ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహానగరాలకు వందరెట్లు గొప్పదైన మహానగరం ద్వారక. నాలుగువేల సంవత్సరాల క్రితం జగన్నాథుడి అద్భుత సృష్టి. శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైనది ద్వారక. గుజరాత్‌లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైంది. జరాసందుని బారి నుండి తప్పిన్చుకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతన మైంది. ఈ మందిరాన్ని పదో శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే శ్రీకృష్ణుని మనుమడు ఐన వజ్రనాధుడు ఈ మందిరాన్ని మొట్టమొదటిసారిగా నిర్మించినట్ట్లు పురాణాలలో ప్రస్థావన వుంది. శ్రీకృష్ణుని ద్వారకా నగరం సముద్రగర్బంలో ఇంకా వుందని పరిశోధకుల అభిప్రాయం.
ద్వారకానాధుడికి అనేక సేవలు దర్శనాలు ఉంటాయి. దర్శనలకు తగినట్లు వస్తధ్రారణలో మార్పులు జరుగుతుంటాయి. ఈ దర్శనాలు వల్లభాచార్యుల చేత వ్రాయబడిన పుష్టి మార్గాంలో వ్రాయబడినట్లు జరుగుతాయి. ద్వారకా నాధుని ఆలయం పుష్టి మార్గ ఆలయం. దర్శనాలు వరుసగా... మంగళ, శృంగార్, గ్వాల్, రాజభోగ్, ఉథాపన్, భోగ్, సంధ్యా ఆరావళి, ష్యాన్.
మహాభారతం, హరివంశం, స్కంద పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణాల్లో ద్వారకాపురి ప్రస్థావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీకృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసి సముద్రగర్భంలో కలసిపోయి కనిపించకుండా పోయిందని విశ్వసిస్తున్నారు.
శ్రీకృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్ధాల నుండి ద్వారకా వాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. శ్రీకృష్ణుడు కంసవధ అనంతరం కంసుడి తండ్రి అయిన ఉగ్రసేనుడిని చెరసాల నుండి విముక్తుడిని చేసి మథురకు రాజును చేసాడు. కంస వధకు కినుక చెందిన అతడి మామగారైన జరాసంధుడు తన స్నేహితుడైన కాలయవనుడితో కలసి 17 మార్లు మథుర మీద దండయాత్ర చేసాడు. యుద్ధాల నుండి ప్రజలను రక్షించే నిమిత్తం శ్రీకృష్ణుడు యాదవ ప్రముఖులతో సమాలోచనలు జరిపి సముద్రపరివేష్టితమైన భూమిలో ద్వారకానగరిని నిర్మించి దానికి మథురలోని యాదవులను తరలించాడు.
మార్లు జరిగిన దండయాత్రలలో అతడు తన సైన్యాలంతటిని క్షీణింపజేసుకున్నాడు. ఒక్కో మారు జరాసంధుడు 18 అక్షౌహినుల సైన్యంతో దాడి చేసే వాడు. మహారత యుద్ధంలో పాండవుల మరియు కౌరవుల సైన్యం మొత్తము 18 అక్షౌహినులు. శ్రీకృష్ణుడు 18వ దండయాత్రకు ముందుగా మథురను వదిలి వెళ్ళాడు. జరాసంధుడు 800 నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా. భీష్ముడు కూడా 800 నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా.
శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. ఈ నగరం మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం సముద్రగర్భంలో కలిసిపోయింది. యాదవ ప్రముఖులు గాంధారి శాపప్రభావాన మునుల శాపప్రభావాన తమలోతాము కలహించికొని నిశ్శేషంగా మరణించిన తరువాత శ్రీకృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవకుల సంరక్షణార్ధం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించిన మరు నిమిషం ద్వారకానగరం సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరాన్ని దాటిన యాదవులు ద్వారకానగరం సముద్రజలాల్లో మునిగిపోవడం వెనుతిరిగి చూసి హాహాకారాలు చేసారు.
అర్జునుడు ఈ విషయం హస్థినాపురంలో వర్ణిస్తూ ప్రకృతి ద్వారకానగరాన్ని తనలో ఇముడ్చుకుంది. సముద్రం నగరంలో ప్రవేశించి ద్వారకానగర సుందరమైన వీధులలో ప్రవహించి మెల్లగా నగరాన్ని సంపూర్ణంగా తనజలాల్లో ముంచివేసింది. అందమైన భవనాలు ఒకటి తరువాత ఒకటి మునగడం నేను కళ్ళారా చూసాను. అంతా మునిగి పోయింది. అక్కడ నగరం ఉన్న సూచనలు ఏమీ లేవు చివరకు ఒకసరస్సులా ఆ ప్రదేశం కనిపించింది. అక్కడ నగరం ఉన్న జాడలు లేవు. ఇక ద్వారక ఒక పేరు మాత్రమే ఒక జ్ఞాపకం మాత్రమే. విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్థావించింది. ఇలా ద్వారకానగరం సముద్రగర్భంలో కలసిపోయి అంతటితో ద్వాపరయుగం అంతమై కలిపురుషుడు ఈ లోకంలో ప్రవేశించి కలియగానికి నాంది పలికాడు.
బెట్ ద్వారక ప్రధాన దైవమైన శ్రీకృష్ణుని ఆలయలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బెట్ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రిస్టియన్ శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపారం, వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మరియు మతప్రధానమైన కేంద్రం శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసిపోయిందని విశ్వసించబడుతుంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలుపలికి తీసుకురాబడ్డాయి. అత్యంత పుష్కలంగా పురాతన వస్తువులు లభించిన సాంస్కృతిక ప్రదేశాలు బెట్ ద్వారకా 1, 2, 6, 9. బెట్ ద్వారకలో లభించిన వస్తువులను రెండు బృహత్తర కాలాలకు సంబంధించినవిగా విభజించించారు. వీటిలో మూడు తలల కల జంతువుతో అలంకరించబడిన శంఖం ఒకటి, మూడు వ్రాతఫలకాలు, ఒక రాగి చేపలగాలం మరియు హరప్పన్ సాంస్కృతిక (క్రీ పూ 1700-1400) ల చివరికాలపు మృణ్మయ పాత్రలు మరియు చారిత్రక సమయాన్ని సూచించే నాణ్యాలు మరియు కుండలు. ఈ సముద్రతీర సముద్రగర్భ పరిశోధనలు బెట్ ద్వారకాద్వీపం దాని చుట్టుపక్కల ప్రదేశాలు సముద్రతీవ్రత మూలంగా భూఊచకోతకు గురైన విషయాన్ని బలపరుస్తుంది. సముద్రపు పొంగు వలన మునిగిపోయిన ప్రదేశాలలో బెట్ ద్వారక ఒకటి.
భారతదేశంలో ఉన్న ఏడు పవిత్రక్షే త్రాలలో ద్వారకాపురి ఒకటి. అయితే వీటిలో శివుడు ప్రతిష్టితమై ఉన్న వారణాశి అత్యంత పవిత్రమైనది.
అయోధ్య మథుర మాయ కాశి కాంచి అవంతిక పూరి ద్వారకావతి చైవ సపై ్తత మోక్షదాయిక - గరుడ పూర్ణిమ క్షేత్రం అంటే పవిత్రమైన ప్రదేశం. దైవీక శక్తికి కేంద్రం. జీవుడికి తుది గమ్యమైన మోక్షాన్ని అందించే మోక్షపురి. గరుడ పురాణం పేర్కొన్న ఏడు మోక్షపురాలు వరుసగా అయోధ్య, మథుర, మాయా, కాశి, కాంచి, అవంతిక, పూరి మరియు ద్వారావతి.
ప్రస్తుత ద్వారకాధీశుని ఆలయం సాధారణ శకం (కామన్ ఎరా లేక కేలండర్ ఇయర్) 16వ శతాబ్ధంలో నిర్మించబడింది. అసలైన ఆలయం శ్రీకృష్ణుడి మునిమనుమడైన రాజైన వజ్రుని చేత నిర్మించబడినదని విశ్వసిస్తున్నారు. 5 అంతస్తుల ఈ ఆలయం లైమ్‌స్టోన్ మరియు ఇసుకతో నిర్మితమైనది. ఈ ఆలయగోపురం మీద ఉన్న జెండా ఒక రోజుకు అయిదుమార్లు ఎగురవేస్తారు. ఈ ఆలయానికి రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటి స్వర్గ ద్వారం రెండవది మోక్షద్వారం. భక్తులు స్వర్గద్వారం గుండా ఆలయప్రవేశం చేసి మోక్షద్వారం గుండా వెలుపలికి వస్తారు. ఈ ఆలయము నుండి గోమతీ నది సముద్రంలో సంగమించే ప్రదేశాన్ని చూడవచ్చు. ద్వారకాపురిలో ఇంకా వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి మరియు సత్యభామాదేవి ఆలయాలు ఉన్నాయి. బెట్ ద్వారకా ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.
ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్టించాడు. ఇక్కడ కృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు. 108 దివ్యదేశాలలో ఈక్షేత్రం ఒకటి.
ఈ నగరం పేరులోని ద్వార్ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం లాంటి అర్ధాలు ఉన్నాయి. ద్వార్ అనే పదము ఆధారంగా ఈ నగరానికి ఆఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. ఈ నగరం వైష్ణవుల చేత గౌరవించబడింది. ద్వారకా ధీశుని ఆలయం జగత్‌మందిరం అని పిలువబడుతుంది. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠం స్థాపించబడింది. ఈ మఠం శ్రీకృష్ణభగవానుడికి సమర్పించబడింది. ఆది శంకరాచార్యుడితో ప్రతిష్ఠించబడిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి మరియు జ్యోతిర్మఠం. ద్వారకా పీఠంను కాళికా పీఠంగా కూడా అంటారు.
ద్వరకానగరం శ్రీకృష్ణుడి అజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్ర పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్ధం ఎంచుకొనబడింది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడినది. గోమతీనదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరాన్ని ద్వారామతి, ద్వారావతి మరియు కుశస్థలిగా పిలువబడింది. ఇది ఆరు విభాగాలుగా నిర్వహణా సౌలభ్యం కొరకు విభజించి నిర్మించబడింది. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడలె్పైన రాజమార్గాలు, వాణిజ్యకూడలులు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే. ఈ నగరం సుందర సముద్రతీరాలకు ప్రసిద్ధం. ఈ నగరంలో 7,00,000 ప్రదేశాలు స్వర్ణ, రజిత మరియు మణిమయమై నిర్మించబడ్డాయి. శ్రీకృష్ణుడి 16108 మంది భార్యలకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ నగరంలో సుందర సరస్సులతో సర్వకాలంలో పుష్పించి ఉండే వివిధమైన వర్ణాలతో శోభిల్లే ఉద్యానవనాలు ఉంటాయి.
No comments:
Post a Comment