తెలుగువారి ముఖ్యమైన పండుగలలో అట్ల తద్ది లేదా అట్ల తదియ కూడా ఒకటి. ఆశ్వయుజ బహుళ తదియను అట్ల తద్ది పేరుతో జరుపుకుంటారు. "అట్లతద్దె ఆరట్లు.. ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వడం పరిపాటి. సాయం సమయంలో వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసి, గోపూజకు వెళ్లి, అటు నుంచి చెరువులు, కాలువల్లో దీపాలను వదలి, చెట్లకు ఊయల కట్టి ఊగుతారు.పెళ్లీడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి కలలు కనడం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఏటా జరుపుకునే అట్లతద్ది నోము అందులో ముఖ్యమైంది.ఆశ్వయుజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకుంటారు.అయిదేళ్లు దాటిన బాలికల నుంచి పండు ముత్తైదువుల వరకు దీనిని చేసుకుంటారు. అవివాహిత యువతలు మంచి భర్త రావాలని పూజిస్తే, వివాహితులు మంచి భర్త దొరికినందుకు, అతడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. సాధారణంగా వివాహమైన తర్వాత పదేళ్లపాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి, సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే చివరిసారి పూజచేసి ముత్తైదవులను పిలిచి వాయినాలిచ్చి కన్నుల పండువగా ముగిస్తారు.త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతిదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యం కోసం చేసుకొనే వ్రతం.
No comments:
Post a Comment