ఖమ్మం పట్టణం నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న కూసుమంచి మండల కేంద్రంలో కాకతీయులు నిర్మించిన అతి పురాతన శివాలయం ఉంది. కాకతీయుల కాలంలో శివాలయాల నిర్మాణం విస్తృతంగా జరిగింది. కాకతీయ రాజులు శివ భక్తులు కావడంతో, వివిధ ప్రాంతాల్లో శివాలయాలను నిర్మించి సదాశివుడిపై తమకి గల భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. కాకతీయులు శివ లింగాలను ... ఆలయాలను తమ దైన శైలిలో రూపొందించారు. అందువలన వాటిని చూడగానే అవి కాకతీయుల కాలం నాటివని చెప్పవచ్చు.
కాకతీయులు నిర్మించిన ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఈనాటికీ వెలుగొందుతున్నాయి. అలాంటి క్షేత్రాలలో ఖమ్మం జిల్లాలో గల 'కూసుమంచి' శివాలయం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని గణపతిదేవుడు నిర్మించినట్టు ఆధారాలు వున్నాయి. తనకి అనేక విజయాలను కట్టబెట్టిన స్వామివారి పట్ల కృతజ్ఞతతో ఆయన ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతారు. గణపతిదేవుడు కాలంలో 'రామలింగేశ్వరస్వామి' గా పూజలందుకున్న శివుడు, గణపతిదేవుడు తరువాత ఆయన పేరును కలుపుకుని 'గణపేశ్వర స్వామి'గా ప్రసిద్ధిచెందాడు.
రాతిపలకల వేదికను వరుసలుగా పేరుస్తూ ... స్తంభాలను అదే తరహాలో ఒక దానిపై ఒకటి నిలుపుతూ వారు చేసిన నిర్మాణం, గర్భాలయంలోని అందమైన శివలింగం కాకతీయుల కళావైభావానికి అద్దం పడుతుంటాయి. ఇక్కడ పార్వతిదేవి ... గణపతి ... సుబ్రహ్మణ్య స్వామి ... హనుమంతుడి మందిరాలు కొలువుదీరి కనిపిస్తుంటాయి.
శివుడికి సోమవారం అంటే ఇష్టం కనుక ఇక్కడ ఈ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. 'మహాశివరాత్రి' సందర్భంగా ఇక్కడ విశేష పూజలు ... ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. స్వామి తమకి కొండంత అండగా ఉంటాడనీ ... కోరిన వరాలను ఇస్తాడని స్థానికులు చెబుతుంటారు.
No comments:
Post a Comment