కనిపించని ఓ కోట కథ. ~ దైవదర్శనం

కనిపించని ఓ కోట కథ.

చుట్టూ దట్టమైన అడవి.. ఎటు చూసినా ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం అటవీశాఖ ఆధ్వర్యంలోని వెదురు.. జామాయిల్.. తోటలతో సుందర ప్రదేశం! అందులోనే ఓ చోట గిరిజనుల దేవతగా చెప్పుకునే.. గంగాదేవి అమ్మవారి రాతి విగ్రహం.. ఆ చుట్టు పక్కల శిథిలమైన ఏవో బండరాళ్లు.. గతంలో అక్కడేదో కోట ఉన్న ఆనవాళ్లు.. ఇది ఖమ్మంజిల్లా అశ్వారావుపేటకు దగ్గరలోని తిమ్మాపురం అటవీప్రాంతం
చరిత్రలో ఆ ప్రాంతం శత్రు దుర్భేద్యమైన కాకతీయులనాటి ఒక కోటతో ఉండేది. అద్భుతమైన శిల్పకళతో అలరారిన నాటి కోట.. నేడు నేలవాలిన రాతి స్తంభాల పేట! ఎంతో పవిత్రంగా ఆనాడు కాకతీయులచే పూజలందుకుంటూ, కోటకు రక్షణగా ఉన్న గంగాదేవి అమ్మవారు నేడు కనీసం ఓ కోవెలకు కూడా నోచుకోలేని దుస్థితిలో ఉంది. అక్కడ గతంలో ఓ కోట ఉండేదని, ఆ ప్రాంతంలో నేటికీ ఓ తల్లి పూజలందుకుంటోందని చుట్టుపక్కల 90శాతం మందికి తెలియదంటే అతిశయోకే! ఒకప్పుడు కాకతీయుల వైభవానికి ప్రతీకైన ఆ ప్రాంతం ప్రస్తుతం ఎవరికీ తెలియని ఎవరూ పట్టించుకోని అనాథల మారింది
చరిత్రలోకి వెళ్లితే..
.
కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రుద్రమ దేవి క్రీ.శ.1260-1289 మధ్య కాలంలో ఈ ప్రాంత పరిసరాల్లో సంచరించిన సమయంలోనే కళ్లుతిప్పుకోలేని శిల్పకళతో దర్పానికి దర్పణంలా నిలిచిన ఓ కోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇదే విషయాన్ని పూర్వీకులూ ధవీకరిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంచుట్టూ గ్రామాలే ఉన్నట్లు ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా దమ్మపేట మండలం నుంచి అశ్వారావుపేట మీదుగా తిమ్మాపురం, నారాయణపురం గుండా వేలేరుపాడు మండలం గుండా రుద్రమకోట వెళ్లేందుకు దారిని ఏర్పాటు చేశారు. రుద్రమదేవి అశ్వారావుపేట, గుంటిమడుగు, తిరుమలకుంట, రుద్రమకోటలపై పట్టుకోసం అప్పట్లో ఇక్కడ కోటలు నిర్మించినట్లు పెద్దలు ఆధారాలు చూపుతున్నారు. రుద్రమదేవి అనంతరం ప్రతాపరుద్రుడు కూడా క్రీ.శ.1289-1323 మధ్యకాలంలో ఈ ప్రాంతంలో సంచరించిన ఆధారాలు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. రుద్రమదేవి ఏలినటువంటి ఈ ప్రాంతాన్ని ప్రతాపరుద్రుడు కూడా కాపాడుతూ వచ్చాడు. కాకతీయుల కాలం అంతరించిన తర్వాత ఏలిన రాజులకు ఏ సమస్య వచ్చినా గంగాదేవి కలలో కనిపించి సమస్యకు పరిష్కరం చూపించినట్లు పెద్దలు చెపుతారు.

అమ్మవారే రక్షించేదట......
అప్పట్లో మద్రాసు రాష్ర్టానికి అతిసమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో బందిపోట్ల సంచారం, దాడులు అధికంగా ఉండేవి. బందిపోట్లు ఈ కోటపై దాడికి ప్రయత్నించే సమయంలో రాజుగారి కలలోకి గంగాదేవి కనిపించి దాడి జరగబోయే విషయాన్ని తెలియజేసేదని, దీంతో రాజు అప్రమత్తమయ్యేవాడనే విషయం ప్రచారంలో ఉంది. దీన్ని గమనించిన బందిపోట్లు అమ్మవారే దాడి విషయాన్ని ముందుగా రాజుగారికి చేరవేస్తుందన్న అనుమానంతో ఇద్దరు బందిపోట్లు ఆలయంపై కత్తులతో దాడి చేశారని, గంగాదేవి అమ్మవారితో పాటు వీరభద్రుడి విగ్రహాల నుంచి తలలను వేరు చేసినట్లు పెద్దలు చెబుతున్నారు. ముప్పై ఏళ్ల కిందట.. అప్పటికే 90 ఏళ్ల వయస్సులో ఉన్న ముసలయ్య అనే గిరిజనపెద్ద కాకతీయులకోట సమీపంలోని ఆలయ విశిష్టతను వివరించినట్లు కొందరు స్థానికులు తెలుపుతున్నారు. అప్పటినుంచే రానురాను కోటతో పాటు గంగాదేవి ఆలయం కూడా పూర్తిగా శిథిలమైంది.
ఇప్పటికీ పూజలందుకుంటున్న గంగాదేవి.....
.
కాకతీయరాజుల ఆరాధ్యదైవమైన గంగాదేవి, సదాశివునికి ప్రతిరూపం అయిన వీరభద్రుడు ఇప్పటికీ సమీప గిరిజనుల చేత పూజలందుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పశువులు తప్పిపోతే అమ్మవారిని మొక్కుకుంటే చాలు రెండురోజుల్లో తిరిగి వచ్చేస్తాయని ఇక్కడి గిరిజన భక్తుల నమ్మకం. అంతేకాదు ఈ అమ్మవారికి పూజలు చేస్తే తమ కోరికలు తీరి సుఖసంతోషాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆనాటి బందిపోట్ల దాడిలో గంగాదేవి విగ్రహం తల తెగిపడడంతో ఆ విగ్రహానికే భక్తులు రాతిశిల్పంతో తలను ఏర్పాటు చేసి పూజలు చేసుకుంటున్నారు. అయితే వీరభద్రుడి విగ్రహంమాత్రం తల లేకుండా, మొండెంతోనే ఉంది. ఈ ప్రాంతంలోనే ఆలయానికి కొంత దూరంలో శివుని ప్రతిరూపాలైన త్రిశూలం, ఢమరుకంతో సహా సూర్యచంద్రులు ఉన్న ముద్రలు ఓ రాతిపై దర్శనమిస్తున్నాయి. ఇలాంటి రాతిముద్రలు కాకతీయుల కాలంలో మాత్రమే ఉండేవని చరిత్ర చెబుతోంది. ఆలయ సమీపంలో గుడికుంట్ల చెరువు ఉండటం వల్ల అమ్మవారిని గుడికుంట్ల ముత్యాలమ్మ అని కూడా భక్తులు పిలుస్తుంటారు. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలోనే జిన్నలకుంట చెరువు ఉంది. కాకతీయుల నాటి ఈ అపురూప కట్టడం ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోయింది.

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...