రెండు శివలింగాలు, రెండు నందులు కొలువై ప్రత్యేకమైన అలయం. ~ దైవదర్శనం

రెండు శివలింగాలు, రెండు నందులు కొలువై ప్రత్యేకమైన అలయం.

రాతి గుట్టపై కట్టిన ఆ ఆలయం దూరం నుంచే రమ్మని ఆహ్వానిస్తుంది. అటుగా వెళ్తూ చూస్తేచాలు.. దగ్గరికి వెళ్తే బాగుండు అన్పిస్తుంది. చుట్టూ వ్యవసాయం.. మధ్యలో రాతి కొండపై శివాలయం. ప్రకృతిని ఆస్వాదిస్తూ పైకి వెళ్తుంటే ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదమూ అంతకంతకూ పెరుగుతుంది. కనీస అవగాహన ఉన్న ఎవ్వరికైనా.. లోనికి ఆహ్వానించే మహాద్వారం నుంచేసరికొత్త సందేహం తలెత్తక మానదు.
నల్లగొండ జిల్లా చండూరు మండలం ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు, పురాతన నేపథ్యాలకు ఆలవాలమైన ప్రాంతం. మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల పల్లె తుమ్మలపల్లి సైతం అలాంటి ఓ అపురూప ఆనవాలుకు వేదిక. ఈ గ్రామం శివార్లలో పురాతన దేవుడిగుట్ట ఉంది. ఈ గుట్టపైనే స్థానిక రామలింగేశ్వరాలయం మిగతా ఆలయాలకు భిన్నంగా ప్రత్యేకతను చాటుతోంది. ఎక్కడైనా దేవుడి గుళ్లలో ప్రధాన విగ్రహం ఒక్కటే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రెండు శివలింగాలు కొలువై ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
ఈ రామలింగేశ్వరాలయం 16వ శతాబ్ధంలో నిర్మితమైంది. తుమ్మలపల్లికి సమీపంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారులు రాంసింగ్, సీతసింగ్ ఈ గ్రామం గుండా వెళ్తూ గుట్ట పైన సొరంగాన్ని గుర్తించారు. వాళ్ల చొరవతోనే తవ్వకాలు జరిపించి శివలింగాన్ని వెలికితీశారు. అయితే ఇద్దరు అన్నాదమ్ముళ్లు కావడం... ఒక్కటే శివలింగం లభించడంతో నిరాశకు గురయ్యారు.
ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లు.. చెరో లింగం ఉండాలని, గుట్టపై ఇద్దరికీ ప్రత్యేక ఆలయాలు ఉండాలని కోరుకున్నారు. అనుకున్నదే తడువుగా తమ అక్క నర్సమ్మ అనుమతితో రెండో శివలింగం చెక్కించారు. రెండింటికీ వేర్వేరు ఆలయాలు పక్క పక్కనే కట్టించారు. వాటి ఎదురుగా రెండు నందులను ప్రతిష్ఠించారు. వెలుపల గణపతి విగ్రహాలు సైతం రెండు పెట్టించారు. ఆలయాల ఎదురుగానే అలనాటి కాలంలో చెక్కించిన రాతి ధ్వజస్తంభాలు సైతం రెండు స్థాపించారు. సహజ సిద్ధంగా వెలిసిన కోనేరు ఒక్కటి ఉండగా.. దానికి అనుబంధంగా ప్రాకారం వెలుపల మరో కోనేరు నిర్మించారు. ఇద్దరు అన్నాదమ్ముళ్లకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించిన తర్వాత.. అక్క నర్సమ్మ కోసం మరో ఆలయాన్ని పక్కనే ఉన్న నర్సింహులగూడెంలో కట్టించారు. వీటితోపాటు ఇప్పటికీ ఆ ఆలయమూ దేదీప్యమానంగా వెలుగొందుతూనే ఉంది.
అన్నాదమ్ముళ్లు ఇద్దరూ పోటీ పడి కట్టుకోవడంతో ఈ రామలింగేశ్వరాలయంలో అన్నీ రెండు రెండు ఉన్నాయి. శివలింగాలు, గర్బ గుడి గోపురాలు, నంది విగ్రహాలు, ధ్వజస్తంభాలు, కోనేటి గుండాలు, గణపతి దేవుళ్లు.. అన్నీ రెండు కనిపిస్తాయి ఈ ఆలయ ప్రాంగణంలో. శివలింగాలు కొలువైన రెండు ఆలయాలు పక్కపక్కనే ఉంచి వాటి ఎదురుగా నందీశ్వరులను ప్రతిష్టించారు. ఈ ఆలయాల పక్కనే పుట్టుగండం(నీటి గుండం) ఉండగా.. నాలుగు అడుగులు వెనక్కి వేసి చూస్తే రెండు గోపురాలు జోడుగా కనిపిస్తాయి. మహాద్వారాల వైపు ఎత్తయిన రెండు రాతి ధ్వజస్తంభాలు జంటగా దర్శనమిస్తాయి. బయటికి వెళ్తున్నా.. లోనికి వస్తున్నా మహాద్వారాలు కూడా రెండూ స్వాగతిస్తుంటాయి. ప్రధాన ఆలయాల చెంతన ఒక్కటి, ప్రాకారం వెలుపల మరొకటి రెండు వినాయక విగ్రహాలు సైతం ప్రతిష్ఠించారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List