శ్రీ వికారి నామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు. ~ దైవదర్శనం

శ్రీ వికారి నామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు.

* ఉగాది విశిష్టత ...
* ఉగాది వెనుక అసలు కథ ఏమిటి...?
* ఉగాది పచ్చడిని తింటూ పఠించాల్సిన శ్లోకం...?
* ఉగాది రోజున పంచాంగం ఎందుకు వినాలి...?
* ఉగాదిపచ్చడి ప్రాముఖ్యత ...
.
.
వసంత ఋతువు వచ్చేసింది. చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేస్తాయి. కోయిలలు కుహు... కుహు రాగాలు పాడుతుంటాయి. ఇటువంటి వసంత ఋతువు ప్రారంభమయ్యేది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. ఆ రోజున అశ్వినీ నక్షత్రం ఉంటుంది.
.
మాసాల్లో చైత్రం, తిథుల్లో పాడ్యమి, నక్షత్రాల్లో అశ్విని మొదటిది. అంటే ఉగాది ...కాలచక్రం ఒక ఆవృతం పూర్తిచేసి మళ్లీ మొదలయ్యే రోజన్నమాట. అందుకే, ఇది కాలానికి సంబంధించిన అతిముఖ్యమైన పండుగ తెలుగువారు జరుపుకునే పండుగ లలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగు వారు నూతన సంవత్సరం జరుపుకుంటారు. ఉగాది రోజున క్రొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి.
.
ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరంగా మాత్రమే తెలిసిన నేటి తరానికి ఆ పండుగ వెనుక ఉన్న అసలు కథను తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. హిందూ పురాణాల ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడు. అలాగే మత్స్య అవతారం ధరించిన విష్ణువు వేదాలను తస్కరించిన సోమకుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చింది అని కూడా అంటారు. అన్ని ఋతువుల్లో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కనుక, కొత్త జీవితం నాందికి గుర్తుగా ఉగాది పండుగను చేసుకుంటారు.
ఉగాదినే కొన్ని ప్రాంతాల్లో యుగాది అని కూడా అంటారు. కొందరు తెలుగువారే యుగ+ఆది (అంటే యుగం యొక్క ప్రారంభం) అని దాన్నే యుగాది లేదా ఉగాది అని అంటారు.
.
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాథ.
.
"ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే అయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.
.
ఉగాది పచ్చడి:...
"ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్థం.షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
.
ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
.
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.
.
ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం.
.
ఉగాదిపచ్చడి ప్రాముఖ్యత :...
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -

బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు
మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

.
ఉగాది రోజున పంచాంగం ఎందుకు వినాలి...?
.
ఉగాది రోజున వేపపచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగశ్రవణం కూడా అంతే ముఖ్యం అంటారు పెద్దలు. ఏడాదిలో ఎప్పుడో జరగబోయే విషయాల గురించి పనిగట్టుకుని వినడం ఎందుకు? అందరూ ఒకచోట కూడి పంచాంగాన్ని వినాల్సిన అవసరం ఏమిటి? అంటే జవాబులు ఇవిగో...
.
ప్రాచీన భారతీయుల ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అని చరిత్రకారుల విశ్లేషణ. మనకి తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నయో లెక్క వేసి, వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం. పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణములనే అయిదు భాగాలు ఉంటాయి. అందుకనే దీనికి పంచాంగం అని పేరు. తిథి విషయంలో జాగ్రత్త పడితే సంపద, వారం వల్ల ఆయుష్షు, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు.
.
పంచాంగం ప్రకారం వ్యవసాయానికీ, వర్షానికీ, రాజ్యానికీ... ఇలా ప్రతి విభాగానికీ ఓ అధిపతి ఉంటాడు. ఇలా తొమ్మిదిమంది నాయకులను నవనాయకులు అని పిలుస్తారు. వీరి సంచారం వల్ల రాబోయే రోజులలో వ్యవసాయం ఎలా ఉంటుంది, దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహిస్తారు. నవనాయకుల సంగతి అలా ఉంచితే... ఒకో మాసానికీ అధిపతిగా ఉండే గ్రహం వల్ల కూడా అనూహ్య ఫలితాలు ఉండవచ్చు.
.
ఇక పంచాంగంలో వ్యక్తిగత రాశిఫలాలు ప్రత్యేకత చెప్పేదేముంది. ఒకో మనిషి నక్షత్రం ప్రకారం అతని ఆదాయవ్యయాలు, రాజపూజ్య అవమానాలూ లెక్క కడతారు. దీని వల్ల మనుషులలో ఆదాయాన్ని మించి ఖర్చు చేయకూడదనీ, అనువు కానీ చోట అధికులమని అవమానం పాలు కాకూడదనీ జాగ్రత్త ఏర్పడుతుంది. ధార్మికులకు పంచాంగం ఇంత ఉపయుక్తం కాబట్టే... సంవత్సరపు తొలిరోజున పంచాంగ శ్రవణం చేసి తీరాలంటారు పెద్దలు.
.
ఇప్పుడంటే పంచాంగాలు ఇంటింటా కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు కేవలం కొద్దిమంది పురోహితులకే ఇవి అందుబాటులో ఉండేవి. కాబట్టి ఉగాది రోజున వారి నుంచి రాబోయే సంవత్సరపు విశేషాలు తెలుసుకునేందుకు అంతా ఒకచోటకి చేరేవారు. దీని వల్ల పంచాంగ శ్రవణం నలుగురూ కలుసుకుని కష్టసుఖాలను కలబోసుకునే సందర్భంగా కూడా మారుతుంది. పైగా పంచాంగంలో సామాన్యులకి అర్థం కాని విషయాలు అనేకం ఉండవచ్చు. వాటన్నింటినీ నివృత్తి చేసుకునేందుకు ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ధార్మికపరమైన సందేహాలను తీర్చుకునేందుకు కూడా పంచాంగ శ్రవణం అవసరం. అధికమాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా? గ్రహస్థితి బాగోలేకపోతే ఏం చేయాలి? నోములు ఎప్పుడు జరుపుకోవాలి? వ్రతం ఎలా చేసుకోవాలి?... వంటి సవాలక్ష సందేహాలన్నింటికీ ఊరూరా పంచాంగ శ్రవణం వేదికగా మారుతుంది. అందుకనే పంచాంగ శ్రవణ చేసినవారికీ, విన్నవారికీ కూడా నవగ్రహాల ఆశీస్సులు లభిస్తాయని ఫలశ్రుతిగా చెబుతారు.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List