* ధనుర్మాసం గోదాదేవి భుజంపై దర్శనమిచ్చే రామచిలుక..!
* సదా గోదా, వటపత్ర సాయి నామస్మరణంతో మారుమ్రోగుతున్న మహిమాన్విత దివ్య క్షేత్రం...
.
ఆధ్యాత్మిక ప్రపంచంలో అతిపవిత్రమైన, విశిష్టమైన స్థానాన్ని పొందిన 'తిరుప్పావై' కావ్యాన్ని భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి విరచించి గానం చేసింది. పాండ్యదేశంలో, శ్రీ విల్లిపుత్తూరు అనే పల్లెలో, కర్కాటక రాశిలో, పూర్వఫల్గుణీ(పుబ్బ)నక్షత్రంలో కలియుగం ప్రారంభం ఐన తొంభైమూడవ సంవత్సరంలో, నరనామ సంవత్సరంలో, తులసీవనంలో ఉద్భవించిన గోదాదేవి విష్ణుచిత్తులవారికి దొరికింది. విష్ణు చిత్తులు నేటి తమిళనాడులోనిది, ఆనాటి పాండ్య ప్రభువుల ఏలుబడిలోనిది ఐన శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో జన్మించారు. ఈ గ్రామానికే ధన్వినవ్యపురం అనే పేరుకూడా ఉంది, వైష్ణవసంప్రదాయంలో. ఆ గ్రామంలో వటపత్రశాయి ఐన మహావిష్ణువు దేవాలయం ఉంది. ఆ స్వామిని వైష్ణవ సంప్రదాయంలో వడపెరుంగోయిలాన్ అని పిలుస్తారు.
.
భగవంతుడు ఎప్పుడూ భక్తుల పాలిట పక్షపాతే… వజ్ర వైడూర్యాలు, సిరిసంపదలు, హంగూ ఆర్భాటాలు ఇవేమీ భగవంతునికి అక్కర్లేదు… ఆ జగత్ పాలకుడికి కావల్సింది నిశ్చలమైన భక్తి… పరిపూర్ణమైన విశ్వాసం… అవుంటే శ్రీవైకుంఠంనుంచి కూడా తరలి వచ్చి అనుగ్రహిస్తాడు. అక్కున చేర్చుకుని సేద తీరుస్తాడు. అలా తన నిశ్చలమైన భక్తితో సాక్షాత్తు శ్రీరంగనాధుడ్నే మెప్పించిన మహాభక్తురాలు గోదాదేవి. ఆండాళ్‌గా పూజలందుకుంటున్న ఆ తల్లి ఆవిర్భవించిన పుణ్యధామమే ‘శ్రీవిల్లిపుత్తూరు’. తమిళనాడు రాష్ట్రం మధురై నగరానికి 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రం గోదాదేవి పాద స్పర్శతో, ఆమె శ్రీహరి భక్తితో పునీతమైంది.
.
శ్రీవిల్లిపుత్తూరులో ప్రసిద్ధమైన ఆలయాలలో గోదాదేవి ఆలయం ఒకటి. మహిమాన్విత ఈ దివ్యాలయ ప్రాంగణం సదా గోదా, వటపత్ర సాయి నామస్మరణంతో మారుమ్రోగుతుంది. అణువణువూ ఆధ్యాత్మికానురక్తిని పెంచే గోదాదేవి ఆలయం సొంతం… అపురూప ఈ దివ్యాలయాన్ని 7వ శతాబ్దంలో వల్లభదేవ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరంతర కాలంలో ఈ ఆలయాన్ని తిరుమల నాయకర్, చొక్కప్పనాయకర్ అనే రాజులు అభివృద్ధి చేశారు. కాలాంతరంలో ఈ ఆలయంలో అనేక మార్పులు చేర్పులూ జరిగినప్పటికీ, పురాతనత్వాన్ని చెక్కుచెదరకుండా మిగుల్చుకున్న ఆలయమిది. నిత్యం వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయ ప్రాంగణం గోదాదేవి భక్తికి ప్రభల నిదర్శనంగా దర్శనమిస్తుంది.
.
పురాణగాథ :...
పూర్వం విష్ణుచిత్తుడనే పండితుడు శ్రీహరి భక్తుడు. అతడు రోజూ శ్రీహరినే సేవిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఓసారి విష్ణుచిత్తుడు తులసీవనంలో ఉండగా, ఓ ఆడ శిశువు దొరికింది. అది శ్రీమన్నారాయణుడి కటాక్షంగా ఆ శిశువును చేరదీసి గోదాదేవి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచాడు. ఆ శిశువు పెరిగి పెద్దదవుతూ శ్రీరంగనాధుడ్ని అమితంగా సేవించేది. శ్రీరంగనాధుడే తన ప్రత్యక్ష దైవమని, ఎప్పటికైనా ఆ స్వామిని చేరాలని ఆకాంక్షించేది. రోజూ పుష్పహారాలను చేసి ముందుగా తన మెడలో ధరించి,ఆ తర్వాత స్వామివారి కైంకర్యానికి పంపించేది. స్వామిని ఎప్పటికైనా వివాహమాడాలని తలచేది. ఎప్పుడూ స్వామి సేవలో తరిస్తూ గడిపేది. ఆమె వయస్సు పెరుగుత్నుకొద్దీ స్వామిపై భక్తి విశ్వాసాలను పెరాగాయ. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ఆచరించేది. భక్తిని మాలగా అల్లి సువాసన భరిత పుష్పాలతో ఆ భగవానుడ్ని సేవించి ముక్తి పొందవచ్చని తలచి తిరుప్పావై ప్రబంధాన్ని రచించి ఆండాళ్‌గా ప్రసిద్ధిచెందింది. ఇందులో 30 పాశురాలున్నాయి. ఆ పాశురాలను భక్తితో గానామృతం చేసి, తన భక్తిప్రపత్తులను చాటుకుని, స్వామిని వివాహమాడి చివరికి శ్రీరంగనాధునిలోనే ఐక్యమైంది. గోదాదేవి ఆవిర్భవించిన స్థలంగా చెప్పబడ్తున్న ఈ ప్రాంగణంలో నిర్మించిన దివ్యాలయమే శ్రీవిల్లిపుత్తూరు శ్రీ గోదాదేవి ఆలయం.
.
మహిమాన్వితమైన ఈ దివ్యాలయ ప్రాంగణంలో గోదాదేవి దొరికిన తులసీవనం ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ తులసీవనంలోనే అమ్మవారికి గుర్తుగా ఓ చిన్న మందిరాన్ని నిర్మించి పూజిస్తున్నారు. గోదాదేవి అమ్మవారి ప్రధానాలయ ప్రాంగణం విశాలమైనది. ఈ ప్రాంగణం లోపలి ప్రాకారంలో ఎడమవైపు లక్ష్మీనారాయణ పెరుమాళ్ మందిరం ఉంది. దీనికి సమీపంలో ఆండాళ్ పూజా మంటపం ఉంది. ప్రధానాలయ లోపల ప్రాకారం కేరళ సంప్రదాయ రీతిలో ఉంది. అమ్మవారి ఆలయానికి ముందు మణిగన్, సుముఖన్, సేనై ఇముదల్వర్‌ల చిన్ని చిన్ని మందిరాలున్నాయి. గర్భాలయం వెలుపల తులసివనంలో బావి ఉంది. అమ్మవారు రోజూ ఈ బావిలోనే తన ముఖారవిందాన్ని చూచుకొనేదంటారు. ఇదే ప్రాంగణంలో ఊంజల్ మంటపం ఉంది. అత్యంత నయన శోభితంగా ఉన్న ఈ ప్రాంగణం చూపరులను అమితంగా ఆకర్షిస్తుంది. గర్భాలయంలో రంగమన్నార్ దర్శనమిస్తారు. స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు.
.
ఆలయ బయట ప్రాకారంలో గజలక్ష్మి, ఆంజనేయ మందిరాలున్నాయి. ఈ ప్రాకారంలోని అద్భుత శిల్పాలు భక్తులకు దర్శనమిస్తాయి. అఘోర వీరభద్ర, సరస్వతి, శ్రీరాముడు, లక్ష్మణుడు, వేణుగోపాలస్వామి, విశ్వకర్మ, రంభ, ఊర్వశి, జలంధర్, మోహినీ అవతారం, మన్మధుడు, రతి, ఊర్థ్వవీరభద్ర తదితర అద్భుత శిల్పరాజాలు చూపరుల దృష్టిని మరలనీయవు. అలనాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా ఇవి దర్శనమిస్తాయి. అమ్మవారి గర్భాలయం బయట ప్రాకారంలో తిరుప్పావై పాశురాలకు చెందిన మనోహరమైన చిత్రాలున్నాయి. ఇవన్నీ భక్తులలో భక్త్భివాన్ని ప్రోదిచేస్తాయి. శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి అమ్మవారిని దర్శించుకునే కన్యలకు వివాహయోగం తప్పక కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే భక్తులకు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి సాక్షాత్కారం కలుగుతుంది. ఇక్కడ అమ్మవారిని, స్వామివార్లను తులసి దళాలతో, పుష్పహారాలతోనూ సేవిస్తే ఐశ్వర్యవృద్ధి కలిగి, కోర్కెలు సిద్ధిస్తాయంటారు. అలాగే వివాహం కాని కన్యలు ఇక్కడ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే, వెంటనే వివాహం జరిగి, సౌభాగ్యసిద్ధి కలుగుతుందంటారు. మహిమాన్విత ఈ దివ్యాలయంలో ధనుర్మాసం చివరిరోజున గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తారు. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న శ్రీవిల్లిపుత్తూరులో యాత్రికులకు బసచేయడానికి అనేక హోటళ్ళున్నాయి. భోజనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మహిమాన్విత ఈ క్షేత్రంలో ఒక రోజు నిద్ర చేస్తే పుణ్య ఫలాలు సిద్ధిస్తాయంటారు.
.
ప్రేమ, అనురాగం, ఆసక్తి, అభిలాష, ఆకాంక్ష... ఇలా ఎన్నో విషయాలు బంధానికి కారణాలవుతున్నాయి. ఆకాశంలో ఎన్నో పక్షులు విహరిస్తుంటాయి. చెట్లమీద వాలి సేదదీరుతుంటాయి. కానీ, రామచిలుకలను చూడగానే మనిషికి దాన్ని పట్టుకోవాలనీ, ఆ తరవాత వాటిని పంజరంలో బంధించి, ఇంట్లో పెట్టుకోవాలనీ అనిపిస్తుంది. దీనికి కారణం రామచిలుక పలుకులు మధురంగా ఉండి, ఆకర్షించడమే. ఈ గుణం కారణంగానే రామచిలుకలు పంజరాల్లో బంధీలవుతున్నాయి.
.
విల్లిపుత్తూరులోని అమ్మవారి ఆలయాన్ని దర్శించినట్టయితే ఈ రామచిలుక తయారీ విషయంలో వాళ్లు ఎంతటి శ్రద్ధ తీసుకుంటున్నది తెలుస్తుంది. సగ్గుబియ్యం ఆకులతో చిలుకను తయారుచేసి దానిమ్మ మొగ్గను దాని ముక్కుగా అమర్చుతారు. నిజంగా రామచిలుకే అమ్మవారి భుజంపై వాలిందా ? అన్నంత సహజంగా అది కనిపిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం ఇలా చిలుకను తయారు చేసి అమ్మవారి ఉత్సవమూర్తి భుజంపై అలంకరిస్తూ ఉంటారు. ఇలా కొలువుదీరిన అమ్మవారిని పూజించడం వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పని సరిగా నెరవేరతాయని చెప్పబడుతోంది.
https://www.facebook.com/rb.venkatareddy
No comments:
Post a Comment