ఉమామహేశ్వరక్షేత్రం.. ~ దైవదర్శనం

ఉమామహేశ్వరక్షేత్రం..


మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు 8 కిలోమీటర్లున్న రంగాపూర్ గ్రామం నుంచి దక్షిణ దిశగా నాలుగు కిలో మీటర్లదూరంలోని 500 అడుగుల ఎత్తయిన పర్వత కనుమల మీద నెలకొనుంది ఉమామహేశ్వరక్షేత్రం. నల్లమలలోని ఈ కొండ ఎగువన ఉమామహేశ్వరం, దిగువన భోగమహేశ్వరం ఉన్నాయి. పైకి పోవడానికి మెట్లదారే కాక ఘాట్‌రోడ్డూ ఉంది. ప్రత్యేక బస్సు సదుపాయాలు లేవు కానీ సొంత వాహనాలపై వెళ్లొచ్చు. ఈ పర్వత కనుమలు ధనస్సు ఆకారంలో వంపులు తిరిగి చూడముచ్చటగా ఉంటాయి. స్కంధ పురాణంలో వర్ణించిన శ్రీశైల క్షేత్రానికి ఉమామహేశ్వరం ఉత్తర ద్వారం కాగ అలంపూర్ క్షేత్రం పశ్చిమ ద్వారమై, కర్నూలుజిల్లాలోని త్రిపురాంతకం తూర్పు ద్వారంగాను, కడప జిల్లాలోని సిద్ధవట క్షేత్రం దక్షిణ ద్వారంగానూ ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడి రుద్రధారలో స్నానంచేసి మహేశ్వరుని దర్శిస్తే మరల జన్మ ఉండదట. ఈ క్షేత్రంలో అణువంత బంగారం దానమిచ్చినా భూమినంతటిని దానమిచ్చిన ఫలాన్ని పొందుతారని, ఇక్కడ పట్టెడన్నం పెడితే లెక్కలేనంతమందికి అన్నదానం చేసిన ఫలం వస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఒకరాత్రి నిద్రపోతే కాశీ, ప్రయాగాది పుణ్యక్షేత్రాలలో అనేక లక్షల సంవత్సరాలు నివసించిన ఫలాన్ని పొందుతారట. ఇక్కడ మరణించిన జీవులు అగ్నిలో ఆహుతులవలె ఈశ్వరుడిలో ఐక్యం అవుతాయని విశ్వాసం. ఈ ద్వారాన్ని కుబేరుడు రక్షిస్తూ ఉంటాడని ప్రతీతి. ఈ ఉమామహేశ్వరక్షేత్రం అయిదామడల వెడల్పు, పదామడల పొడవు కలిగి రుద్రధార, విష్ణుధార, బ్రహ్మధార, ఇంధ్రధార, దేవదార అనే పంచతీర్థాలతో అలరారుతుంది.
ఈ ప్రాంతంలోని కొండదారుల్లో అనేక లింగాలు కనబడుతుంటాయి. శివరాత్రి మహాపర్వదినం నాడు మహేశ్వరుని సేవించేందుకు ఇక్కడికి ముల్లోకాలనుంచి సకలదేవతాగణాలతో దేవకన్యలు వస్తారని, ఈ స్వామిని సేవించేవారికి శివసాయుజ్యం లభిస్తుందని శ్రీశైలఖండం పేర్కొన్నది. విశాలమైన మండపం, నేలపై భూప్రస్తార శిలాశ్రీచక్రమూ ఉన్నాయి. ఉమామహేశ్వరుడి ఎదురుగా మండపంలో శిల్పకళ ఉట్టిపడే నందీశ్వర విగ్రహం ప్రతిష్ఠించి ఉంది. మండపంలో శిల్పాస్తంభాలపై బ్రహ్మ, నగ్ననృత్యబాలికలు, పుష్పధారిణులు, ద్విభుజదేవీమూర్తులు, మహాశిలను మోస్తున్న గరుడ, హనుమంతులు, కోతిని కరచిపట్టిఉన్న నృత్యసుందరి, గజవాహనుడైన ఇంద్రుడు మొదలైన శిల్పకళావిన్యాసం చూపరుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. స్వామివారికి ప్రతిరోజు పూజలు. ప్రతి సంవత్సరం ఉత్సవాలూ నిర్వహిస్తారు. ఆషాడశుద్ధ ఏకాదశినాడు అభిషేకాలు, విశేషపూజలు జరుగుతాయి. సంక్రాంతి, శివరాత్రి, దసరారోజు. ఆలయంలో ప్రధానోత్సవాలు ఉంటాయి. యేటా పుష్యశుద్ధ పాడ్యమికి జరిగే బ్రహ్మోత్సవాల్లో అచ్చంపేట పట్టణంలోని భ్రమరాంబ ఆలయం దేవాలయం నుంచి పార్వతీపరమేశ్వరుల ఉత్సవవిగ్రహాలను అలంకరణతో ఊరేగింపు తీసుకెళ్లి ఉమామహేశ్వరక్షేత్రంలో కల్యాణం జరిపించే ఆనవాయితీ ఉంది.
మండు వేసవిలో కూడా మంచుకొండలా హాయినిస్తూ యాత్రికుల్ని ఆనంద పరవశంలో ముంచెత్తుతుంది ఈ క్షేత్ర వాతావరణం. శ్రీశైలం, మద్దిమడుగు, మల్లెలతీర్థం, సలేశ్వరం, నిజాంకాలంనాటి ఫరహాబాద్ వ్యూపాయింట్ తదితర దర్శనీయప్రదేశాలు నల్లమలలో ప్రధానరహదారి మధ్య ఉండడం వల్ల ప్రతిరోజు రాష్ట్రం నలుమూలల నుంచేకాక రాష్ట్రేతర ప్రాంతాల నుంచీ ఉమామహేశ్వరం క్షేత్రానికి వస్తుంటారు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List