ఆత్మీయ మిత్రులకు, ఆత్మ బంధువులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.!!​ ~ దైవదర్శనం

ఆత్మీయ మిత్రులకు, ఆత్మ బంధువులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.!!​

* శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ...
* సీతారామ కళ్యాణం చూస్తే వచ్చే ఫలితం ఏమిటి...?
* సీతమ్మతో రాముని కళ్యాణం ఎలా జరిగింది..?
.
.
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం...
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్...
ఆజానుబాహుమరవింద దళాయతాక్షం...
రామం నిశాచర వినాశకరం నమామి...
అంటూ శ్రీరాముడిని స్తుతించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి.
.
తాను చేస్తున్న యాగాల రక్షణ కొరకై శ్రీరామ లక్ష్మణులను తీసుకెళ్లిన విశ్వామిత్రుడు, ఆ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన తరువాత వారిద్దరినీ మిథిలకు తీసుకుపోతాడు. అక్కడ జనకుడు యజ్ఞాన్ని చేస్తుంటాడప్పుడు. విశ్వామిత్రుడొచ్చాడని తెలుసుకున్న జనక మహారాజు తన పురోహితుడైన శతానందుడుతో కలిసి వారున్న ప్రదేశానికి వచ్చాడు. మునీశ్వరుడిని సేవించాడు. ఆయన వెంటే వున్న రామ లక్ష్మణులెవరని ప్రశ్నించాడు జనకుడు. వారు దశరథ మహారాజు కొడుకులని, తన యజ్ఞాన్ని రక్షించేందుకు క్రూరులైన రాక్షసులను చంపారని, వారిద్దరూ ఆయన దగ్గరున్న శివ ధనుస్సును చూసేందుకొచ్చారని అంటాడు విశ్వామిత్రుడు. మర్నాడు ఉదయం జనక మహారాజు ఆహ్వానం మేరకు శివ ధనస్సును చూసేందుకు వెళ్లారు రామలక్ష్మణులు. తన దగ్గరున్న ధనుస్సు విషయం చెప్పి, దానిని ఎక్కుపెట్టగల వాడికే తన కూతురు సీతను ఇస్తానని చెప్పాడు. దానిని శ్రీరామ లక్ష్మణులకు చూపిస్తానని, శ్రీరామచంద్రమూర్తి విల్లెక్కుపెట్టగలిగితే తాను అదృష్టవంతుడిని, అయోనిజైన సీతను ఆయన కిస్తాను అని అంటాడు.
.
జనకుడి ఆదేశం ప్రకారం, ఐదువేల మంది బలశాలులు ఇనుప పెట్టెతో సహా దాంట్లో వున్న పెద్దవింటిని తెచ్చారు వారున్న చోటికి. విశ్వామిత్రుడి ఆదేశం ప్రకారం శ్రీరాముడు, ధనుస్సుండే పెట్టె దగ్గరికిపోయి, దాని మూత తెరిచి, తాను వింటిని చూసానని-తాకానని చెప్పి, ఆయన ఆజ్ఞాపిస్తే బయటకు తీస్తానని అంటాడు. విశ్వామిత్రుడు, జనకుడు అంగీకరించగానే, రాముడు, అవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొని, బయటకు తీసి, రాజులందరూ చూస్తుండగా అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయింది. ఆ వెం టనే నేనన్న మాట ప్రకారం, నా ప్రాణంకంటే ప్రియమైన భూపుత్రి సీతను గొప్పగుణాలున్న శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేస్తాను’’ అని జనకుడు సీతను రాముడికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేశాడు కాని, రాముడందుకు అంగీకరించలేదు. తనను విశ్వామిత్రుడు చెప్పిన పని చేయాల్సిందిగా తన తండ్రి ఆజ్ఞాపించాడని, ఆయన వింటిని చూడమంటే చూసానని, ఎక్కుపెట్టమంటే పెట్టానని, అంటూ, వివాహమాడడానికి తనకు తండ్రి ఆజ్ఞ లేదని జనకుడికి చెప్పాడు. జనకుడు దశరథ మహారాజుకు కబురు పంపి ఆయన్ను పిలిపించాడు.
.
మిథిలా నగరం చేరుకున్న దశరథుడు ఋషులతో బంధువులతో కలిసి జనకుడున్న చోటికి పోయి, ఆయనకు వశిష్టుడిని చూపించి, ఇక్ష్వాక వంశానికి ఆయన కులగురువనీ, తమ గురించి చెప్పాల్సిన విషయాలన్ని ఆయన చెప్తాడనీ అంటాడు. కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి. ఇది సాంప్రదాయ బద్ధంగా వచ్చే ఆచారం. తదనుగుణంగానే, వశిష్ఠుడు సూర్యవంశక్రమాన్ని వివరించాడు వెంటనే. ఆ తరువాత ఇక్ష్వాకు వంశ క్రమం వివరించిన వశిష్టుడితో జనక మహారాజు తనవంశక్రమాన్ని వినిపించాడు. శ్రీరామ లక్ష్మణులకు తన ఇద్దరు కూతుళ్లు సీత-ఊర్మిళలను సంపూర్ణ ప్రీతితో, దశరథుడి ఆజ్ఞ ప్రకారం ఇచ్చి వివాహం జరిపిస్తానని అంటాడు. జనకుడి తమ్ముడైన కుశధ్వజుడి ఇరువురు పుత్రికలను, దశరథుడి కుమారులైన భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేయమని విశ్వామిత్రుడు సూచించగా దానినీ అంగీకరించాడు జనకుడు. రెండు రోజుల తరువాత వచ్చే ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున వివాహంచేద్దాం అని అంగీకారం కుదిరింది. ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి భగుడనే ప్రజాపతి అనీ, ఆయన శుభకరుడు కాబట్టి, ఉత్తర ఫల్గుని ఉత్తమమని అందరు ప్రశంసించారు.
.
ముహూర్తం రోజు ఉదయం తూర్పు తెల్లవారుతుండగానే, కాల కృత్యాలు తీర్చుకొని యజ్ఞ భూమికి చేరుకున్నాడు దశరథుడు. చక్కటి ఆభరణాలను ధరించి, కంకణం కట్టుకొని, రామచంద్రమూర్తి మంచి ముహూర్తంలో తమ్ములతో కలిసి వచ్చాడక్కడకు. వశిష్ఠుడు-ఇతర మునీంద్రులు ముందుండి తమ వెంట వస్తుంటే యజ్ఞ భూమి (యజ్ఞ భూమి అంటే, సమీపంలో పెళ్లిజరిపించేందుకై ఏర్పాటుచేసిన ఉత్సవశాల అని అర్థం) ప్రవేశించారు. వశిష్టుడితో జనకుడు, త్రిలోకాభిరాముడైన రామచంద్రమూర్తికి శీఘ్రంగా-సంతోషంగా వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించమని అన్నాడు. వశిష్ఠుడు, తనకు సహాయంగా విశ్వామిత్రుడు, శతానందుడు తోడుండగా వివాహ సంబంధమైన కార్యక్రమం చేపట్టాడు. చలువ పందిరిలో శాస్త్ర ప్రకారం వేదిని తీర్చి, పూలతో-పరిమళ ద్రవ్యాలతో దానిని అలంకరించి, మెరుస్తున్న బంగారు పాలికలతో-మొలకలెత్తిన శుభకరమైన అడుగులేని పాత్రలతో-జిగుళ్లుగల మూకుళ్లతో-ధూపమున్న ధూప పాత్రలతో-స్రుక్కులు, స్రువాలు, అర్ఘ్యం పేలాలతో నిండిన స్వచ్ఛ పాత్రలతో-పచ్చని అక్షతలతో వేదిని నింపాడు వశిష్ఠుడు. మంత్రాలు పఠిస్తూ, పరిశుద్ధమైన దర్భలను పరిచి, శాస్ర్తోక్తంగా వేదిలో అగ్నిని వుంచి, వశిష్ఠుడు హోమం చేశాడు.
.
‘‘సీతను సర్వాభరణో, పేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌస/ ల్యా తనయున కభిముఖముగ, క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్‌’’.
అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా-శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:
‘‘ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా / కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్‌’’.
‘‘కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్‌ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత-మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు’’ అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు. దేవతలు, ఋషులు మేలు-మేలనీ, భళీ అనీ శ్లాఘించారు.
.
సంతోషాతిషయంతో దేవతలు పూల వాన కురిపించారు. దేవదుందుభులను చాలాసేపు మోగించారు. వాసవుడు మొదలైన పలువురు, తమ శోకత్వాన్ని-దీనత్వాన్ని తమ మనస్సుల నుండి తొలగించుకున్నారు. ఈవిధంగా మంత్రించిన జలాలను ధారపోసి భూపుత్రి సీతను శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేసానని జనక మహారాజు సంతోషిస్తూ లక్ష్మణుడివైపు చూసి, ‘‘లక్ష్మణా ఇటు రా. దానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను. ఈమె చేతిని ప్రేమతో గ్రహించు’’ మని కోరాడు. ఊర్మిళను లక్ష్మణుడికిచ్చిన తర్వాత, భరతుడిని మాండవి చేతిని, శత్రుఘ్నుడిని శ్రుతకీర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. మంగళ వాద్యాలు మోగుతుంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసింది.
.
సీతా కల్యాణ ఘట్టం చదివిన వారికి శ్రీ సీతా వివాహ విషయ చర్చకు సంబంధించి ఆసక్తి కలగడం సహజం. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని ‘‘కౌసల్యా సుత’’ అని సంబోధించాడు. ఎందుకు జనకుడు కౌసల్యా కుమారా అని పిలవాలి? సీ్త్ర పేరుతో పిలవకుండా, వాడుక పేరైన ‘‘రామా’’ అని పిలవచ్చు కదా. దశరథ కుమారా అనకూడదా? ఆ రెండూ ఇప్పుడు సరిపోవని అర్థం చేసుకోవాలి. కేవలం రామా అని పిలిస్తే ఆ పేరుకలవారు మరొకరుండవచ్చు కదా. దశరథ కుమారా అని పిలవడానికి ఆయనకు నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు కదా. కౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు. ‘‘ఈ సీత’’ అంటాడు రాముడితో. సీత, సిగ్గుతో తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. రామచంద్రమూర్తి తనకు తానే సీత చేయి పట్టుకుంటే, పెళ్లికాక ముందే ఎందుకలా స్వతంత్రించి కాముకుడిలా ప్రవర్తించాడని సీత అనుకోవచ్చు-లోకులూ భావించవచ్చు. అందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి ‘‘ఈ సీత’’ అని చెప్పాడు. అలంకరించబడిన కల్యాణ మంటపంలో, నలు వైపులా నిలువుటద్దాలు వేసి వుండడంతో, అన్నిటిలోనూ సీత రూపమే కనిపించసాగింది. అద్దంలో సీతేదో-నిజమైన సీతేదో తెలుసుకోలేక నలుదిక్కులు చూస్తున్న రాముడి భ్రమపోయేట్లు, చేయి చూపి ‘‘ఈ సీత’’ అని చెప్పాడు జనకుడు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List