జ్ఞానమాసం….ధనుర్మాసం.! ~ దైవదర్శనం

జ్ఞానమాసం….ధనుర్మాసం.!

👉 ధనుర్మాసం విష్ణువుకి ప్రియం...
👉 పుణ్యమార్గం చూపించే ధనుర్మాసం..
.
.
భగవంతుడంటే విశ్వాసం! గర్భాలయమ్లోని శిలామూర్తిలో గోదాదేవి శ్రీరంగనాథుడిని చూసింది,, వలచింది, చెంతకు పిలిచింది. మధుర భక్తితో మెప్పించి జగన్నాయకుడినే నాథుడిగా చేసుకుంది. ధనుర్మాస ప్రాశస్త్యమంతా ఆ భక్తి విజయంలోనే ఉంది.
నల్లాని సామినీ పెళ్లాడ మనసైతె
తెల్లారుజామునే చలిమునక వెయ్యాలి
కన్నెమనసూ విప్పి కాత్యాయానికి చెప్పి
మార్గశిరనోమునూ మనసార తలపెట్టి…
.
శ్రావ్యంగా తిరుప్పావై గానాలు. కమ్మని పొంగలి ఘుమఘుమలు. హరిదాసుల హడావిడి. ఆవుపేడ కళ్ళాపి, బియ్యం పిండి ముగ్గులు….ధనుర్మాస వైభవానికి సంకేతాలు.
.
ధనుర్మాసం – సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే పుణ్యసమయం, ఇదే ధనుస్సంక్రమణ. నాటి నుంచి భోగి పండగ వరకూ పరమపవిత్ర కాలం. తెలుగు లోగిళ్ళలో దీన్ని ‘నెలగంట’ అంటాం. మాసాల్లో మార్గశిరాన్ని నేను….అని చాటిన పరమాత్మకు మార్గశిరంలో ప్రారంభమయ్యే ధనుర్మాసమంటే కూడా ఇంతే ఇష్టం. ఈమాసంలోనే కదా….ఆరాధించి, అర్చించి, తనను తాను అర్పించుకున్న గోదాదేవిని ప్రేమగా స్వీకరించింది. ఆమెను ఆండాళ్ (కాపాడే తల్లి) అని పిలుస్తారు. జనకుడికి సీతాదేవి భూమిలో లభించినట్టు….తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో తులసి మొక్కల మధ్య దర్శనమిచ్చింది గోదాదేవి. విష్ణుచిత్తుడనే పరమభక్తుడు పెంచి పెద్దచేశాడు. గోదాదేవి బాల్యం నుంచీ శ్రీరంగనాథుడే సర్వస్వమని భావించింది. ఆ భగవంతుడే తన భర్త అని విశ్వసించింది. స్వామిని పొందడానికి ధనుర్మాస వ్రతం చేసింది. ముప్ఫై రోజులూ ముప్ఫై పాశురాలతో కొలిచింది. పూజ కోసం తండ్రి సిద్ధం చేసిన దండల్ని మెడలో వేసుకుని….అందచందాల్లో తాను రంగాస్వామికి సరిజోడి అని మురిసి పోయింది. ఓసారి విష్ణుచిత్తుడు పూదండలో గోదాదేవి వెంట్రుకల్ని చూశాడు. సమస్తం అర్ధమైపోయింది. మహాపరాధం జరిగిందని విరుల సౌరభాల కన్నా, గోదాదేవి కురుల పరిమళమే నచ్చింది. విష్ణుచిత్తుడికి కలలో కనిపించి గోదాకల్యాణానికి ఆనతిచ్చాడు. ఆండాళ్ళమ్మ ఆ ఆనంతకోటి బ్రహ్మాండనాయకుడిలో ఐక్యమైపోయింది. పన్నిద్దరు ఆళ్వార్లలో ఏకైక మహిళ అండాళ్!
.
గోదావైభోగం మధురభక్తికి ప్రతీక. ఈ అంశాన్నే ఇతివృత్తంగా తీసుకుని కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యాన్ని రాశారు. రాయడంకాదు, స్వామివారే రాయించుకున్నారు. రాయలవారు కళింగయుద్ధాన్ని ముగించుకుని…విజయవాడ దగ్గరలోని శ్రీకాకుళ క్షేత్రంలో విడిది చేశారు. ఆరాత్రి ఆంద్రమహావిష్ణువు కలలో కనిపించి….ఆండాళ్ మధుర గాథను తెలుగులో ప్రబంధంగా రాశి సమర్పించమని ఆనతిచ్చాడు. అలా తెలుగువారికి గోదాదేవితో ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది.
.
తిరుప్పావై…..
తిరు అంతే శ్రీ, పావై అంటే వ్రతం. తిరుప్పావై వ్రతాన్ని శ్రీవ్రతమనీ అంటారు. తిరుప్పావై వ్రతాన్ని శ్రీవ్రతమని అంటారు. భక్తాదులు సూర్యోదయానికి ముందే…ఆరాధన మొదలు నివేదన దాకా అన్నీ పూర్తి చేసుకుంటారు. గోదాదేవి పాడుకున్న 30 పాశురాల్ని రోజుకొక్కటి చొప్పున ఆలపిస్తారు. వయో లింగభేదాలు లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని జరుపుకోవచ్చు అంటారు వైష్ణవ గురువులు. ‘ఇష్టఫలమును అందుకోనుటకు కష్టపడవలె చెల్లెలా’ అంటుంది గోదాదేవి చెలికత్తెలతో – ఓ పాశురంలో. ఆధ్యాత్మికోన్నతికి శారీరక క్రమశిక్షణ కూడా చాల అవసరం. ఓవైపు వణికించే చలి. వెచ్చగా దుప్పటి కప్పుకుని పడుకోవాల్సివస్తుంది. ఆమత్తును జయించి, తెల్లవారుజామునే మేల్కొనాలి. ఆహార నియమాల్ని పాటించాలి. ఇతభాషణ – మరో ప్రధాన సూత్రం. ఇతరులకు సాధ్యమైనంత ఇబ్బందిలేకుండా వ్యవహరించాలి. అంటే, ప్రియభాషణ కూడా అవసరమే. దానధర్మాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. భోగాలకు దూరంగా ఉండాలి. ఈతరహా ధార్మిక జీవన విధానమే ఆధ్యాత్మికొన్నతికి సోపానం.
.
ఆలయాల్లో….
రేపల్లెల్లో గోపికలు కాత్యాయని వ్రతాన్ని నోచినట్టే…గోదాదేవి పాశురాలతో శ్రీరంగనాథుని కొలుస్తుంది. ‘తిరుప్పావై పైపైకి కృష్ణుడికి గోపికలకూ సంబంధించిన మామూలు కథలా అనిపించవచ్చు కానీ, పత్తిపువ్వును విప్పుతూ పొతే పత్తి ఎలా విస్తరిస్తుందో….ప్రతి పాశురానికీ అంత విస్తారమైన అర్థం ఉంది’ అంటారు చినజీయరు స్వామి. ఇందులో రామాయణ, భారతాల సారం ఉంది. అంతర్లీనంగా…శ్రీవైష్ణవతత్వం, ఉపనిషత్ రహస్యాలూ ఉన్నాయి. వైష్ణవాలయాలు ధనుర్మాసంలో ఆధ్యాత్మికశోభతో వెలిగిపోతుంటాయి. విష్ణుసహస్రనామ పారాయణాలూ, పాశురగానాలూ, గీతా ప్రవచనాలూ ప్రతిధ్వనిస్తుంటాయి. తిరుమలలో…ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదులుగా, తిరుప్పావైతోనే స్వామిని మేల్కొలుపుతారు. ధనువు అన్న మాటకు ధర్మమనే అర్ధమూ ఉంది. ఈ మాసంలో ఆచరించే ధర్మమే…మనల్ని మిగతా మాసాల్లోనూ కాపాడుతుందనీ సత్యమార్గంలో నడిపిస్తుందనీ పండితులు చెబుతారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List