.
కశ్యప, కద్రువ దంపతులకు చాలామంది సర్పరూప సంతానం ఉంటారు. జనమేజయుడనే చక్రవర్తి చేస్తున్న సర్పయాగంలో వారందరూ ఆహుతి కాబోవుచున్న సమయంలో వారిలో అనంతుడనే సర్పము విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి ఆ ఆపదనుంచి రక్షించబడతాడు. అనంతుడు తపస్సు చేసిన ఆ చోటనే విష్ణుమూర్తిని మూల భావనారాయణ స్వామి గా ప్రతిష్ఠ చేశాడట. ఇది పురాణాలలో చెప్పిఉన్నందున, ఈ ప్రతిష్ఠని పురాణవ్యక్తమైన మూర్తి అంటారు. ఒక సర్పముచే ప్రతిష్ఠించబడిన మూర్తి గల క్షేత్రం కనుక ఈ ఊరిని సర్పవరం అని పిలుస్తారు.
ఒకసారి నారద మహర్షి దేవతలసభలో 'విష్ణుమాయను తెలుసుకోవడం నిరంతర నారాయణ జపం చేసే తనకు సాధ్యమని ' పలికెనట. తరువాత కొంతకాలానికి ఆయన భూలోక సంచారంచేస్తూ ఒక సుందరమైన సరస్సు చూసి, అక్కడ స్నానము చేయవలెనని తలచి, ఆసరస్సులో మునిగి తేలేసరికి విష్ణుమాయ వలన స్త్రీ రూపం పొదుతాడు.స్త్రీరూపంలో ఉన్న నారదుడిని నారదస్త్రీ అని వ్యవహరిస్తారు.
ఆమె పీఠికాపుర మహారాజుని వివాహమాడి 60మంది సంతానాన్ని కంటుంది.వారి పేర్లే 60 తెలుగు సంవత్సరాలపేర్లని చెబుతారు.పొరుగు రాజ్యంతో జరిగిన యుద్దంలో నారదస్త్రీ యొక్క భర్తా, 60మంది సంతానమూ మరణిస్తారు. అప్పుడు ఆమె ఆకలిబాధతో తనవారినిపోగొట్టుకొన్న దు:ఖ్ఖాన్ని కూడా మరచి అలమటిస్తుండగా ఒక బ్రాహ్మణుడు అక్కడ ఉన్న సరస్సులో ఆమె ఎడమచేయి తడవకుండా స్నానం చెయ్యమని చెబుతాడు.
అతనుచెప్పిన విధంగానే సరస్సులో స్నానం చేసి భయటకు వచ్చేసరికి ఆమెకి అసలు రూపం వస్తుంది కానీ ఎడమచేతికి ఉన్న గాజులు అలానే మిగిలిపోతాయి. బ్రాహ్మణుడు ఎక్కడా కనిపించడు. నారదమహర్షి విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి వాటిని వదిలించుకొంటాడు. అప్పుడు నారద మహర్షి రాజ్యలక్ష్మీ సమేత శ్రీ భావన్నారాయణ స్వామిని ప్రతిష్ఠిస్తాడు. నారదుని గర్వమనే భవరోగాన్ని వదిలించినస్వామి కనుక ఈయనను భావన్నారాయణ స్వామి అంటారు. ఋషిచే ప్రతిష్ఠించబడినది కావున ఈ క్షేత్రాన్ని ఆౠషం అంటారు.
ఇక్కడ స్వయంభూగా వెలసిన పాతాళ భావనారాయణ స్వామికూడా ఉంది. ముగ్గురు మూర్తులున్న దీనిని త్రిలింగ క్షోణి వైకుంఠము అంటారు. శ్రీ కృష్ణదేవరాయల తండ్రి వసంతభోగరాయలు నిర్మించిన మండపం ఈ దేవాలయంలో ఉంది. ఈ విషయం ఇక్కడి శాశనాల వల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడంవల్ల 108 నారాయణ క్షేత్రాలు దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు.
కాకినాడలో, సర్పవరం జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైనదని చెప్పబడుతున్న ఒక దేవాలయం ఉంది! అదే సర్పవరం శ్రీభావనారాయణ స్వామి దేవాలయం. ఎత్తైన గాలిగోపురం, విశాలమైన ప్రాంగణం, పురాతనంగా కనిపించే మండపమూ, ప్రవేశద్వారాలూ, నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంబమూ… మనకి ఒక కొత్త అనుభూతి కలుగజేస్తాయి. గాలిగోపురానికి ఎదురుగా రోడ్డుకి అవతలివైపు నారదుడు స్నానం చేశాడని చెప్పబడే కొలను ఉంది.
మాఘమాసంలో నాలుగు ఆదివారాలూ తిరుణాళ్ళు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణం ఘనంగా జరుగుతుంది.
No comments:
Post a Comment