రామాయణ రహస్యములు. ~ దైవదర్శనం

రామాయణ రహస్యములు.

గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ఒక ఆధ్యాత్మిక సాహితీ విశ్లేషణాత్మక రచన. వ్యాస సంకలనం. సరళమైన గ్రాంధిక భాషలో వ్రాయబడిన ఈ రచన రామాయణ మహాభారతాల గురించి కొన్ని విశేషాల సంగ్రహం. ఇవి ముందుగా 1965లో ఆంధ్రప్రభ దినపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురింపబడ్డాయి. జ్యోత్స్న ప్రచురణల ద్వారా 1967లో పుస్తక రూపంలో వెలువడ్డాయి. మరల 1980లోను, 2000 లోను పునర్ముద్రింపబడ్డాయి. ఈ పుస్తకంలో రెండు ప్రధాన విషయాలు - సుందరకాండ, దాని పేరు, అందులో కుండలినీయోగ రహస్యము  మహాభారతం తరువాత రామాయణం వ్రాయబడిందన్న కొందరు విమర్శకులకు నిశితమైన విశ్లేషణాత్మకమైన జవాబు. వీటితోబాటు మరి కొన్ని వ్యాసాలున్నాయి.

ఎన్. రమేశన్ అనే ఐ.ఎ.ఎస్. అధికారి ముందుమాట ఉంది. అందులో రచయిత పరిశోధనాత్మక విశ్లేషణను, పాండిత్యాన్ని ప్రశంసించడమైంది. తరువాత శ్రీమాన్ గుండేరావు హర్కరె అనే సంస్కృత పండితుని ముందుమాట సంస్కతంలో వ్రాయబడింది. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పరిచయ పీఠిక ఉంది. అందులో రచయిత శర్మ పాండిత్యం ఎంత లోతైనదో, శ్రీవిద్యపై రచయితకు ఎంత చక్కని అవగాహన ఉన్నదో, ఈ రచనకై రచయిత రామాయణ మహాభారతాలను ఎన్నిసార్లు చదివి ఉండాలో ఊహిస్తూ విశ్వనాధ సత్యనారాయణ రచయితను కొనియాడాడు.

తరువాత రచయిత "ముందొకమాట" అనే ఉపోద్ఘాతాన్ని వ్రాశాడు. అందులో సాహిత్యానికి  కవి  రసము అనే అంశాలు అత్యంత ప్రధానమైనవి అని రచయిత వివరించాడు. "వేదమునకేది పరమార్ధమో, శాస్త్రములకేది పరమార్ధమో, అదియే కావ్యమునకు పరమార్ధము. కనుకనే కవి, రసము అను తాత్విక పరిభాష సాహిత్యమున ప్రవేశించినది. ఈ దేశమునకు ఆనందము పరమార్ధము. ఇది ఆనంద భూమి" అని చెప్పాడు. అట్టి పరమార్ధముపై నిర్మింపబడిన ఈ దేశపు సంస్కృతి ఔన్నత్యాన్ని విస్మరించి పరసంస్కృతికై ప్రాకులాడడం సిద్ధాన్నాన్ని వదలుకొని భిక్షాటనం చేయడం వంటిదని చింతించాడు.

వ్యాసాలు - విషయ సంక్షిప్తం

1. వాల్మీకి వ్యాఖ్యాతలు - రామాయణమును అర్ధము చేసుకొనటకు వాచ్యార్ధము సహాయపడదు. రామాయణమునకు ప్రకాశార్ధము, రహస్యార్ధము అని రెండు వేరుగా ఉన్నాయి. గుప్తముగా ఉంచిన రహస్య చరిత్రను తెలిసికోవడానికి వివిధ గ్రంధకర్తలు ప్రయత్నించారు. సీతారాముల పరతత్వమును వాల్మీకి గుప్తముగా ఉంచి ధ్వనిరూప మాత్రంగా తెలియజేశాడు.

2. వాల్మీకిలో వింతలు - వేదోపనిషత్తులకు, రామాయణమునకు గల సంబంధము ఆశ్చర్యకరమైనది. వాల్మీకి రచనలో నిగమాగమ భాష అప్రయత్నముగా దొర్లినట్లుండును. చాలావరకు వాల్మీకి తన ఉపమానములను, భావములను,శబ్దములను శృతులనుండియే తీసికొనెను.

3. వాల్మీకి శబ్దములు - సీతాదేవియే శ్రీమహాలక్ష్మి అను ధ్వనిని వాల్మీకి తన రామాయణమునందు అనున్యూతముగ నిర్వహించెను. విద్యా ,ప్రతిపత్ కళ, ఔపయికి వంటి ఉపమానములు ఈ భావమును సూచించును.

4. నేత్రాతురః-ఒక చర్చ - "నేత్రాతుర" అనే వాల్మీకి శబ్దమునకు 'నేత్ర రోగము కలవాడు' అన్న అసంబద్ధ వివరణ గురించిన చర్చ.

5. శ్రీ సుందరకాండకా పేరెట్లు వచ్చినది? - శ్రీ సుందరకాండము వాల్మీకీయ రామాయణమునకు హృదయము. "సౌందర్యం సర్వదాయికం" అనబడిన ఈ బీజకాండములో పరాశక్తి సౌందర్యమును మంత్రరూపమున నిక్షిప్తమైయున్నది. సీతకు ఋషిచే వాడబడిన ఉపమానములన్నియు పరాశక్తి రూపమున అన్వయించును. "వేష్టమానాం పన్నేంద్ర వధూమివ" అన్న వర్ణన కుండలినీశక్తిని స్పష్టముగా సూచించును. "సమా ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధినీ" అన్న వాక్యము ఆమె మానవ కాంత కాదని తెలుపును. భాషామాత్ర పాండిత్యము ఇట్టి పరమార్ధములను తెలిసికోవడానికి అడ్డువస్తుంది.

6. శ్రీ సుందరకాండ కుండలినీ యోగమే - శ్రీమద్రామాయణమున పరమపూజనీయములైన మహారహస్యములున్నందువలననే అది పారాయణ గ్రంధమైనది. సుందరకాండలో మొదటి శ్లోకంలో ని చారిణాచరిత పథము షట్చక్రయుక్తమైన సుషుమ్నామార్గమే. సాగర లంఘనారంభము సాధనావిధానము. మైనాక, సురస, సింహికా వృత్తాంతములు గ్రంధిత్రయ భేదనములు. గిరి వర్ణనము, లంకా వర్ణనము శరీరములోని చక్రస్థానములను సూచించును. సుందరకాండలో వాల్మీకి మహర్షి నాల్గు ముఖ్యమైన రహస్యములను నిక్షేపించెను - హనుమంతుని కుండలినీ యోగము  త్రిజటా స్వప్నము అను గాయత్రీ మంత్రము (రావణుని కౌళమార్గము సంబంధిత విషయములు.

7. సుందరకాండ పేరుపై చర్చ - సుందరకాండకు, సుందరహనుమన్మంత్రమునకు ఆపాదింపబడిన సంబంధాన్ని రచయిత ఆమోదించడంలేదు.
Share:

1 comment:

  1. MARCH 2, 2024BY VADREVU CH VEERABHADRUDU
    సమాశ్వాస సౌందర్య గాథ
    వాడ్రేవు చినవీరభద్రుడు
    -

    మొన్న ఒక రోజు కూచుని మొత్తం సుందరకాండ మరోసారి చదివేను. మనశ్శాంతికోరుకునేవారు, తాము తలపెట్టిన పనుల్లో విజయం సిద్ధించాలనుకునేవాళ్ళూ, తమ మనసుని నిర్మలం చేసుకోవాలనుకునేవాళ్ళూ, తమ ఆత్మని ఒక ఔన్నత్యం వైపుగా తీసుకుపోవాలనుకునేవాళ్ళూ, సుందరకాండ పారాయణం చెయ్యడం ఈ దేశంలో తరతరాలుగా ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. 68 సర్గల ఆ కాండ దానికదే ఒక కావ్యంగా, పవిత్రగ్రంథంగా, రామాయణసారంగా పరిగణనకు నోచుకుంది. మహాభారతం నుంచి విడివడి భగవద్గీత ఎలా ఒక ఆధ్యాత్మిక, యోగవిద్యాగ్రంథంగా గుర్తింపు పొందిందో, సుందరకాండ కూడా రామాయణంతో సమానంగా గౌరవం పొందిందని నేను కొత్తగా చెప్పనక్కర్లేదు.
    కాని ఆ కాండ చదివిన ప్రతి ఒక్క పాఠకుడికీ ఒకే రకమైన అనుభూతి సిద్ధిస్తుందని చెప్పలేం. గుంటూరు శేషేంద్ర శర్మకి ఆ కాండ మొత్తం శ్రీవిద్యాసారంగా కనిపించింది. సీతమ్మవారు శ్రీవిద్యగానూ, హనుమంతుడు ఒక శ్రీవిద్యోపాసకుడిగానూ ఆయనకు కనబడ్డారు. తనకి కలిగిన దర్శనాన్ని ఆయన ‘షోడశి,రామాయణ రహస్యాలు’ అనే పుస్తకంగా రాసారు కూడా. ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ విశ్వనాథ సత్యనారాయణ సుందరకాండను శేషేంద్ర చదివినపద్ధతి చూసి నిలువెల్లా చకితుడైపోయాడు కూడా. షోడశిలో గొప్ప విషయమేమిటంటే, శేషేంద్ర తన దర్శనం మొత్తాన్ని వాల్మీకి శ్లోకాల ఆధారంగానే వివరించడం. ఎక్కడా ఒక్క మాట, ఒక్క భావన శేషేంద్ర అదనంగా చెప్తున్నట్టు ఉండదు. చూడబోతే షోడశి చదివాకనే వాల్మీకి సుందరకాండ రాసాడా అనిపిస్తుంది మనకి!
    --------
    సహస్రాబ్ది దార్శనిక కవి
    కవిర్విశ్వో మహాతేజా
    గుంటూరు శేషేంద్ర శర్మ
    Seshendra: Visionary Poet of the Millennium
    http://seshendrasharma.weebly.com/

    జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా

    మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు

    తండ్రి సుబ్రహ్మణ్య శర్మ

    తల్లి అమ్మాయమ్మ
    భార్య / జానకి
    పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
    సౌందర్యమే ఆయనకు అలంకారం,సౌందర్యమే ఆయనకు జీవితం
    విమర్శకుడు : కవి
    ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ……….
    – ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
    (21 ఆగస్టు, 2000)
    * * *
    పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
    భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
    కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
    గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
    నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
    కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
    ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
    సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
    వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
    ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
    వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
    బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
    ఒకానొకశైలీనిర్మాత.

    – యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
    అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
    Visionary Poet of the Millennium
    http://seshendrasharma.weebly.com

    ReplyDelete

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List