అసూయను పారద్రోలే ఘృష్ణేశ్వరుడు. ~ దైవదర్శనం

అసూయను పారద్రోలే ఘృష్ణేశ్వరుడు.


ఆ స్వామిని ఏ పేరుపెట్టి పిలిచినా వచ్చి ఆదుకుంటాడు. భక్తితో ఏది సమర్పించినా అందుకుని కటాక్షిస్తాడు. అందుకే ఆ స్వామి భక్తవశంకరునిగా, భోళాశంకరునిగా పూజలందుకుంటున్నాడు. శివ పూజ అనేది ప్రాప్తంతో కూడుకున్నది. శివానుగ్రహం ఉంటేనే గానీ శివపూజ లభించదు. శివపూజకు ఎలాంటి నియమ నిబంధనలూ లేవు. భక్తితో రెండు చుక్కలు నీరుపోస్తే మహాదేవుడైన ఆ స్వామి పెద్దమనసు చేసుకుని కటాక్షిస్తాడు. అయితే ఉండాల్సిందల్లా భక్తి, విశ్వాసం. శివుడు తన భక్తుల్ని అనుగ్రహించడానికి అనేకచోట్ల వెలిసినప్పటికీ, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలే ఎక్కువగా ప్రసిద్ధిపొందాయి. కారణం ఆయా క్షేత్రాలలో శివుడు భక్తుల అభీష్టంమేరకు లోక కళ్యాణంకోసం వెలిశాడు. అలా శివుడు తనకుతానుగా ఆవిర్భవించిన క్షేత్రాలే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రసిద్ధిపొందాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల మహిమ అపారం. ఆ మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో వెలసిన మరో పుణ్యధామం ‘వెరూల్’. మహారాష్టల్రోని ఔరంగాబాద్‌కు 35 కిలోమీటర్లు దూరంలో ఉందిది. 

శివుడు ఇక్కడ ఘృష్ణేశ్వరస్వామిగా కొలువులందుకుంటున్నాడు. వెరూల్ దివ్యక్షేత్రంలోని శ్రీఘృష్ణేశ్వర స్వామి ఆలయం సుందరమైనది. మనోహరమైన కట్టడాలతో అలరారుతున్న ఈ ఆలయం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ దివ్యాలయాన్ని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. సాక్షాత్తు మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిసిన వెరూల్ దివ్యక్షేత్రంలో పూర్వం నాగజాతి ఆదివాసులుండేవారు. ‘బాంబీ’ అంటే పాముల పుట్టలని అర్థం. పాముపుట్టలను మరాఠీలో ‘వారుళ్’అంటారు. వారుళే కాలక్రమంలో వెరూల్‌గా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. అలాగే పూర్వకాలంలో ఈ క్షేత్రాన్ని ‘యెల’అనే రాజు పాలించేవాడు. అతని రాజధాని ‘యేలాపూర్’. ఆ యేలాపూర్ యేలూరుగా, వెరూల్‌గా పేర్గొంచింది. మనోహరమైన కట్టడాలు, ప్రాకారాలతో అందంగా అలరారుతున్న శ్రీ ఘృష్ణేశ్వరస్వామి ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయాన్ని జైజాబాయి, అహిల్యాదేవి హోల్కర్ తదితర భక్తులు పునర్నిర్మించారు. అలాగే ఈ ఆలయ గోపురానికి జయరామ్ భాటియా అనే భక్తుడు స్వర్ణరేకు తాపడంచేశాడు. అలాగే 24రాళ్ళ స్తంభాలతో సభామండపాన్ని కూడా చేయించాడు. అతి పురాతనమైన ఘృష్ణేశ్వరం మహిమాన్వితమైనది. శివుడు ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది.
పూర్వం దేవ పర్వతంపై సుదేహ, సుధర్ముడనే బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. సుదేహకు సంతానం కల్గకపోవడంతో తన చెల్లెలు అయిన ధుశ్శను తన భర్తకిచ్చి వివాహంచేసింది. కొంతకాలానికి ధుశ్శ గర్భాన్ని ధరించి ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ కొడుకు పెద్దవాడై సంతోష భాగ్యాలతో ఉండడంతో ద్వేషాన్నిపెంచుకున్న సుదేహ, తన చెల్లెలు ధుశ్శ కొడుకును చంపించి, చెరువులో పడవేయించిందట. శివభక్తురాలైన ధుశ్శ తన కొడుకు మరణించినా చెక్కుచెదరకుండా శివార్చన చేసిందట.

శివుడు అనుగ్రహించి ధుశ్శ కొడుకుకి పునర్జీవితం ప్రసాదించాడు. దీనికి కారణమైన సుదేహను భస్మంచేయడానికి ఉద్యుక్తుడవుతుండగా తన అక్క చేసిన పాపాన్ని క్షమించమని, లోకకళ్యాణం కోసం స్వామిని అక్కడ వెలవమని ప్రార్థించిందట. ధుశ్శ అభీష్టంమేరకు శివుడు అక్కడ ధుశమేశ కామధేయుడై జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అలాగే స్వామి ఇక్కడ వెలవడం వెనుక మరో పురాణ గాథ కూడా ఉంది. ఒకరోజు శివుడు, పార్వతి కామ్యక వనంలో ఏకాంతంలో ఉండగా పార్వతికి దాహం వేసిందట. అపుడు శివుడు పాతాళంనుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్గాంచింది. పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ, కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారయ్యిందట. ఆ లింగంనుంచి ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా పార్వతిమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో వుంచి, లోక కళ్యాణంకోసం అక్కడ ప్రతిష్టించిందట. ఆనాటినుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడనే పేరొచ్చింది. సాక్షాత్తు పార్వతిమాత ప్రతిష్టించిన జ్యోతిర్లింగం కాబట్టే దీనికి ఇంతటి మహత్తు ఏర్పడిందంటారు. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఆలయం విశాలమైనది. పూర్తిగా రాతి కట్టడం, ఆలయానికి ముందు భారీ ఆకారంలో ఉన్న రాతి నంది ఉంది. ఈ నంది శిల్పం అందం వర్ణనాతీతం. గర్భాలయానికి ముందు ఎడమవైపు భాగంలో విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. ఆలయ ప్రాంగణంలో పార్వతి మాత ఆలయం ఉంది. గర్భాలయంలో ఉన్న ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనం సర్వపాప హరణం. ముక్తిదాయకం. భూమిలోకి చొచ్చుకుపోయి ఉన్న ఈ జ్యోతిర్లింగానికి దిన వారాలతో పనిలేకుండా జల, ఫల, పుష్ప, పంచామృతాభిషేకాలు జరుగుతాయి. అలాగే మాఘ, కార్తీక మాసాలలో ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఇంకా ఆంజనేయస్వామి, వినాయక మందిరాలు కూడా ఉంది. ఘృష్ణేశ్వరంలో బసచేయడానికి పెద్దగా వసతి సౌకర్యం లేదు. అందువల్ల ఔరంగాబాద్‌లో బసచేసి ఈ స్వామిని దర్శించుకోవచ్చు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List