పచ్చని కోనసీమ అందాలు, విశాలంగా పరుచుకున్న సుందర దృశ్యాల నడుమ అలరారుతున్న ‘అయినవిల్లి’ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా ముక్తేశ్వరానికి సమీపంలో ఉంది. పవిత్ర గోదావరి నదీమతల్లి పాయ ఒడ్డున అలరారుతున్న అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయకస్వామివారి ఆలయాన్ని తొలుత దేవతలు నిర్మించారని ఇక్కడి స్థల పురాణాలు చెప్తాయ. సర్వశుభ కార్యాలలోనూ విఘ్నేశ్వరునికే అగ్ర పూజ. దేవతాసమూహంలో గణపతికి విశిష్టస్థానముంది.
విష్ణువు ఆయనే…ఓంకారం ఆయనే… సిద్ధిని, బుద్ధినీ ఇచ్చేది ఆయనే…అలాంటి మహిమాన్విత దైవం విఘ్నవినాయకుడు కొలువైన దివ్యథామం అయినవిల్లి. అనంతరంతర కాలంలో ఆలయ పునర్నిర్మాణాలు, అభివృద్ధి పనులు పెద్దాపురం సంస్థానాదీశులు నిర్వహించినట్లు చారిత్రక ఆధారాల తెలుపుతున్నాయ. ఈ క్షేత్రానికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో చేసిన దక్షయజ్ఞం నిర్వహించేముందు విఘ్నవినాయకుడైన అయినవిల్లి వినాయకుని పూజించి పునీతుడైనట్లు క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే వ్యాస మహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుడ్ని ప్రతిష్టించాడని మరో కథ ప్రచారంలో ఉంది. సిద్ధివినాయక స్వామి ఆలయంతోపాటు కొన్ని ఉపాలయాలతో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ దివ్యాలయం ఆధ్యాత్మికానురక్తిని ద్విగుణీకృతం చేస్తుంది.
ఈ సృష్టిలో ప్రప్రథమంగా పూజలందుకునే స్వామి విఘ్నేశ్వరుడు. తనలో ఈశ్వర అంశను పుణికిపుచ్చుకున్న ఆ స్వామి తనను నమ్మి దర్శించే భక్తుల మనోభిష్టాలు నెరవేరుస్తాడని భక్తులు దృఢంగా నమ్ముతారు. ఆ కారణంగానే భక్తులు సర్వప్రాపంచిక విషయాలు పక్కనపెట్టి, నిర్మల చిత్తంతో దక్షిణ ముఖంగా ఉన్న సిద్ధివినాయక స్వామిని మనసావాచా కొలుస్తారు. అలాగే ఇక్కడ కొలువైన స్వామిని దర్బ గడ్డితో పూజిస్తే, మనోవాంచలన్నీ నెరవేరుతాయన్న నానుడి ఉంది. భక్తజన సందోహంతో సందడిగా ఉండే ఈ ఆలయంలో స్వామికి నిత్య పూజలు, అర్చనాభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే ఆలయ ప్రాంగణంలో అన్నపూర్ణ సమేత విశే్వశ్వరస్వామి దర్శనమిస్తారు. సాక్షాత్తు విఘ్నవినాయకుడికి తల్లిదండ్రులైన ఆ తేజోమూర్తుల దర్శనం శుభదాయకం.
అయినవిల్లి శ్రీ సిద్ధివినాయక క్షేత్రం శివకేశవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఒకపక్క కాశీ విశే్వశ్వరస్వామి కొలువై ఉంటే మరోపక్క శ్రీదేవిభూదేవి సమేత కేశవస్వామి నయనానందకరంగా దర్శనమిస్తారు. అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయకస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. శివ అంశతో ఉదయించిన ఆ స్వామి దర్శనం సదా మంగళకరం. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క అయ్యప్పస్వామి, ఇంకో పక్క గంగామాతలు దర్శనమిచ్చి, భక్తులను నిత్యమూ అనుగ్రహిస్తూ ఉంటారు. నిత్యమూ భక్తులతోనూ, వారి అర్చనలు, అభిషేకాలతోనూ ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపించే ఈ దివ్యధామంలో కొలువైన శ్రీ సిద్ధివినాయకస్వామి దర్శన భాగ్యం పూర్వజన్మల సుకృత ఫలంగా పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతి పురుషులకు పూర్వమే ఉద్భవించిన విశ్వవ్యాప్తమైన ప్రణవ స్వరూపమే గజాననుడు. ఆ స్వామి యోగులకు పరబ్రహ్మ, నర్తకులకు నాట్యాచార్యుడు, భాగవతులకు గానమూర్తి, విద్యాకాంక్ష గలవారికి విద్యాగణపతి. సామాన్య మానవులకు సంకటహరుడు, సర్వసిద్ధి ప్రదాత. ఏకాత్మకు సంకేతమయిన వినాయకుడు విశ్వజన ప్రియుడు.
No comments:
Post a Comment