"శ్రీ బాల రెడ్డెమ్మ తల్లి" పుణ్య క్షేత్రం. ~ దైవదర్శనం

"శ్రీ బాల రెడ్డెమ్మ తల్లి" పుణ్య క్షేత్రం.


చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలానికి చెందిన గ్రామము చెర్లోపల్లి ఒక అధ్యాథ్మిక ప్రదేశం. చిత్తూరు జిల్లాలో కడప, బెంగుళూర్ రహదారి మధ్య ఉన్న చారిత్రక ప్రదేశం. ఇక్కడి రెడ్డెమ్మ కొండ లోని "రెడ్డెమ్మ దేవత" చాల శక్తులు కలదని ప్రజల నమ్మకం . చెర్లోపల్లి లోని రెడ్డెమ్మ కొండ కు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వెల సంఖ్యలో రోజు తరలి వస్తుంటారు .
సంతానం లేని స్త్రీలు రెడ్డెమ్మ తల్లికి సాగిలపడి మూడు ఆదివారాలు, గుడిలో ఉన్న కోనేట్లో స్నానం చేసి, సంతానం ఇవ్వమని కోరుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చేయలేని పనిని రెడ్డెమ్మ తల్లి కరుణతో చేస్తుందంటుంటారు ఇక్కడి ప్రజలు.
ఇలా రెడ్డెమ్మతల్లి దీవెనలతో సంతానం పొందినవారు కుల, మత, వర్గ, వర్ణ, భాషాభేదాలు లేకుండా వారి పిల్లలకు విధిగా పేరుకుముందు రెడ్డి శబ్దం వచ్చేలాగా పిలుచుకుంటుంటారు. అందుకే రెడ్డి పంతులు, రెడ్డి నాయుడు, రెడ్డెయ్య, రెడ్డి ఖాదర్, రెడ్డి జోసఫ్, రెడ్డెప్పరెడ్డి, రెడ్డెన్న శెట్టి లాంటి పేర్లు అక్కడ వినిపిస్తుంటాయి.
చిత్తూరు జిల్లాలోని మదనపల్లె నుండి కడప వెళ్లే మార్గంలో గుర్రంకొండ అనే ఊరు దాటిన తరువాత వస్తుంది "చెర్లోపల్లె" గ్రామం. పాడిపంటలకు, పాడి ఆవులకు ఆలవాలమైన ఆ గ్రామంలోని ఒక పల్లెపేరు "యల్లంపల్లె". ఈ పల్లెలో యల్లం రెడ్లు ఎక్కువగా జీవిస్తుంటారు.
ఈ యల్లంపల్లెలో రామిరాడ్డి అనే మోతుబరి రైతు, ఆయన భార్య నాగమ్మ పేదసాదలను ఆదరించి ఆదుకుంటూ ఉండేవారు. వారికి ఇద్దరు కుమారులు... ఒక అందాల భరిణె, అపరంజి బొమ్మ అయిన కూతురు ఉండేది. ఆమె పేరే రెడ్డెమ్మ. చిన్నప్పటినుంచీ ఆ గ్రామ ప్రజలంతా రెడ్డెమ్మను చాలా ప్రేమగా, గౌరవంగా చూసుకుంటూ ఉండేవాళ్లు.
తల్లిదండ్రులు పొలంపనుల్లో, అతిథుల ఆదరణలో మునిగి తేలుతుంటే... ఏమీ తోచని చిన్నారి రెడ్డెమ్మ ఊరిపక్కనే పండిన జొన్నచేను వద్దకెళ్లి... మంచమీదికెక్కి "వడిసెల" తిప్పుతూ పక్షులను పారద్రోలేది. అలా ఒకరోజు వడిసెల తిప్పుతూ పక్షులను పారద్రోలుతున్న రెడ్డెమ్మను గుర్రంకొండ పాలకుడు తన సైనికులతో వస్తూ... చూశాడు.
అద్భుత సౌందర్యరాశి అయిన రెడ్డెమ్మను ఎలాగైనా సరే పొందాలనే దురుద్దేశ్యంతో సైనికులకు హుకుం జారీ చేశాడు. నవాబు ఆజ్ఞ మేరకు ఆఘమేఘాలపై వస్తున్న సైనికులను గమనించిన రెడ్డెమ్మ కంచెపైనుండి దూకి కొండవైపు పరుగెడుతూ పారిపోయింది. పంటచేలలో పడుతూ, లేస్తూ పరుగులెడుతున్న రెడ్డెమ్మకు ఏంచేయాలో బోధపడక... "పరమశివా, పార్వతి మాతా నన్ను కాపాడు తల్లీ..." అంటూ బిగ్గరగా వేడుకుంది.
వెంటనే భూమి కంపించేలా భయంకరమైన శబ్దంతో రెడ్డెమ్మకు ఎదురుగా ఉండే కొండ నిట్టనిలువునా చీలిపోయింది. వెంటనే ఆ కొండ చీలికలోకి ఆమె దూరిపోయింది. అప్పటికే అక్కడికి చేరిన సైనికులు ఆ శభ్దానికి గుర్రాలపైనుంచి కిందపడిపోయారు. ఇదంతా గమనించిన నివ్వెరబోయిన సైనికుడొకడు నవాబుకు విషయం చేరవేయగానే గుట్టుచప్పుడు కాకుండా కోటలోకి పారిపోయాడు గుర్రం కొండ నవాబు.
ఇదంతా విన్న రెడ్డెమ్మ తల్లిదండ్రులు, ఊరి ప్రజలు భోరున విలపిస్తూ ఆ రాత్రంతా నిద్రపోలేదు. అయితే ఆమె తల్లి నాగమ్మ కలలోకి వచ్చి తనగురించి బాధపడవద్దంటూ ఓదార్చింది. ఇదంతా విన్న ప్రజలంతా తెల్లవారగానే కొండవద్దకు వెళ్ళి "రెడ్డెమ్మతల్లీ మమ్మల్ని కాపాడు తల్లీ" అంటూ వేడుకున్నారు.
ఇక అప్పటినుంచి బాలరెడ్డెమ్మ "దేవత"గా వెలిసింది. కోరిన కోర్కెలు తీరుస్తూ, ప్రజలను ఆదుకుంటూనే ఉంది. ఇది జరిగి ఇప్పటికి మూడు వందల సంవత్సరాలు దాటినా, రెడ్డెమ్మ తల్లి మాత్రం "సంతాన దేవత"గా ప్రజల నిత్యపూజలను అందుకుంటూనే ఉంది. ప్రతి ఆదివారం వేలసంఖ్యలో సంతానం లేని స్త్రీలు రెడ్డెమ్మకు సాగిలపడుతున్నారు. వారి కోర్కెలూ తీరుతున్నాయి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List