బీబీ నాంచారమ్మ. ~ దైవదర్శనం

బీబీ నాంచారమ్మ.


* బీబీనాంచారమ్మను పెళ్లాడిన శ్రీనివాసుడు.. ముస్లింల అల్లుడు తిరుమల గోవిందుడు..
* సుర‌తాని జీవిత చరిత్ర..!!
* ఎవరు బీబీ నాంచారమ్మ..?
* బీబీనాంచారమ్మ గురించి కథలెన్నో...
.
.
ఒక దేవుడిని పూజించేవారంద‌రూ క‌లిసి త‌మ‌ని తాము ఒకే మ‌తంగా భావించుకోవ‌చ్చు. కానీ సాక్షాత్తూ ఆ భ‌గ‌వంతుని కులం ఏది అని అడిగితే ఏమ‌ని చెప్పగ‌లం! ఆద్యంత ర‌హితుడికి కులమ‌తాల‌ను ఆపాదించ‌లేం క‌దా! దానిని నిరూపించే ప్రమాణ‌మే బీబీ నాంచార‌మ్మ! `నాచియార్‌` అనే త‌మిళ ప‌దం నుంచి నాంచార‌మ్మ అన్న పేరు వ‌చ్చింద‌ని చెబుతారు. అంటే భ‌క్తురాలు అని అర్థమ‌ట‌. ఇక `బీబీ` అంటే భార్య అని అర్థం.
.
తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్నీ కావు. సాక్షాత్తు స్వామివారికి రెండవ భార్య ముస్లిం. ఆమె పేరు బీబీ నాంచారమ్మ. కనకదుర్గకు ఈమె ఆడపడుచు. చాలామంది మహమ్మదీయులు నేటికీ ఈమెను విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ముస్లింలు కూడా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. తిరుమలలో మూలవిరాట్టుకు సయ్యద్‌ మిర్జా అనే ముస్లిం సమర్పించిన బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన చేస్తారు. ఉత్సవ దేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్‌ మీర్జా సమర్పించిన మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.

.
బీబీనాంచారమ్మ గురించి మరిన్ని వివరాలు... మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఒక మహమ్మదీయ సుల్తాను దండెత్తి, నారాయణపురంలోని తిరునారాయణ స్వామి వైష్ణవాలయంలోని వైష్ణవ విగ్రహాన్ని విగ్రహమైన సంపత్కుమార స్వామి విగ్రహాన్ని కూడా అపహరించి డిల్లికి తీసుకుపోయారు.
.
ఆ విగ్రహ సౌందర్యం చూచి ఆ విగ్రహాన్ని సుల్తాను కూతురు సమ్మోహితురాలై ప్రేమలో పడుతుంది. అంతఃపురములో తన వద్దనే ఉంచుకొన్నది. ఆ తరువాత కొంత కాలానికి శ్రీ రామానుజాచారి డిల్లి సుల్తాన్ని ఒప్పించి, విగ్రహాన్ని తీసుకొని తిరునారాయణపురానికి బయలుదేరారు. ఆ విగ్రహాన్ని ఘాడంగా ప్రేమించిన బీబీ నాంచారమ్మ కూడా స్వామి విగ్రహాన్ని అనుసరించి తిరునారాయణపురానికి బయలుదేరారు. అక్కడ ప్రతిస్టించిన స్వామి మూర్తిని విడిచి రాలేక అక్కడే స్వామి వారిలో ఐక్యం అయినది. (బీబి నాచ్చియర్ , బీబి నాచ్చియరమ్మ....బీబి నాంచారమ్మగా మారింది.) వివిధ వృత్తాంతాల్లో దండెత్తిన చక్రవర్తి ఔరంగజేబు గాను, మాలిక్‌ కాఫూర్‌ గాను చెప్పబడింది. తీసుకెళ్ళిన వైష్ణవ విగ్రహం శ్రీ రంగంలోని శ్రీ రంగనాథ విగ్రహమని, మేళ్కోటలోని క్రిష్ణ విగ్రహమని, విగ్రహాన్ని సుల్తాను కూతురే తిరిగి తీసుకువచ్చిందని, రామానుజస్వామి వెళ్ళి తెచ్చారని, పురబ్రహ్మణులు తీసుకువచ్చారని ఇలా వివిధ రకాలుగా పురాణాలు చెబుతున్నాయి.

.
అనాదిగా తిరుమల తత్వం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. వెంకటేశ్వరుని పట్టపురాణిగా కీర్తించబడే అమ్మవార్లకు అలమేలుమంగ లేక పద్మావతిగా తమిళంలో ఆండాళ్‌, గోదాదేవిగా, శ్రీదేవిగా చెప్పుకుంటారు. స్వామి దేవేరిగా బీబీ నాంచారమ్మను కూడా భక్తులందరూ స్మరించుకోవడం పరిపాటి. బీబీ అనే పదం ముస్లింలకు సంబంధించిన ఉర్దూ బాషా పదం. నాంచారి అనేది తమిళ పదం. రెండింటి అర్థం భార్యే. బీబీ నాంచారి ప్రస్థావనకొచ్చేసరికి కొందరు వైష్ణవ పండితులు ఒక కథను ప్రస్థావించారు.
.
ఒకప్పుడు మైసూరు చక్రవర్తి హైదరాలీ తిరుమల దగ్గరలో ఉన్న చంద్రగిరి కోటను వశపరుచుకున్నాడట. దారిలో ఉండే హిందూ దేవాలయన్నింటినీ నగలు, సంపదలతో సహా వశపరుచుకునేవాడట. కాగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సొత్తును సైతం స్వాధీనం చేసుకోవడానికి ఉద్యక్తుడవుతుండగా కొందరు తిరుమలకు వెళ్ళే యాత్రికుల తలనీలాలు, గడ్డం గుబురుగా పెంచుకుని గోవిందనామంతో వెళుతున్నారట. దానితో హైదరాలీ అక్కడి ప్రాంతం వారిని అడుగగా అది తిరుమల ఆచారమని, స్వామివారు బీబీ నాంచారి అనే ముస్లిం యువతిని పెండ్లాడారని భక్తులు స్వామివారి గౌరవార్థం జుట్టు గడ్డం పెంచుకుని వెళతారని.. స్వామిని దర్శించుకుని వచ్చేటపుడు తిరిగి తలనీలాలు సమర్పించుకుని బోడి గుండుతో వెళతారని చెప్పగానే హైదరలీ పశ్చాత్తాపపడి తమ మతానికి చెందిన బీబీ నాంచారి గౌరవప్రథంగా స్వామివారి సంపదను కొల్లగొట్టకుండానే తిరిగి వెళ్ళాడట.

.
మ‌రికొన్ని గాథ‌ల ప్రకారం:..
బీబీ నాంచార‌మ్మ గాథ ఈనాటిది కాదు. క‌నీసం ఏడు వంద‌ల సంవ‌త్సరాల నుంచి ఈమె క‌థ జ‌న‌ప‌దంలో నిలిచి ఉంది. కొన్ని క‌థ‌ల ప్రకారం బీబీ నాంచార‌మ్మ, మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె. ఆమె అస‌లు పేరు సుర‌తాని. స్వత‌హాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మ‌తాన్ని స్వీక‌రించాడు. త‌న రాజ్యాన్ని విస్తరించే బాధ్యత‌ను ఖిల్జీ, మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫిర్ ద‌క్షిణ భార‌త‌దేశం మీద‌కి విరుచుకుప‌డ్డాడు. త‌మ దండ‌యాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అత‌ను శ్రీరంగం చేరుకునేస‌రికి రంగ‌నాథుని ఆల‌యం, భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల‌తో ధ‌గ‌ధ‌గ‌లాడిపోతోంది. పంచ‌లోహాల‌తో రూపొందించిన ఆయ‌న ఉత్సవ‌మూర్తిని చూసిన కాఫిర్ క‌ళ్లు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాల‌ను క‌రింగిస్తే ఎంత ధ‌నం స‌మ‌కూరుతుందో క‌దా అనుకున్నాడు. అలా త‌న దండ‌యాత్రలో దోచుకున్న వంద‌లాది విగ్రహాల‌లోకి రంగ‌నాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని దిల్లీకి బ‌య‌లుదేరాడు.
.

డిల్లీకి చేరుకున్న త‌రువాత తాను దోచుకున్న సొత్తుని త‌న కుటుంబం ముంద‌ర గొప్పగా ప్రద‌ర్శించాడు మాలిక్‌. వాట‌న్నింటి మ‌ధ్యా శోభాయ‌మానంగా వెలిగిపోతున్న రంగ‌నాథుని విగ్రహాన్ని చూసిన అత‌ని కూతురు, త‌న‌కు ఆ విగ్రహాన్ని ఇవ్వమ‌ని తండ్రిని అడిగింది. ఆ విగ్రహం త‌న‌చేతికి అందిందే త‌డ‌వుగా, దాన్ని త‌న తోడుగా భావించ‌సాగింది. విగ్రహానికి అభిషేకం చేయ‌డం, ప‌ట్టు వ‌స్త్రాల‌తో అలంక‌రించడం, ఊయ‌ల ఊప‌డం... అలా త‌న‌కు తెల‌య‌కుండానే ఒక ఉత్సవ మూర్తికి చేసే కైంక‌ర్యాల‌న్నింటినీ ఆ విగ్రహానికి అందించ‌సాగింది. ఆ విగ్రహంతో ఒకో రోజూ గ‌డుస్తున్న కొద్దీ దాని మీదే సుర‌తాని మ‌న‌సు ల‌గ్నం కాసాగింది. మ‌రో ప‌క్క రంగ‌నాథుని ఉత్సవ మూర్తి లేని శ్రీరంగం వెల‌వెల‌బోయింది. దండ‌యాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంత‌గా బాధ‌ప‌డ్డాయో, రంగ‌నాథుని విగ్రహం కోల్పోయిన భ‌క్తులూ అంతే బాధ‌లో మునిగిపోయారు. చివ‌ర‌కి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్‌నే వేడుకునేందుకు దిల్లీకి ప్రయాణ‌మ‌య్యారు. సాక్షాత్తూ ఆ రామానుజాచార్యులే వారికి ప్రాతినిధ్యం వ‌హించార‌ని చెబుతారు.
.
రంగ‌నాథుని ఉత్సవ‌మూర్తిని వెతుక్కుంటూ త‌న ఆస్థానాన్ని చేరుకున్న అర్చకుల‌ను చూసి మాలిక్ కాఫిర్ మ‌న‌సు క‌రిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అనుమ‌తిని అందించాడు. అయితే ఆపాటికే రంగ‌నాథుని మీద మ‌న‌సుప‌డిన సుర‌తాని గురించి విన్న అర్చకులు, ఆమె ఆద‌మ‌రిచి నిదురించే స‌మ‌యంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సుర‌తాని ఉద‌యాన్నే లేచి చూస్తే ఏముంది! త‌న క‌ల‌ల ప్రతిరూపం క‌నుమ‌రుగైంది. ఎవ‌రు ఎంత ఒదార్చినా సుర‌తాని మ‌న‌సు శాంతించ‌లేదు. ఆ విష్ణుమూర్తినే త‌న ప‌తిగా ఎంచుకున్నాన‌ని క‌రాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీరంగానికి ప‌య‌న‌మైంది. శ్రీరంగం చేరుకున్న సుర‌తాని ఆ రంగ‌నాథునిలో ఐక్యమైంద‌ని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడ‌వ‌చ్చు.
.

మ‌రోక్క కథ‌ ప్రకారం:..
ఆ విగ్రహం రంగ‌నాథునిది కాదు. మెల్కోటే (క‌ర్నాట‌క‌)లో ఉన్న తిరునారాయ‌ణునిది అని చెబుతారు. దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆల‌యంలో కూడా బీబీ నాంచార‌మ్మ విగ్రహం క‌నిపిస్తుంది. ఇంకొంద‌రు భూదేవి అవ‌తార‌మే బీబీ నాంచార‌మ్మ అని న‌మ్ముతారు. క‌లియుగ‌దైవ‌మైన వేంక‌టేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవ‌త‌రించింద‌ని భ‌క్తుల విశ్వాసం. అందుక‌నే తిరుప‌తిలోనూ బీబీనాంచార‌మ్మ విగ్రహం కూడా క‌నిపిస్తుంది. ఏదేమైనా ఆమె ముస‌ల్మాను స్త్రీ అన్న విష‌యంలో మాత్రం ఎలాంటి వివాద‌మూ లేదు. ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే త‌మిళంలో తుర‌ష్క భ‌క్తురాలు అని అర్థం. బీబీ నాంచార‌మ్మను చాలామంది ముస‌ల్మానులు సైతం వేంక‌టేశ్వరునికి స‌తిగా భావిస్తారు. క‌ర్నాట‌కను హైద‌ర్ఆలీ అనే రాజు పాలించే కాలంలో, అత‌ను ఓసారి తిరుమ‌ల మీద‌కు దండ‌యాత్రకు వ‌చ్చాడ‌ట‌. అయితే ఆ ఆల‌యం ఒక ముస్లిం ఆడ‌ప‌డుచును సైతం అక్కున చేర్చుకుంద‌న్న విష‌యాన్ని తెలుసుకుని వెనుతిరిగాడ‌ట‌. ఇదీ బీబీ నాంచార‌మ్మ క‌థ ‌..!
.
తమ మతానికి చెందిన ఆడపడుచును హైదరలీ గౌరవించడంతో అప్పటి నుంచి ఏ యేటికాయేడు ముస్లింలు కూడా వేంకటేశ్వరుని కొలుచుకోవడం ఆనయితీగా వస్తోంది. అయితే 16వ శతాబ్దానికి చెందిన పదకవితా పితామహుడు అన్నమయ్య తన కీర్తనలలో ఎక్కడ కూడా బీబీ నాంచారి పేరు ప్రస్థావించకపోవడం గమనార్హం.
.
కడప జిల్లాలోని దేవుని కడపలో ఇప్పటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి యేటా ఉగాది రోజుల ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. తమ ఇంటి ఆడబిడ్డ అయిన బీబీ నాంచారమ్మను చేసుకున్నందుకు ఆయన్ను తమ ఇంటి అల్లుడిగా భావించి ఇలా చేస్తున్నారు. బీబీ నాంచారమ్మకు ఉగాది రోజు పుట్టింటి సారెగా బియ్యం, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, మిరపకాయలు, కూరగాయలను సమర్పిస్తారు. ఉగాది రోజున బీబీ నాంచారమ్మకు దినుసులు ఇచ్చి దర్శనం చేసుకుని తమ ఆడబిడ్డను మంచిగా చూసుకోవాలని స్వామిని కోరుకుంటామని ముస్లింలు చెబుతుంటారు.
....
మీ..
ఆర్.బి. వెంకట రెడ్డి.
https://www.facebook.com/rb.venkatareddy/posts/10212933960576576
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive