దక్షప్రజాపతి తన 27 మంది కుమార్తెలను (27 నక్షత్రాల పేర్లు వారివే) చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు. కాని చంద్రుడు మాత్రం అందరికంటే అందమైన రోహిణి పైననే ప్రేమ చూపి తక్కినవారిని నిర్లక్ష్యం చేస్తాడు. మిగతా 26 మంది తండ్రి దక్షప్రజాపతి వద్దకు వెళ్లి తమకు జరుగుతున్నా అన్యాయాన్ని విన్నవించుకుంటారు. చంద్రున్ని పిలిచి అందర్నీ సమానంగా ఆదరించమని చెపుతాడు. అయినా చంద్రుడు రోహిణి పైననే తన ప్రేమంతా కురిపిస్తుంటాడు, దాంతో ఆగ్రహం చెందిన దక్షుడు చంద్రున్ని క్షయ వ్యాధి గ్రస్తుడివికా అని శపిస్తాడు. శాప నివారణకు దేవతలా నెవరి నాశ్రయించినా దక్షుని శాపం నుండి కాపాడగలవాడు శివుడొక్కడే అని, శివునికి తపస్సు చేసి మెప్పించమని సలహా ఇస్తారు. చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వచ్చి ఘోర తపస్సు నాచారిస్తాడు, ప్రత్యక్షమైన పరమేశ్వరుడు, దక్షుని శాపానికి తిరుగుండదని అయినా నీ భక్తికి మెచ్చి నెలలో 15 రోజులు క్షయం, 15 రోజులు వృద్ది అయ్యేలా చేస్తానని చంద్రుని శాపాన్ని మారుస్తాడు. చంద్రునికి శాప విమోచనం చేసిన పరమేశ్వరుడు ఇక్కడ సొమనాథునిగా వెలిశాడు. చంద్రుడు కృతజ్ఞతగా సొమనాథునికి బంగారు ఆలయాన్ని నిర్మిస్తాడు.
గుజరాత్ రాష్ట్ర ప్రభాస క్షేత్రంలో సోమనాథ దేవాలయం కలదు. అతి పురాతనమైనది ఈ దేవాలయం. భారత దేశంలో ఈ దేవాలయం దోపిడీకి గురైనంతగా మరే దేవాలయం గురి కాలేదు. క్రీ.శ.722 లో సింధూ ప్రాంత అధిపతి అయిన జునాయిద్ తన సైన్యాన్ని పంపి ఆలయాన్ని ద్వంసం చేయించాడు. భారత దేశపు రాజులు, భక్తులు ఆలయాన్ని పునర్నిర్మించారు. కాగా క్రీ.శ.1026 లో ఘజనీ మొహమ్మద్ తన సైన్యంతో దండ యాత్ర చేసి ఆలయాన్ని ద్వంసం చేసి ఆలయంలో కల అపార సంపదనంతా దోచుకెళ్ళాడు. ముస్లీం పాలనలో ఆలయం పలు మార్లు దాడులకు గురయింది. క్రీ.శ.1297, 1394, 1607 ల్లో ద్వంసం చేసి దోపిడీ చేశారు. స్వాతంత్ర్యం లభించాక సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆలయ పునర్నిర్మాణం చేయబడింది. ఎన్ని కాలాలు గడిచినా చెరగని, తరగని భక్తి ప్రపత్తులతో అశేష జనం అనుదినం సొమనాథున్ని దర్శించి తరిస్తున్నారు.
ఎక్కడా లేని విధంగా ఇక్కడ గర్భాలయం, సభా మండపం, నృత్య మండపం గోపురములు 150 అడుగుల ఎత్తుతో విరాజిల్లుచున్నది. గర్భాలయపు శిఖర కలశం 10 టన్నుల బరువు కలిగి ఉంది, శిఖరద్వజమ్ 27 అడుగులతో చూపరులను ఆకట్టుకొనును. శ్రీ కృష్ణుని నిర్యాణం కూడా ఇక్కడికి సమీపంలోనే జరిగిందని చెపుతారు. అరేబియా సముద్రం ప్రక్కన ఉండే ఈ క్షేత్రం కడు రామనీయస్థలం.
No comments:
Post a Comment