నల్లమల కీకారణ్యంలో ఎటుచూసినా పాలుగారే వృక్షాలతో దట్టమైన అడవి, మైమరపించే ప్రకృతి రమణీయత, అటుగా వెళ్తూ ఈ అందచందాలను చూసి పరవశించి, నల్లమల అందాలను ఆస్వాదించి, జీవాలతో పూజలందుకునేందుకు, పరమశివుడు వీరభద్రుడిగా వెలసిన క్షేత్రమే "పాలంక". ఇది యర్రగొండపాలెం మండలంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో వీరభద్రుడు, భద్రకాళి కొలువుదీరి ఉన్నారు. తొలిఏకాదశి సందర్భంగా, భక్తులు ఇక్కడ స్వామివారినీ, అమ్మవారినీ దర్శించుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ జలపాతం, ప్రకృతి ప్రేమికులకు స్వర్గతుల్యంగా గోచరించుచున్నది. దీనిని సందర్శించేటందుకు ప్రతి సంవత్సరం, అధికసంఖ్యలో తరలివచ్చుచున్నారు. ఈ పాలంక జలపాతం 200 మీటర్ల ఎత్తులో, నల్లమలలోనే పెద్దదిగా గుర్తింపుపొందినది. ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ(తొలి)ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరునాళ్ళు నిర్వహించెదరు. కృష్ణానది ప్రక్కన, శ్రీశైలానికి ఉత్తర భాగాన, పెద్ద కొండచరియ క్రింద పాలంకస్వామి వెలసినారు. ఈ క్షేత్రంలో సహజంగా ఏర్పడిన ఆదిశేషుని ఆకారం వంటి కొండచరియ క్రింద పాలంకేశ్వరుడితో పాటు గణపతి, పంచముఖబ్రహ్మ, పోతురాజుల ఆలయాలు, పది అడుగుల ఎత్తయిన నాగమయ్య పుట్ట ఉన్నవి.
భక్తులు అధికంగా ఈ క్షేత్రానికి, సంతానప్రాప్తికోసం దర్శించుకుంటారు. ఇక్కడి కొండ చరియలపై నుండి పంచలింగాలపై జాలువారే నీటిబిందువుల కోసం, సంతానం లేనివారు దోసిఉళ్ళు పడతారు. దోసెళ్ళలో నీటిబిందువులు పడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇలా సంతానం, కలిగినవారి పిల్లలకు పాలంకయ్య, వీరయ్య అనే పేర్లు పెట్టుకుంటారు. భక్తులు ఇక్కడి పవిత్ర నీటిగుండంలో స్నానమాచరించి దేవేరులకు పూజలు చేస్తారు. మహిళలు పొంగళ్ళతో నైవేద్యం సమర్పించుకుంటారు. పాలంక ఉత్సవాలకు గుంటూరు, మహబూబ్ నగర్, ప్రకాశం కర్నూలు జిల్లాల నుండియేగాక, విజయవాడ, హైదరాబాదు తదితర పట్టణాలనుండి గూడా భక్తులు తరలి వచ్చెదరు.
No comments:
Post a Comment