇటుక’ అని అర్థం. ఇటుకపై నిలబడిపోయిన శ్రీమహావిష్ణువే పండరి విఠలనాధుడు. ఇక్కడ స్వామి రుక్మిణి సహితుడై భక్తులకు దర్శనమిచ్చి తరింపచేస్తున్నారు.

తుకారాం చిన్న కొడుకు నారాయణిబాబా పండరిలో పల్లకిసేవ కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పదకొండో రోజున ఎక్కడో పూరి నుండి బయలుదేరిన ఈ పల్లకీలు పండరి చేరుకొంటాయి. భక్తులు ‘జైజై వితాబా రఖూమాయ్’ అని సంతోషంలో ఎలుగెత్తి నినదిస్తూ ఈ ఊరేగింపులో పాల్గొంటారు. (రఖూమాయ్ అంటే మరాటీలో మాతా రుక్మిణి అని అర్థం)

ఈ ఆలయంలో మొదటి మెట్టు ‘నాందేవ్ మెట్టు’. దీని గురించి కూడా ఒక విశేషం చెప్పుకొంటారు. చిన్నప్పటి నుండి నామదేవుడు గొప్ప విష్ణు భక్తుడు. ఒకరోజున వాళ్లనాన్నగారు ఇంట్లో లేకపోవడంతో వాళ్ల అమ్మ ‘‘నీవు నైవేద్యం తీసుకెళ్లు’’ అన్నదట. ఎంతసేపు వేచి చూచినా స్వామి వచ్చి నైవేద్యం భుజించడంలేదు. బాగా విసిగి పోయాడు. నిరాశతో తన తలను స్వామి పాదాలకేసి గట్టిగా కొట్టుకోవడం ఆరంభించారు. స్వామి ఆ అమాయక బాల భక్తుని దృఢదీక్షకు ముగ్ధుడై నిజరూపంలో వచ్చి నైవేద్యం స్వయంగా భుజించి దీవించాడు. ‘స్వామీ! నీవు ఈ మెట్టుపై నిలబడిపో’ అని అర్థించాడు. వచ్చిన భక్తులను దీవించడానికి స్వామి ఆ దేవాలయ మొదటి మెట్టుపై ఉన్నాడని, అందుకే దానికి ‘నాందేమ్ భీపహ్రి’ అని పేరు వచ్చిందని అంటారు. (‘పహ్రి’ అంటే మెట్టు మరాఠీలో). మొదట్లో భక్తులు స్వామి పాదాలను తాకేవారు. కాని అది దెబ్బతింటుందని ఈ పద్ధతి ఆపివేశారు. ఆ భీమా నదే ‘స్వయంభాగా’ నదిగా పిలుస్తారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List