నరక చతుర్దశి.. ~ దైవదర్శనం

నరక చతుర్దశి..



నరకాసురుడిని సంహరించింన సత్యభామ ....
యమునికి ఎంతో ఇష్టమైన రోజు నరక చతుర్థ్ద్దశి ....
నరక చతుర్థ్ద్దశి గురించి కొన్ని తెలియని ప్రాచీన గ్రంధాలలో దాగివున్న రహస్యాలు ...

అది భారతఖండం, అస్సాంలోని గౌహతి ప్రాంతంలో గల ప్రాగ్-జ్యోతిషపురం అనే రాజ్యానికి రాజు నరకాసురుడు ... నరక చతుర్దశి ఆచరణ వెనక ఉన్న కథల్లో నరకాసురుడి కథ ప్రధానమైంది. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిమాతని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు...

భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలోపడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. స్వయాన తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు. దేవమాత అదితి కర్ణ్భారణాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వందయుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు.

మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూవారను విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం ఇదనికొక వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది..

ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీకృష్ణుని శరణువేడగా గోపాలుడు నరుకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది..

తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది.

నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.
ఈ పండగల గురించి కొన్ని తెలియని రహస్యాలు ప్రాచీన గ్రంధాలలో దాగున్నాయి.....

ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. చతుర్దశి తిధి నాడు నరకలోకంలో ఉన్న పితృదేవతల కోసం దీపాలు వెలిగించితే, వారు స్వర్గలోక వాసాన్ని పొందుతారని అర్ధం.. ఆశ్వియుజ కృష్ణ చతుర్దశి నాడు చంద్రోదయానికి ముందు గానే నువ్వులు నూనేతో అభ్యంగన స్నానం చెయ్యాలి.(తలంటి స్నానం) స్నానాంతరం తప్పనిసరిగా యమ తర్పణం విడవాలి...

ఇక్కడ చంద్రోదయ కాలానికి ప్రాముఖ్యత ఉంది. బహుళ చతుర్దశినాడు చంద్రోదయం ఇరవై ఎనిమిది ఘడియలకు అవుతుంది . అప్పటికి ఒక గంట లోపు మాత్రమే , రాత్రి సమయం ఉంటుంది.సరిగ్గా ఆ సమయంలోనే చతుర్దశి అభ్యంగన స్నానం చెయ్యాలి. సూర్యోదయం తరువాత చేసే అభ్యంగన స్నానానికి విలువ లేనందున, దాన్ని " గౌణం"అని అన్నారు (గౌణం అంటే ప్రాముఖ్యం లేనిది అని అర్ధం)

దీపావళి సమయంలో నువ్వుల నూనేతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్దశి నాడు - దీపావళి అమావాస్య సమయాలలో నువ్వుల నూనేను లక్ష్మి దేవి ఆవహించి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. తలంటికి ఉపయోగించిన నీళ్ళలో ఉత్తరేణి, తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా కలియబెట్టాలి.ఇలా చేసినందు వల్ల మెదడును, నాడులను ఉత్తేజితం చేసే భాస్వరం తయారై, ఆ జల స్నానం వల్ల బుద్ధి చురుకుదనం పెరుగుతుంది.

నరక చతుర్దశి నరకలోకవాసులకు పుణ్య గతులను కలిగించే పండుగ అని, అందుకే ఈ రోజున, తల్లి తండ్రులు లేని వారు తప్పకుండా దక్షిణ దిక్కున దీపం వెలిగించాలి. చతుర్దశి నాటొ సాయంకాలం ప్రదోషకాలములో దీపదానం చెయ్యాలి. దేవాలయాలలో దీప పంక్తులు ఏర్పాటు చెయ్యాలి. లక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందటానికి దీపావళి చతుర్దశి నాడు, కార్తిక సుద్ధ పాడ్యమి నాడు తప్పకుండా దీపదానం చెయ్యాలి.

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందుగానే తలంట్లు పోసుకొంటే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...