క్రీ.శ.300 నుండి 1100 మధ్యకాలంలో తీరాంధ్రప్రాంతలో నెలకొన్న రాజ్యాన్ని వేంగి రాజ్యం అని, ఆ రాజ్యం రాజధాని లేదా ప్రధాన నగరాన్ని వేంగి నగరం లేదా విజయవేంగి అని చరిత్ర కారులు నిర్ణయిస్తున్నారు. అప్పుడు వేంగి అనబడే స్థలం ప్రస్తుతం పెదవేగి అనే చిన్న గ్రామం. ఇది పశ్చిమగోదావరి జిల్లా లో ఏలూరు పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఉంది.
వేంగి రాజ్యం ఉత్తరాన గోదావరి నది, ఆగ్నేయాన మహేంద్రగిరి, దక్షిణాన కృష్ణానది మధ్య ప్రాంతంలో విస్తరించింది. వేంగి రాజ్యం ఆంధ్రుల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. పల్లవులు, శాలంకాయనులు, బృహత్పలాయనులు, తూర్పు చాళుక్యులు వివిధ కాలాలలో వేంగి రాజ్యాన్ని ఏలారు. వేంగి రాజ్యం ద్వితీయార్ధంలో, అనగా తూర్పు చాళుక్యుల కాలంలో (వీరినే "వేంగి చాళుక్యులు" అని కూడా అంటారు.) తెలుగు భాష రాజ భాషగా గైకొనబడి, పామర భాష (దేశి) స్థాయి నుండి సాహిత్య భాష స్థాయికి ఎదిగింది.
"వేంగి" పేరు
"వేంగి" అనే పేరు పురాతనమైనదిగా కనిపించడం లేదు. కంచి వద్ద 'వెంగో' లేక 'వేంగి' అనే పేరు ఉన్నదని, ఆంధ్ర దేశం మధ్యలో ఈ పేరు గల నగరం ఏర్పడడానికి కారణాన్ని ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడయిన చిలుకూరి వీరభద్రరావు ఈ విధంగా ఊహించాడు.("ఆంధ్రుల చరిత్రము - ప్రధమ భాగము") [1] -
ఈ దేశము పూర్వము నాగులచే పరిపాలింపబడెడిది. దక్షిణ దేశమందలి నాగులలో "అఱవలార్" ఒక తెగ. కాంచీ పురమునకు దక్షిణదేశమున ఉండే వారు గనుక ఆ ప్రదేశం "ఆఱవనాడు" అనబడింది. కనుకనే టాలెమీ వంటి విదేశీ చరిత్రకారులు మైసోలియా (కృష్ణానది) దక్షిణ ప్రాంతాన్ని "ఆశార్‌నోరి" (అర్ వార్ నాయ్) అని పేర్కొన్నారు. మొట్టమొదట కృష్ణా గోదావరి మధ్య దేశం "కూడూహార విషయం" అనబడేది. దానికి రాజధాని "కూడూరా" (గూడూరు లేక గుడివాడ?). ఏ కారణము చేతనో రాజధాని మార్చుకొనవలసి వచ్చినది. సాలంకాయన గోత్రుడైన పల్లవరాజులలో నొకరు ఒక నూతన నగరమును నిర్మింపజేసి దానికి "బెబ్బులి" అనే అర్ధం వచ్చే "వేంగి" అనే పేరు పెట్టాడు. అక్కడినుండి పాలించే రాజులు వేంగిరాజులని, వారిచే జయింపబడిన దేశాన్ని వేంగి దేశమని అనడం మొదలుపెట్టారు. ... క్రీ.శ. ౪ శతాబ్దంలో అలహాబాదు శాసనంలో వేంగిని ప్రస్తావించారు గనుక అంతకు పూర్వమే అనగా క్రీ.శ. ౨వ లేదా ౩వ శతాబ్దంలో వేంగి నగరం ఏర్పడి ఉండవచ్చును.
అసలు ఈ చిన్న గ్రామమే ఒకనాటి వేంగి మహానగరమా? అనే ప్రశ్నకు చిలుకూరి వీరభద్రరావు ఇలా వివరణ ఇచ్చాడు.
వేంగీ దేశమునకు ముఖ్య పట్టణముగా నుండిన వేంగి నగరం కృష్ణా మండలంలోని యేలూరుకు ఉత్తరాన ౮ మైళ్ళ దూరములోనున్నది. ఆ స్థానమున నిపుడు పెదవేగి, చినవేగి అను పల్లెలు మాత్రమున్నవి. వీనికి దక్షిణముగా ౫ మైళ్ళ దూరమున దెందులూరను గ్రామము కలదు. ఈ గ్రామమునకు గంగన్నగూడెము, సేనగూడెము అను శివారు పాలెములు చుట్టునునున్నవి. ఇవియన్నియుంగలిసి ఒక మహా పట్ణముగనుండి వేంగీపురమని పిలువంబడుచుండెను. ఈ ప్రదేశమునందు శిధిలమైపోయిన శివాలయములు పెక్కులు గలవు. మరియు జ్ఞానేశ్వరుని యొక్క విగ్రహములు నాలుగు దెందులూరుకు దక్షిణముగానున్న చెఱువు సమీపముననుండినవి. వానిలో నొకటి మిక్కిలి పెద్దదిగానున్నది. ఈ గ్రామమునకు తూర్పు ప్రక్కను భీమలింగము దిబ్బయను పేరుగల యెత్తైన యొక పాటి దిబ్బ గలదు. దానికుత్తరముగా నూకమ్మ చెఱువును, దాని నడుమనొక మట్టి దిబ్బయు, దానిపై రెండు రాతి నందులును గలవు. దానిని నారికేళవారి చెఱువని చెప్పుదురు. వాని గట్లపైని రెండు శిలా శాసనములు నిలువుగానుండియు, మరిరెండు సాగిలబడియు నుండినవి. పెదవేగికిని, చినవేగికిని నడుమ మఱియొక మంటిదిబ్బ గలదు. వీనిన్నింటిని పరిశోధించి చూడగా వేంగీపురము మిక్కిలియున్నత స్థితి యందుండిన మహానగరముగానుండెననుటకు సందియము లేదు. .... వేంగీపురమనియెడి మహానగరమొకటి యిక్కడుండెనా యని కొందఱు సంశయించుచుండిరి గాని విజయదేవవర్మ యొక్కయు, విజయనందివర్మ యొక్కయు శాసనములా సంశయమును నివారించినవి. దండియను మహాకవి కొల్లేరును వర్ణించుచు దానికి ననతి దూరముగానుండిన యీ వేంగీపురమునే యాంధ్ర నగరియని పిలిచియున్నాడు. విజయదేవవర్మ, విజయనందివర్మ శాసనములలో నుదాహరింపబడిన చిత్రరధస్వామి దేవాలయమిప్పటికిని నిలిచియుండి యఅ పేరుతోనే పిలువంబడుచున్నది. (ఈ రచన 1910లో ప్రచురితమయ్యింది)
చరిత్రలో వివిధ దశలు
పూర్వ కాలంలో కాలి నడక మార్గాలు, ఓడ రేవులు జనుల ప్రయాణాలకు, వివిధ సంస్కృతుల మేళనానికి ముఖ్యమైన వేదికలు. యాత్రికులు, పండితులు, వ్యాపారులు, కళాకారులు ఈ మార్గాలలో ప్రయాణిస్తూ భిన్న సంప్రదాయాల ఏకీకరణకు కారకులయ్యారు. వీటివల్లనే చరిత్రలో అధిక భాగం అనేక రాజ్యాలుగా ఉన్నా గాని భారతదేశం అనే బలమైన భావన అంకురించడం సాధ్యమయ్యింది. ఆంధ్ర తీరంలో (శాతవాహనుల కాలం నుండి) ఎన్నో ఓడ రేవులు ఉండేవి. వీటి ద్వారా దేశ, విదేశ వాణిజ్యం జరిగేది. ఈ మార్గాలలో ఆంధ్ర దేశం ముఖ్యమైన కూడలిగా ఉండేది. ఐదు ప్రధాన మార్గాలు "వేంగి" అనే చోట కలిసేవి. అందువల్లనే ఆంధ్ర రాజ్యమంటే వేంగి రాజ్యమని కూడా ఒకోమారు ప్రస్తావించబడేది. వీటిలో పూర్వోత్తర మార్గం కళింగ రాజ్యాలకు వెళ్ళేది. దక్షిణ మార్గం ద్రవిడ ప్రాంతాలకు, నైఋతి మార్గం కర్ణాటక దిశలోను, ఉత్తర మార్గం కోసల దేశానికి, పశ్చిమోత్తర మార్గం మహారాష్ట్ర ప్రాంతానికి దారి తీసేది. ఇవి ప్రధానంగా బౌద్ధ భిక్షువులు ప్రయాణించి బుద్ధుడు ఉపదేశించిన సందేశాన్ని వినిపించిన మార్గాలు. ఇప్పుడు బయల్పడిన ప్రధాన బౌద్ధారామ శిధిలాలు దాదాపు అన్నీ ఈ మార్గాలలో ఉన్నాయి. (నాగార్జున కొండ, అమరావతి లేదా ధరణికోట, ఘంటసాల వంటివి). వీటిలో కొన్ని అశోకుని కంటే ముందు కాలానివి.
చిలుకూరు వీరభద్రరావు, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, డి.సి.సర్కార్, Dr.Hultzsch, Dr.Fleet, Col.Todd, మల్లంపల్లి సోమశేఖర శర్మ, డా.గోపాలాచారి వంటి ప్రముఖ చరిత్రకారులు వేంగి రాజ్యం చరిత్రను అధ్యయనం చేశారు. కొల్లేరు, దెందులూరు, ఏలూరు శాసనాలు వేంగి చరిత్ర ప్రాంభ దశను అధ్యయనం చేయడానికి ప్రధాన ఆధారాలు. అయితే వీటిలో ప్రస్తావించిన "వేంగి" అనేది రాజ్యం పేరో, లేక నగరం పేరో స్పష్టంగా తెలియడంలేదు.
పెదవేగి సమీపంలో గుంటుపల్లె, జీలకర్రగూడెం, కంఠమనేనివారిగూడెం వంటి ప్రాంతాలలో క్రీ.పూ. 200 నాటి బౌద్ధారామ అవశేషాలు బయల్పడినందువలన శాతవాహనుల, ఇక్ష్వాకుల, కాలం నాటికే ఇది ఒక ముఖ్యమైన నగరం అయి ఉండే అవకాశం ఉంది. 4వ శతాబ్దంలో ఇక్ష్వాకుల సామ్రాజ్యం (విజయ పురి శ్రీపర్వత సామ్రాజ్యం) పతనమయ్యేనాటికి విజయవేంగిపురం ఒక పెద్ద నగరం. విష్ణుకుండినుల కాలంలోను, తూర్పు చాళుక్యుల ఆరంభ కాలంలోను ఆంధ్ర దేశానికి రాజకీయంగాను, సాంస్కృతికంగాను వేంగిపురం ఒక ప్రధానకేంద్రంగా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది.
బృహత్పలాయనులు - ఇక్ష్వాకుల తరువాతి కాలం (క్రీ.శ.300) - వేంగినగరం లేదా ఏలూరు లేదా దెందులూరు వారి రాజధాని కావచ్చును.
శాలంకాయనులు - క్రీ.శ. 300 - 420 మధ్యకాలం - వేంగినగరం వారి రాజధాని. వీరిలో హస్తివర్మ సముద్రగుప్తుని సమకాలికుడు.1వ మహేంద్రవర్మ అశ్వమేధయాగం చేశాడని అంటారు. శాలంకాయనులు పాటించిన చిత్రరధస్వామి (సూర్యుడు) భక్తికి చెందిన ఆలయము యొక్క శిధిలాలు పెదవేగిలో బయల్పడ్డాయి.
బృహత్పలాయనులు - ఇక్ష్వాకుల తరువాతి కాలం (క్రీ.శ.300) - వేంగినగరం లేదా ఏలూరు లేదా దెందులూరు వారి రాజధాని కావచ్చును.
శాలంకాయనులు - క్రీ.శ. 300 - 420 మధ్యకాలం - వేంగినగరం వారి రాజధాని. వీరిలో హస్తివర్మ సముద్రగుప్తుని సమకాలికుడు.1వ మహేంద్రవర్మ అశ్వమేధయాగం చేశాడని అంటారు. శాలంకాయనులు పాటించిన చిత్రరధస్వామి (సూర్యుడు) భక్తికి చెందిన ఆలయము యొక్క శిధిలాలు పెదవేగిలో బయల్పడ్డాయి.
విష్ణుకుండినులు - క్రీ.శ. 375 - 555 - వీరి రాజధాని "శ్రీపర్వత ప్రాంతం"లో ఉండేది. తరువాత వేంగి సమీపంలోని "దెందులూరు"
పల్లవులు - క్రీ.శ. 440 - 616 - వీరి రాజధాని వినుకొండ. వీరి రాజ్యంలో వేంగి కూడా ఒక ముఖ్య నగరం.
తూర్పు చాళుక్యులు - క్రీ.శ. 616 నుండి 1160 వరకు. పల్లవులనుండి వేంగి నగరాన్ని జయించి కుబ్జవిష్ణువర్ధనుడు (బాదామిలోని తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యంగా) రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు చాళుక్యుల కాలం తెలుగు భాష పరిణామంలో ముఖ్య సమయం. వీరు తెలుగును అధికార భాషగా స్వీకరించి దాని ప్రగతికి పునాదులు వేశారు. వేంగి రాజ్యంలో రాజమహేంద్రవరం ఒక మణిగా వర్ణించబడింది. క్రమంగా (కొన్ని యుద్ధాలలో వేంగి ప్రాంతాన్ని కోల్పోవడం వలన) తూర్పు చాళుక్యుల చివరి రాజులు తమ రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చారు.
పల్లవులు - క్రీ.శ. 440 - 616 - వీరి రాజధాని వినుకొండ. వీరి రాజ్యంలో వేంగి కూడా ఒక ముఖ్య నగరం.
తూర్పు చాళుక్యులు - క్రీ.శ. 616 నుండి 1160 వరకు. పల్లవులనుండి వేంగి నగరాన్ని జయించి కుబ్జవిష్ణువర్ధనుడు (బాదామిలోని తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యంగా) రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు చాళుక్యుల కాలం తెలుగు భాష పరిణామంలో ముఖ్య సమయం. వీరు తెలుగును అధికార భాషగా స్వీకరించి దాని ప్రగతికి పునాదులు వేశారు. వేంగి రాజ్యంలో రాజమహేంద్రవరం ఒక మణిగా వర్ణించబడింది. క్రమంగా (కొన్ని యుద్ధాలలో వేంగి ప్రాంతాన్ని కోల్పోవడం వలన) తూర్పు చాళుక్యుల చివరి రాజులు తమ రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చారు.
No comments:
Post a Comment