శబ్దబ్రహ్మము. ~ దైవదర్శనం

శబ్దబ్రహ్మము.

శ్రోత్రాదీంద్రియములచే మనం గ్రహించే శబ్దము, కాంతి, రసము అనేవిగాని, మనస్సుచే పొందే ఆనందముగాని, పరిశీలించి, పృథక్కరించి చూచినమీదట ఇవి యన్నీ పరబ్రహ్మముయొక్క అభివ్యక్తులే అని తేలుతుంది.

వ్యాకరణ శాస్త్రము శబ్దమును బ్రహ్మమంటుంది. దీనినే శబ్ద బ్రహ్మవాదమంటారు. సూత్రకర్తయైన పాణిని, మహాభాష్యకర్తయైన పతంజలి, ఇతర వార్తికకారులు సంస్కృత వ్యాకరణానికి శాస్త్రత్వాన్ని, తత్వశాస్త్రత్వాన్ని సంపాదించిపెట్టిరి. ''మహాభాష్యం వా అధ్యేతవ్యమ్ మహారాజ్యం వా శాసనీయమ్'' ఏలితే మహారాజ్యమే ఏలాలి. లేకుంటే మహాభాష్యమే చదవాలంటారు ఐరోపాపండితులు. ఈ వ్యాకరణశాస్త్ర నిధినుంచే ఫైలాలజీ అనే నిరుక్తమును త్రవ్వి ఎత్తిరి. సంగీతశాస్త్రమే శబ్దబ్రహ్మమునే నాద బ్రహ్మముగా ఉపాసిస్తుంది.

నాదమనేదివట్టిశబ్దముకాదు, గాయకుడు రాగాలాపన చేస్తూ తారస్థాయిలో మూర్ఛనలుపోతూవుంటే, గాయకుడిని సహృదయులను గూడా పరమానందంలో లీనమయ్యే స్థితిని కల్పించే దేదివుందో అదేనాదం. ఇక వేదాంత శాస్త్రంలోకి వెళ్ళితే, ఉపనిషత్తులు-ఓంకారమున, రసమును, జ్యోతిస్సును ఆనందమును - వీని నన్నిటిని బ్రహ్మమే అని చెపుతున్నవి. మహోన్నతం, మహోదారం, మహోత్కృష్టం అయినవన్నీ బ్రహ్మమేనని, మహత్తులన్నిటియందు ఈశ్వరసాన్నిథ్యం లభిస్తుందనీ తాత్పర్యంగా మనం గ్రహించవలసివుంటుంది.

పురాతన కాలమందు వేదసంస్కృతి లోకమంతటా వ్యాపించివుండేది. కాలక్రమాన ఆ సంస్కృతి అనేక కారణములచే ఇతర దేశములందు భిన్నదర్శనాలకు విచారధారలకు చోటిచ్చి, తాను మరుగున పడిపోయింది. ఆ వైదిక సాంప్రదాయం అదృష్టవశాన భారతభూమిలో మాత్రం సురక్షిత మవుతూ వచ్చింది కాని. ఇచట గూడనానాటికి తీసికట్టుగా వుంటున్నది.

సత్యదర్శనంకోసం జ్ఞానసముపార్జనకోసం విద్యాభ్యాసం జరిగినన్నాళ్ళు వేదాలను శాస్త్రాలను అధ్యయనం చేసే వారిసంఖ్య ఎక్కువగానే వుండేది. అటువంటివిద్య పొట్టకోసం ఉద్యోగంకోసం అయిపోయింది. నేటి భౌతిక శాస్త్రవిజ్ఞానం అందుకు తోడయినది. ఈ చదువులు ఉద్యోగాల కర్హతను సంపాదించి పెడుతున్నవి. అంతటితో కేవల జ్ఞానార్జనకేవిద్య నభ్యసించేవారు నానాటికి తక్కువయిపోతున్నారు. కాని సత్యప్రాప్తిని కల్గించే విద్యకు పాతబడడం, పనికిరాపోవడం అనేది వుండదు. వేదవిజ్ఞానం పూర్వమందు ఇతర దేశములందు వ్యాప్తమైనదనడానికి  సాక్ష్యమిస్తున్నది. ''ఆదియందు శబ్దముండెను.

ఆశబ్దంఈశ్వరనందుండెను. శబ్దమే ఉశ్వరు''డని ఆ గ్రంథం చెపుతున్నది. యూదులకు,  ఆ పురాణమే ప్రమాణ గ్రంథమని మనం జ్ఞాపకముంచుకోవాలి.

''శబ్దమే ఈశ్వరుడు'' అనేదాన్ని పాశ్చాత్యులు ఎలా వ్యాఖ్యానించారు అనే విషయ మలా ఉండనివ్వండి. శబ్దమే ఈశ్వరుడనే వచనానికి, మన శబ్దబ్రహ్మవాదానికి గల పోలికనే మన మిచట గమనింపవలసి వుంటుంది. శబ్దమనే పూర్ణము నిత్యముకనుక దేశ కాలాతీతమని మనశాస్త్రాలుచెపుతున్నవి. పూర్ణత్వ నిత్యత్వ లక్షణములను బట్టియే శబ్దాన్ని ''విభువు'' అంటారు (విభువు - వ్యాపకము) ఆ శబ్దాన్ని నేడు టేపులలో భద్రపరుస్తున్నారు. రేడియోల వల్ల...కాల క్రమంలో దూరశ్రవణ భాగ్యంగూడా మనకు లభించింది. గాలిలో వున్న శబ్దతరంగాలను గ్రహించి మనకు వినిపించేదేగాని రేడియోయంత్రము తానుగా శబ్దాన్ని సృష్టించదు. శబ్దము - నిత్యము, పూర్ణము అని యీ యంత్రములవల్ల నేడు రుజువేర్పడింది. ఇలాగే మనకంటి కగపడని వస్తువును టెలిస్కోపుచే చూడగలుగుతున్నాము. వున్నదాన్ని మనదృష్టి కందించునే గాని టెలిస్కోపుగూడ లేని వస్తువును సృష్టించదు.

శబ్దమనాదియైనప్పటికీ మన శ్రవణశక్తి పరిమితం కావటంవల్ల దానిని వినలేకపోతున్నాము. మనకు వినిపిస్తే శబ్దమున్నదంటాము. వినిపించకపోతే లేదనుకొంటాము. సూర్యుడు తూర్పున పొడిచి పడమట క్రుంగుతున్నాడనేది పిల్లలకు కూడా ప్రత్యక్షమే. మరి సూర్యుడు తిరగటంలేదు భూమియే తిరుగుతున్నదనేటప్పటికి చప్పున బోధపడదు. దాని కెన్నో ఉపమానాలు, ఉపపత్తులు చెప్పి బోధించాలి. సూర్యకాంతి సోరణగండ్లనుండి ఇంట్లో పడినప్పు డా కంతల ఆకారాన్ని బట్టి గుండ్రముగానో, అండాకారముగానో, నిలువుగానో, కన్పిస్తుంది. మరి ఆకాశంవంక చూస్తేనో, సూర్యకాంతి నిరాకారమై, సర్వవ్యాపకమై వుంటుంది. వెలుతురుకోసం మన ఇంటి కప్పులో అద్దములు బిగిస్తాము. దానిలోనుంచి చూస్తే సూర్యు డెదురుగా లేనప్పుడు వట్టి నీలాకాశమే కనిపిస్తుంది. మరి మన చూపునకు తిన్నగా యే గ్రద్దయో ఎగురుతున్నదనుకొండి. అపుడు ఆపక్షిపై ప్రసరించే సూర్యరశ్మిని చూడగలుగుతాము. కనుక మన దృష్టిపథములో ఏదో వస్తువుంటేనే వెలుగు మనకు దృగ్గోచరమవుతుంది. గాలి మనచుట్టూ ఆవరించినప్పటికీ ఏ విసనకర్రనో ఆడిస్తేతప్ప దాని ఉనికి తెలియదు.

విసనకర్ర కదలికచే గాలికి అభిఘాతం కలిగిందన్నమాట. అట్లే అంతటా వ్యాపించి, అఖండమైనవున్న శబ్దాన్ని కూడా మన శ్రవణేంద్రియము గ్రహించజాలదు. శబ్దాన్ని మన చెవి గ్రహించవలెనంటే దాన్ని సంకోచింపచేసి, అల్పరూపం కల్పించాలి. మనం చప్పట్లు చరిస్తే శబ్దం పుట్టుతుంది. మనకంఠంలో కండరాలు వేరువేరు రూపాలు ధరించి గాలిని బయటికిపంపునప్పుడు ఆకండరాల వికారాన్ని బట్టి క, చ, ట, త, ప మొదలయిన ధ్వనులు పుట్టుతవి. ఎందువల్ల? అంతకుముందేవున్న శబ్

దాన్ని కంఠనాళముల మార్పునుబట్టివివిధరూపాలతో మనం వినగల్గు తున్నామన్నమాట. నిశ్చలమైన శబ్దసముద్రములోబుడగలు పగులునట్లు ఈలా శబ్దముపుట్టడాన్ని స్ఫోటమని అంటారు. శాస్త్రకారులు, అప్రస్తుతమైనా యిక్క డింకొకమాట చెప్పుతాము. మననోటిలోని పండ్లకు దంతాలనేపేరు ఏలావచ్చిందో తెలుసునా? ద, న, త అనే అక్షరములు పలుకుటకు సహాయపడుతున్నవి గనుక పండ్లకు దంతములనే పేరు కలిగింది.

మనం ఈశ్వరసత్తను, అతని సర్వవ్యాపకత్వ,సర్వ శక్తిత్వ, సర్వజ్ఞత్వ, నిత్యత్వములను అంగీకరిస్తున్నాము. అనంతరూపముల చేనాతడు మనకువ్యక్త మౌతున్నాడు. పూవులలో గంథము, సూర్యునిలా తేజస్సు, మాసాల్లోమార్గశిరం.
ఇంతకు శబ్దము నిత్యమనీ, పూర్ణమనీ మనం చెప్పుకొన్నాము. శబ్దమువలెనే రసము, జ్యోతిస్సు, ఆనందముగూడా నిత్యములు, పూర్ణములు పూర్ణమలైన ఈ శబ్దరసాదులను మనం సావధికమైన మనస్సుచే గ్రహిస్తూవుండడంవల్ల వాటిని అంశమాత్రంగా చూస్తున్నాము. పూర్ణమెప్పుడూ ఏకము. ఏకమయిన పదార్ధమే పూర్ణము కాగల్గుతుంది. పూర్ణమనేది ఒక్కటిగానే వుంటుందిగాని రెండుగా వుండజాలదు. దాని యందు ద్వైతభావములేదు. కాబట్టి, ఈ శబ్ద రసానందముల పూర్ణత్వమంతా ఏకము, పరిపూర్ణము ఐన బ్రహ్ముదేగాని అన్యముగాదు. కావున, శబ్దరసాదులన్నీ బ్రహ్మమే అనాలి. దీనినే శబ్ద బ్రహ్మవాద మంటారు. ఇపుడు మనం వినగల్గుతున్న శబ్దము పరిమితము, సావధికమేగానిసత్యంగాదు. బ్రహ్మమొక్కటే సత్యం.

అనంతమైన ఉపాధులతో మనకు కనిపించేది అంతామాయమైనట్లే, మనంవినే శబ్దంకూడా మాయయే. నిరుపాధికమయిన బ్రహ్మమే సత్యం. సోపాధిక మెన్నడూ పూర్ణముకాదు, పూర్ణమే సత్యము కాగలదు. దాని అంశ సావధికము గనుక పూర్ణసత్యముకాదు. ఇదియే శబ్ద బ్రహ్మ వాదమందు తెలియవచ్చే తత్త్వజ్ఞానము. ఈకర్మప్రపంచంలో యీదులాడుచున్న మనం వ్యాకరణశాస్త్రమందు ప్రతిపాదితమైన యీ శబ్దబ్రహ్మవాదాన్ని మనస్సులో ఇంకనిస్తే, నేడుగాకుంటే మరోనాటికైనా మనకు సత్యదర్శనము కలిగి ఫలప్రదమవుతుంది. 
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive