శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ధనుర్మాసం. ~ దైవదర్శనం

శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ధనుర్మాసం.

ధనుర్మాసంలొ గోమాత పూజించడం...సర్వ దేవతలందరిని పూజించిన ఫలితం...
.
ధనుస్సంక్రమణం మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది. ఆభగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈభూమిపైనే. భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. ఈమాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్ఫై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈపాశురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు.
.
మార్గశీర్ష మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భువిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశీర్షం బ్రహ్మీముహూర్తంగా పేర్కొంటారు. అంటే సూర్యోదయానికి ముందు తొంభైఆరు నిమిషాలు. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదమని అర్థం. ధనుస్సునుంచి వచ్చే టంకారమే ఓంకారనాదానికి మూలం. ఈనాదాన్ని గానంగా చేసుకొని సంకీర్తనం చేయడంవల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. నిజానికి ధనుర్మాస వ్రతఫలం ఇదే.
.
ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజు.తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆయోగనిద్రనుండి మేల్కొని శుద్ధ త్రయోదశినాడు సకల దేవతాయుతుడై బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినాడు ఉత్తరద్వారము నుండి మనకు దర్శనభాగ్యమును కలిగిస్తాడు. ఆదివ్య దర్శనభాగ్యం వలన క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరుతాయి.దీనినే రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలమునకు సంకేతంగా చెప్తారు.
.
ఈ ధనుర్మాసం లో ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఇంటిబయట ముంగిళ్ళలో గోమయంతో కళ్ళాపి జల్లాలి. దీనివలన అనారోగ్య కారకాలైన క్రిములు నశిస్తాయి. ఇలా పవిత్రములైన ఈప్రదేశములందు లక్ష్మీ నివాస స్థానములైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆరంగవల్లులందు లక్ష్మీస్వరూపాలైన గొబ్బెమ్మలనుంచి వానిని పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. భగవదారాధనను ఎన్నడు మరువరాదనే విషయాన్ని గుర్తుచేసేలా హరిదాసులు నామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించినా భగవదారాధనే అవుతుంది. లక్ష్మీ స్వరూపాలైన గోవుల గిట్టలందు, ధర్మ స్వరూపాలైన వృషభాల గిట్టలందు లక్ష్మి ఉంటుందని చెప్తారు. అందువల్ల వృషభాన్ని అలంకరించి వాని అనుమతితో పనిలేకుండగనే ఇళ్ళముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింప చేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే.
.
అంతేకాక వృషభాల గిట్టల స్పర్శ వలన ఆప్రదేశం కూడా పవిత్రమవుతున్నది. శంఖం భగవస్వరూపం. కనుక అందుండి వచ్చే ధ్వని పవిత్రమవుతున్నది. ఈపవిత్ర శబ్దమును ఈ ధనుర్మాసమంతా వినిపించే జంగమ దేవరలు గౌరవింపదగినవారు. ధాన్య సమృద్ధి కలుగునదీ ఈమాసమునందే. లక్ష్మీ స్వరూపాలైన గోవులని ఈమాసంలో పూజించడం ఆచారంగా వస్తున్నది. ముఖ్యంగా ఉత్తరద్వార దర్శన సమయంలో అనగా ముక్కోటి నాడు గోపూజ అత్యంత ప్రధానమైనది. కోరిక కోరికలను తీర్చేది గోపూజ. ఈకాలంలో విష్ణుపూజ, దాన జపాదులు విశేషఫలప్రదం. గోదాదేవి ’మార్గశి’ వ్రతం ప్రారంభించి శ్రీరంగనాథుని అర్చించిన వేళ ఇది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List