జ్యోతిషం అంటే ఏమిటి, అది నమ్మకమా శాస్త్రమా..? ~ దైవదర్శనం

జ్యోతిషం అంటే ఏమిటి, అది నమ్మకమా శాస్త్రమా..?

గ్రహ గతుల ఆధారంగా మనిషి జీవన విధానాన్ని, ఆనందంగా, ఆరోగ్యంగా సమస్యలు లేకుండా జీవించటానికి మార్గాన్ని తెలిపేది జ్యోతిషం. దాన్ని పాటించటం పాటించక పోవటం అనేది వ్యక్తిగత అంశం. ఒకరికి ఒక సమయంలో మాత్రమె అనుభవం అయితే అది నమ్మకం అవుతుంది కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మందికి అనుభవం అవుతున్నది నమ్మకమో శాస్త్రమో మీరే నిర్ణయించాలి.

ప్రశ్న: నేను జ్యోతిషాన్ని నమ్మను అయినా బాగున్నాను కదా?
సమాధానం: ముందుగా ఒక విషయం జ్యోతిషాన్ని నమ్మటం కాదు ఆచరించటం అని చెప్పండి. అది నమ్మకం కాదు పూర్తి స్థాయి శాస్త్రం. మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం వైద్యాన్ని, సమస్యలు లేనంత కాలం జ్యోతిషాన్ని నమ్మక పోవటం లేదా ఆచరించక పోవటం పెద్ద విషయం కాదు. కాని ఆరోగ్యం చెడిపోగానే డాక్టర్ దగ్గరికి పరుగెత్తటం సమస్య రాగానే జ్యోతిష్కుని దగ్గరికి పరుగెత్తటం చేయకుండా ఉంటాను అనే నమ్మకం ఉంటే జ్యోతిషాన్ని కాని వేరే ఏ ఇతర శాస్త్రాల్ని కాని, నమ్మటం పాటించటం అవసరమే లేదు. జ్యోతిషం బాగున్న వారికొరకు కాదు, బాగుండాలనే వారి కొరకు మాత్రమె.

ప్రశ్న: జ్యోతిషంలో చెప్పేవి అన్ని అవుతాయా, అది ఖచ్చితంగా ఫలిస్తుందా?

సమాధానం: హైదరాబాద్ కు బయల్దేరిన బస్సు హైదరాబాద్ కు చేరుతుందా అంటే చేరుతుంది అనే సమాధానమే వస్తుంది. కాక పొతే చేరటానికి ఎంత ప్రాబబిలిటీ ఉందొ చేరక పోవటానికి కూడా అంటే ప్రాబబిలిటీ ఉంటుంది. బస్సు చెడిపోవచ్చు, పెట్రోల్ అయిపోవచ్చు, దారిలో రోడ్ రిపేర్ ఉండొచ్చు... అలాగే జ్యోతిషం లో కూడా మనం ఇచ్చే వివరాలు చేసే విశ్లేషణ ని బట్టి ఫలితం ఉంటుంది. జ్యోతిషం నూటికి నూరుపాళ్ళు ఫలిస్తుంది కాని పైన చెప్పినట్టు అన్ని సరిగా ఉన్నప్పుడు మాత్రమె అది ఫలిస్తుంది.

 ప్రశ్న: జ్యోతిషం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చా?

సమాధానం: ఖచ్చితంగా మార్చుకోవచ్చు కానీ జ్యోతిషం ఆధారంగా మన జీవన విధానాన్ని మార్చుకున్నప్పుడే అది సాధ్యం అవుతుంది. అలాగే ఈ మార్పు కూడా ఒక పరిధిలోనే ఉంటుంది. మన కర్మ ను అనుసరించే జ్యోతిషం ఫలిస్తుంది. మనకు రాసి పెట్టిన వాటిలో హెచ్చుతగ్గులుగా ఫలితాన్ని మార్చుకునే స్వేచ్చ మన పురాకృత కర్మ కల్పిస్తుంది. హైదరాబాద్ వెళ్ళే బస్ ఎక్కి విజయవాడకి వెళ్ళాలంటే కుదరకపోవచ్చు కానీ, హైదరాబాద్ బస్ లో మంచి సీట్ లో కుర్చుని మన ప్రయాణాన్ని సమస్యలు లేకుండా సాగేలా చేసుకోవచ్చు. జ్యోతిషం ప్రభావం కూడా ఇలాగే ఉంటుంది మనకు నిర్దేశించిన జీవితం వీలైనంత ఆనందంగా గడపటానికి జ్యోతిషం సహకరిస్తుంది.

ప్రశ్న: నేను హిందువును కాదు, జ్యోతిషాన్ని నమ్మొచ్చా?

సమాధానం: నమ్మొచ్చా కాదు, పాటించోచ్చా అని అడగండి. జ్యోతిషం పూర్తిస్థాయి శాస్త్రం దానికి కుల, మత, జాతి ప్రాంత భేదాలు లేవు. ప్రతి మనిషికి సమస్య ఒకేలా ఉన్నప్పుడు శాస్త్రం వేరు వేరుగా ఉండదు కదా. జ్వరం వస్తే అందరు ఒకే రకమైన మందులు వాడతారు కానీ, మతం వేరైనంత మాత్రాన వైద్యం వేరు కాదు కదా? జీవన విధానంలో మార్పు ఉండవచ్చు కాని సమస్యలలో మార్పు ఉండదు కాబట్టి సమస్యలకు మూలం ఏమిటి దాని పరిష్కారం ఏమిటి అని తెలుసుకోవటానికి నిరభ్యంతరంగా ఎవరైనా జ్యోతిషాన్ని అనుసరించవచ్చు.

ప్రశ్న: జ్యోతిషాన్ని పాటించకుంటే ఏమవుతుంది?

సమాధానం: ప్రళయం రాదు, సునామీ కూడా రాదు. పాటించటం పాటించక పోవటం వ్యక్తిగత విషయం. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంది, జ్యోతిషం కూడా అంతే పాటిస్తే జీవన ప్రయాణం ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా హాయిగా సాగుతుంది, పాటించక పోయినా సాగుతుంది కానీ...

ప్రశ్న: జ్యోతిషంలో చెప్పే పరిహారాలు నిజంగా ఫలిస్తాయా?

సమాధానం: ఫలానా వ్యాధికి ఫలానా చికిత్స అని వైద్యం చెపుతుంది అలాగే జ్యోతిషం కూడా ఫలానా సమస్యకు ఫలానా పరిష్కారం చేస్తే సమస్య తొలగి పోతుంది అని చెపుతుంది. వైద్యం ఎలా అయితే ఫలితం ఇస్తుందో జ్యోతిషంలో చెప్పే పరిహారాలు కూడా అంటే ఫలితం ఇస్తాయి. మనం వైద్యాన్ని, పరిహారాల్ని ఆచరించే విధానాన్ని బట్టి ఫలితం ఉంటుంది.

 ప్రశ్న: జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది?
సమాధానం: జ్యోతిషం ఏ విషయంలో అయిన సూచన చేస్తుంది. ఇలా చేస్తే మంచి జరుగుతుంది అని. చేయకుంటే మంచి జరగదా అంటే మనం మంచి అనుకునే దాన్ని బట్టి జరుగుతుందా జరగదా అనేది ఉంటుంది. వివాహ విషయంలో జ్యోతిష శాస్త్రకారులు కొన్ని ఖచ్చితమైన నియమాలు పెట్టారు. వివాహం అయిన తర్వాత సమస్యలు రాకుండా ఉండటానికి అలాగే ఆరోగ్యవంతులైన సమాజానికి ఉపయోగపడే సంతానాన్ని పొందటానికి వారు ఈ నియమాలు పెట్టారు. పైన చెప్పినట్టు దేన్నీ అయినా పాటించటం పాటించక పోవటం వ్యక్తిగత విషయం కానీ సమాజ శ్రేయస్సు కొరకు ఏర్పాటు చేయబడిన నియమాలే తప్ప దీనిలో నియమాలు పెట్టిన ఋషుల వ్యక్తిగత స్వార్థం కానీ చెప్పే జ్యోతిష్కుల వ్యక్తిగత స్వార్థం కానీ లేదు అనేది అర్థం చేసుకుంటే మంచిది.

ప్రశ్న: రత్నాలు ధరిస్తే నిజంగా అదృష్టం కలిసి వస్తుందా?

సమాధానం: ముందు అదృష్టం అనే దానికి మీకు సరైన అర్థం తెలిస్తే అది కలిసి వస్తుందో లేదో తెలుస్తుంది. మన శ్రమ లేకుండా అయాచితంగా వచ్చేది ఏది కూడా అదృష్టం కాదు అని గుర్తు పెట్టుకోండి. అడుక్కునే బిచ్చగాడు కూడా కష్టపడి నాలుగు ఇండ్లు తిరిగి అడుక్కుంటాడు అయాచితంగా, శ్రమ లేకుండా అదృష్టం కలిసి రావాలి అనుకోవటం అడుక్కోవటం కంటే హీనం. ఏ రత్నం కూడా అదృష్టాన్ని ఇవ్వదు. రత్న శాస్త్రం చెప్పేది ఏమిటంటే ఒక గ్రహం మనకు అనుకూలంగా ఉండి బలహీనంగా ఉండటం వలన అది కారకత్వం వహించే అంశాలలో పూర్తి స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు కాబట్టి దానికి సహాయకంగా ఫలితాన్ని పెంచుకోవటానికి ఆ గ్రహానికి సంబంధించిన రత్నం ధరించటం మంచిది అని. అంతే కాని రాయి ధరించగానే తెల్లారే సరికి ఏ రాజో, మంత్రో అయిపోరు. అలా అవుతారు అని ఎవరైనా చెపుతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని గ్రహించండి. అన్నింటికంటే ముఖ్య విషయం అదృష్టాన్ని డబ్బుపెట్టి కొనుక్కోవలనుకోవటం కంటే మూర్ఖత్వం మరోటి ఉండదు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List