సొరంగ మార్గంలో కొలువైన దేవదేవుడు: నడుము లోతు నీటిలో, కొంత దూరం సొరంగ మార్గంలో ప్రయాణిస్తే తప్ప జర్న నృసింహస్వామి మూల విరాట్ విగ్రహాన్ని మనం దర్శించుకోలేం. ఈ అరుదైన దేవాలయం జహీరాబాద్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణంలో ఉంది. అనేక చారిత్రక ఆనవాళ్లకు నిలయమైన ఈ పట్టణంలో పేరెన్నిక గన్న సందర్శనీయ ప్రదేశం నృసింహస్వామి దేవాలయం.
బీదర్ పట్టణంలోని జర్న నృసింహస్వామి దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయం కొండల మధ్య ఉంది. ఒక కొండను తొలిచి దీనిని నిర్మించారు. అంతేకాక, ఈ స్వామి మూలవిరాట్‌ను దర్శించుకోవడానికి నడుము లోతు నీటిలో సొరంగ మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది.దుర్జనులను హరించి సజ్జనులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతరాలలో నృసింహస్వామి అవతారం ఒకటి. భయంకర రూపంలో ఉన్నప్పటికీ భక్తులను కరుణించే మహాదేవుడు ఆయన. తన దగ్గరకు వచ్చే భక్తుల భయాలు పోగొట్టి, వారికి ఆభయమిచ్చి చల్లని చూపుతో ఏలుతున్న దేవుదేవుడుగా జర్న నృసింహస్వామి ప్రసిద్ధుడైనాడు. అందుకే, ఆ దేవునికి వద్దకు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆశ్చర్యకరంగా సొరంగ మార్గంలోని గుడిలో కొలువై, భక్తుల కోర్కెలను తీరుస్తూ, ఎందరికో ఇలవేల్పుగా వెలుగొందుతున్నాడు. జర అంటే నీటి ధార. ఇక్కడ నృసింహస్వామి వారు ఏ కాలంలోనైనా జరలో కొలువు దీరి ఉంటారు. కాబట్టే, ఈ దేవాలయాన్ని ‘జర్న నృసింహస్వామి దేవాలయం’గా పిలుస్తారు. ఈ స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతి రోజూ వివిధ ప్రాంతాల నుంచి బీదర్ పట్టణానికి పెద్ద ఎత్తున జనం తరలివస్తారు. అక్కడ సొరంగ మార్గంలో నీటి ధారలో తడుస్తూ వెళ్లి నృసింహస్వామిని దర్శించుకుని, పూజలు చేస్తుంటారు. ఈ జర్న నృసింహస్వామిని దర్శించుకుంటే పాపాలు, భయాలు తొలగుతాయని పెద్దలు చెబుతుంటారు.
ఎంతో ప్రసిద్ది చెందిన బీదర్ జర్న నృసింహస్వామి దేవాలయానికి వెళ్లాలంటే బస్, రైలు సౌకర్యాలు రెండూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి, జహీరాబాద్ మీదుగా నేరుగా ఆర్టీసీ బస్సులలో బీదర్ పట్టణానికి చేరవచ్చు. అక్కడ ఆటోలు, ట్యాక్సీలను నామమాత్రపు అద్దెకు మాట్లాడుకుని జర్న నృసింహస్వామి దేవాలయానికి చేరుకోవచ్చు. అనంతరం సొరంగ మార్గంలోని నీటి ధారపై కొలువు దీరిన మూల విరాఠు నృసింహస్వామిని దర్శించుకుని, పూజలు చేసి మొక్కులు తీర్చుకోవచ్చు.
రైలు మార్గం: సికింద్రాబాద్ నుంచి బీదర్ పట్టణానికి చేరుకోవడానికి అనేక రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్-ముంబాయి, సికింద్రాబాద్-షిర్డీ, సికింద్రాబాద్-బీదర్ మార్గంలో అవి నడుస్తుంటాయి. బీదర్ నుంచి సికింద్రాబాద్‌కు ఇంటర్‌సిటీ రైల్వే సౌకర్యమూ ఉంది.
ఇక్కడి నృసింహస్వామి మూలవిరాట్ స్వరూపాన్ని చూడాలంటే మాత్రం ఎంతటి వారైనా ఆలయం నుండి మరి కొద్ది దూరం వెళ్లాల్సిందే. అదీ కూడా నీటి ధారలో నడుస్తూ, తడుస్తూ! దాదాపు మోకాలు లోతు నీరు అక్కడ ఉంటుంది. ఈ దారిగుండా కొన్ని ఫర్లాంగుల దూరం వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్లిన తర్వాత సొరంగంలో కొలువుదీరిన అసలు నృసింహస్వామి భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారిని చూసిన భక్తులు ఎంతో తన్మయ త్వం చెందుతారు. ఆనం దంతో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటా రు. సంవత్సరంలో 365 రోజులు స్వామి వారు ఇలా నీటిపైనే కొలువు దీరి ఉండటం ఇక్కడి విశేషం. వేసవి కాలం..వర్షాకాలం.. శీతాకాలం అంటూ ఏదీ లేదు. ఏ కాలంలోనైనా స్వామి వారు కొలువు దీరిన మార్గంలో నీరు ఉంటుంది. అదీ కూడా నడుము లోతులో ప్రవహిస్తూ ఉంటుంది. ఎంతో అధ్యాత్మిక భావనతో ఇక్కడి నృసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు మూల విరాఠు రూపాన్ని మనస్సులో తలచుకుంటూ ముందుకు సాగుతారు. అలా తన దగ్గరకు వచ్చే భక్తులను ఎటువంటి ప్రమాదం జరుగకుండా కాపాడుతూ ఉంటాడన్నది భక్తుల నమ్మకం.
విడియోని చూడండి.. https://www.youtube.com/watch?v=XHDAAbN9aQE
విడియోని చూడండి.. https://www.youtube.com/watch?v=XHDAAbN9aQE
No comments:
Post a Comment