అష్టైశ్వర్యాలు ప్రసాదించే కార్తీకమాసం. ~ దైవదర్శనం

అష్టైశ్వర్యాలు ప్రసాదించే కార్తీకమాసం.


* కార్తీకమాసం అని పేరు ఎలా వచ్చింది...
* కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధి విధానాలు ...
హిందువులకు పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ రోజునుంచి ఘనంగా ప్రారంభమయింది. "కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు." అని స్కంద పురాణంలో పేర్కొనబడింది.

కార్తీకమాసంలో నదిస్నానం, పూజలు, జపాలు హోమాలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం "కార్తీకమాసం'. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తీకమాసం" అని పేరు వచ్చింది.
కార్తీక మాస ప్రాధాన్యతను పద్మపురాణం ఉత్తరఖండం లో వివరించబడినది.
కార్తీక మాస ప్రాధాన్యతను శ్రీ కృష్ణుడు, సత్యభామ తో ఇలా చెప్పారు :
వేదాలను దొంగలించి సముద్రం లో దాగిన శంకాశుర అను రాక్షశుడిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం ధరించి, రాక్షస సంహారం గావించి వేదాలను రక్షించాడు. కార్తీక మాసం లో 11 వ రోజు శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినారు.

ఈ మాసం లో తిరుప్పావై (గోదాదేవి గురించినది) చదువుతారు. తెల్లవారుఝామునే లేచి తులసికోట దగ్గర దీపాలు పెట్టి తులశమ్మకి పూజ చేస్తారు. ఈ మాసం చివరి సోమవారం 108 / 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి న శ్రీ సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారు.
ఈ కార్తీక మాసమహాత్మ్యమును గూర్చి పూర్వం నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులకందరకు సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రములు, విష్ణు మహిమలను వినిపించు సమయాన, ఓ సూతముని శ్రేష్ఠా! కలియుగముందు ప్రజలు సంసార సాగరమునుండి తరింపలేక, అరిషడ్వర్గములకు దాసులై! సుఖమగు మోక్షమార్గము తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మములన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమదైవమెవరు? మానవునికి ఆవరించియున్న ఈ అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫల మిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువుచే వెంబడించబడు ఈ మాన వులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పమని కోరినారు.

ఆ ప్రశ్నలను ఆలకించిన సూతముని, ఓ ముని పుంగవులారా! క్షణికకమైన సుఖభోగాల కోసం పరితపించుచూ! మందబుద్ధులగుచున్న మానవులకు ‘‘ఈ కార్తీకమాస వ్రతము’’ హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. దీనిని ఆచరించుట వల్ల సకల పాపాములు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీకమాస వ్రతమాచరించాలని కోరికను కలుగచేస్తాడు ఆ పరమాత్మ! దుష్టులకు దుర్మా ర్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యేవరకు ఏవగింపు కలిగిస్తాడు.
కార్తీకమాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీకమాసంలో ప్రతీరోజూ తెల్లవారుఝూముననే స్నానమాచరించవలెను.అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపమును కార్తీకమాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం , ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించవలేను. కార్తీకమాసమంతా ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించవలెను. అట్లే సాయంత్ర సమయంలో శివాలయాల్లో గానీ వైష్ణవాలయాల్లోగానీ గోపురద్వారం వద్దగానీ, దేవుని సన్నిదానంలోగానీ ఆలయప్రాంగణంలోగానీ దీపాలు వెలిగించిన వారికి సర్వపాపములు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడ పుణ్యప్రదమే!

కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను ఉంఛి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతోగానీ,కొబ్బరినూనెతోగానీ, నెయ్యితోగాని, అవిశనూనెతోగానీ, ఇప్పనూనెతోగానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపమును వెలిగించవలెను. అంతే కాకుండా కార్తీకమాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీకమాసంలొ ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం. ఈ విధంగా కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం , దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.

* కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు..
కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను.
నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.
శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.
ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను.
ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List