కార్తీక అమావాస్య ..'కమలాజయంతి'..పోలిస్వర్గదీపం.. ~ దైవదర్శనం

కార్తీక అమావాస్య ..'కమలాజయంతి'..పోలిస్వర్గదీపం..




సర్వ అమావాస్యం - సర్వ ఋణ పాప విమోచకం..!
కార్తీక అమావాస్య రోజున లక్ష్మీపూజ..!
.
.
కార్తీక బహుళ అమావాస్య అనగా కార్తీక మాసములో కృష్ణ పక్షము నందు అమావాస్య తిథి కలిగిన 30వ రోజు. కార్తీకమాసంలో తులసితో శ్రీమహావిష్ణువును ... బిల్వదళాలతో శివుడినీ ... కుంకుమ పూజతో అమ్మవారిని సేవించడం వలన కలిగే ఫలితాలు విశేషమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ మాసంలో చేసే పూజలు ... నోములు ... వ్రతాలు ఆశించిన దానికంటే అధిక ఫలితాలను ఇస్తుంటాయి.
.
కార్తీక మాసంలో భగవంతుడిని ఆరాధించే అవకాశాన్ని వదులుకోకూడదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక బహుళ అమావాస్య కూడా పితృదేవతలకు ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. ఈ రోజున పితృకార్యాలను నిర్వహించడం వలన వాళ్లు సంతోషించి సంతృప్తిని చెందుతారని అంటారు. పితృదేవతల ఆశీస్సులను కోరుకునేవాళ్లు ఈ విషయాన్ని మరిచిపోకూడదు.
.
ఇక కార్తీక బహుళ అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది కనుక, ఈ రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ ... వైష్ణవ ఆలయంలోను దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చెప్పట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది.
.
కార్తీక అమావాస్య 'కమలాజయంతి' గా చెప్పబడుతోంది కనుక అంతా తమ ఇంట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన ఈ రోజున అంకితభావంతో ఆరాధించడం వలన ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుతారని స్పష్టం చేయబడుతోంది.
.
కార్తీక బహుళ అమావాస్య రోజు కార్తీక మాసం పొడుగునా చేసుకునే పూజలకు మంగళ నీరాజనాలద్దుతుంది. ఈ అమావాస్య సర్వ అమావాస్య అని కూడా పిలువబడుతుంది. మాసమంతా తలస్నానాలు చేయలేక పోయినా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేక దినాలలో చేసేవారు ఈ అమావాస్యనాడు తప్పనిసరిగా స్నానం చేస్తారు. అయితే ఒంటికి కానీ తలకి కానీ నూనె రాసుకోకుడా నలుగు పెట్టుకోకుండా చేయాలి. ఈ రోజు చేస్త్తే మాసమంతా కార్తీక స్నాన ఫలితం కలుగుతుంది. తలస్నానం చేసిన తర్వాత మాసమంతా సూర్యోదయానికి ముందే కార్తీక దీపాలు వెలిగించుకునే వారు ఈ రోజు దీపాలను నీటిలో వదులుతారు. నది లో కానీ, చెరువులోకానీ, ఇంటి లోనే ఒక పెద్ద టబ్ లో నీళ్ళు పోసుకుని అందులో వదులుతారు.
.
ఈ రోజుతో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది. కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు ఈ రోజుతో ముగుస్తాయి. నత్తాలు ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగిస్తాయి. తులసమ్మ దగ్గర సింహాద్వారానికిరువైపులా వెలిగించే సంధ్యా దీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి.
.
ఆకాశదీపాన్ని ఈ రోజు కూడా కొనసాగించి, శివసాన్నిధ్యం కోరుకుంటూ పోలి స్వర్గంకి వెళ్ళిన కథ చెప్పుకుంటారు. పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్యనాడు తలస్నానం చేసి, శివుని సన్నిధిన దీపం వెలిగించి, ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానం లో స్వర్గానికి తీసుకుని వెళ్తారు. ఈ కథ చెప్పుకుని,పోలి లాగే తలస్నానం చేసి, దీపారాధన చేసి, ఉపవాసం ఉండి ,శివసాన్నిధ్యం కోరుకుంటారు.
.
ఈ రోజున పితృదేవతలకు కూడా తర్పణాలు వదులుతారు. ప్రతి అమావాస్య పితృదేవతల సేవకు అనువైన రోజు. విశేషించి ఈ కార్తీక బహుళ అమావాస్య పితృదేవతల రోజు. ఈ రోజు పితృదేవతల పేరుతో ఏమి అర్పించినా వారు మిక్కిలి సంతుష్టులై ఆశీస్సులు అందిస్తారు. ఈ విధం గా మన పెద్దలు కార్తీకమాసరూపం లో మన పాపాలు హరించు కోవడానికి, మరియు ఋణాలు తీర్చుకోవడానికి మంచి అవకాశాన్ని ఇచ్చారు. దానిని మనం చక్కగా అందుకోగలగాలి!
.
ఈ కార్తీక మాసం అంతా శుచి గా శుభ్రం గా హరిహరులను పూజించుకుని, ఉపవాసాల వలన జీర్ణవ్యవస్థ ను క్రమబద్దం చేసుకుని, శీతాకాలంలో సాధారణంగా వచ్చే ఇబ్బందులకు లోను కాకుండా, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని, ఆధ్యాత్మికానందాన్ని అనుభవిస్తూనే, మన ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుచుకోవడానికి మనమంతా చేసిన కృషికి హరిహరులు తప్పక హర్షిస్తారు..!


https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List