ఒకప్పుడు ‘మంచాల’ గ్రామంగా ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ రాఘవేంద్రస్వామివారు బృందావన ప్రవేశం చేశారు. ఆ ప్రదేశమే మంత్రాలయం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్న ఈ మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారి లీలా విశేషాలతో పునీతమైంది. శ్రీ రాఘవేంద్రస్వామి జన్మవృత్తాంతానికి సంబంధించి ఓ పురాణగాథ ఒకటి ఉంది. శంఖు కర్ణుడనే పరిచారకుడు తర్వాత జన్మలో ప్రహ్లాదుడిగా జన్మించాడు.
తర్వాత జన్మలో వ్యాసరాయలుగా జన్మించి సన్యాశాస్రమాన్ని స్వీకరించి తన 93వ ఏట ‘హంపి’ క్షేత్రంలో సమాధి పొందాడు.
తర్వాత జన్మలో వ్యాసరాయలుగా జన్మించి సన్యాశాస్రమాన్ని స్వీకరించి తన 93వ ఏట ‘హంపి’ క్షేత్రంలో సమాధి పొందాడు.
శంఖుకర్ణుడు మూడవ జన్మగా కాంచీపురం సమీపంలోగల భువనగిరి గ్రామంలో నివసిస్తున్న బ్రాహ్మణ దంపతులైన తిమ్మనభట్టు, గోపమ్మ దంపతులకు మూడవ సంతానంగా 1595లో మన్మధ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమినాడు జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి వేంకటనాధుడని నామకరణం చేశారు. అతనే మన రాఘవేంద్రస్వామి. వెంకటనాధుడు చిన్నతనంలోనే శబ్దమంజరి వల్లించాడు. అష్టాదశ పురాణాలలోని విశేషార్చనలను అధ్యయనం చేశాడు. అనంతరం ధర్మప్రబోధానికి నడుంకట్టి తంజావూరులో తన గురువు సుదీంద్ర తీర్థులవద్ద 1623లో వేంకటనాధుడు సన్యాసం స్వీకరించాడు. గురువు ఆయనకు ‘వ్రణమంత్రం’ బోధించాడు. మూల రాములవారు స్వప్నంలో ఆదేశించిన విధంగా ‘శ్రీ రాఘవేంద్ర తీర్థ’ అని గురువు ఆయనకు నామకరణం చేశారు.
సన్యాసం స్వీకరించిన శ్రీ రాఘవేంద్రస్వామి లోక కళ్యాణానికి కృషిచేసి 1671 ఆగస్టులో ప్రహ్లాదుడు యజ్ఞం చేసిన తుంగభద్ర నదీ తీరంలో బృందావన ప్రవేశం చేశారు. ఒకప్పుడు ‘మంచాల’ గ్రామదేవతగా మంచాలమ్మవారు ఉండేవారు.
పూర్వం జమదగ్నిమహర్షి భార్య రేణుకాదేవి, మంచాల గ్రామంలో మంచాలమ్మగా వెలిశారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. గురువుకు సిసలైన నిర్వచనంగా నిలిచిన శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయం సదా భక్తజన సందోహంతో దివ్యమైన లోకాన్ని తలపిస్తుంది. శ్రీరాఘవేంద్రస్వామి వారి బృందావనమే ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది. ప్రాపంచిక విషయాలను సైతం పటాపంచలు చేసే ఈ బృందావన దర్శనంవల్ల సర్వదా శుభం జరుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
శ్రీ రాఘవేంద్రస్వామికి ఎదురుగా ఓ ఆలయంలో ఆంజనేయస్వామివారు కొలువయ్యారు. శ్రీరామభక్తుడైన ఆ స్వామి ఇక్కడ కొలువై ఉండడంవల్ల శ్రీరాఘవేంద్రస్వామివారి బృందావన క్షేత్రం మరింత మహిమాన్వితమైంది. శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంగా, విరాజిల్లుతున్న మఠానికి ముందు కుడివైపుభాగంలో మంచాలమ్మవారు ఆశీనులయ్యారు. లోపల ఆలయంలో పూర్వ మఠాధిపతుల సమాధులు (బృందావనాలు) కనిపిస్తాయి. మరోపక్క నాగేంద్రస్వామి, ముడుపుల చెట్టు దర్శనమిచ్చి పునీతుల్ని చేస్తుంది.
No comments:
Post a Comment