యాజ్ఞవల్క్య మహర్షి కధ. ~ దైవదర్శనం

యాజ్ఞవల్క్య మహర్షి కధ.

కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవతారు అన్న విషయం అందరికి తెలుసు ఆవిషయాన్ని రుజువు చేసారు. కృషి ,పట్టుదల, ఆత్మవిశ్వాసాలకు మారు పేరుగా వున్న మహర్షి కధ.
పూర్వం కురుపాంచాల దేశంలో గంగానదీ తీరాన చమత్కారపురం అనే నగరం ఉండేది. ఆ నగరంలోనే యజ్ఞవల్క్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్యపేరు సునంద. ఆ దంపతులిద్దరికీ జన్మించినవాడే యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడికి ఆయన తండ్రి సమయ సందర్భ కాలోచితంగా చెయ్యాల్సిన సంస్కారాలన్నీ చేయించాడు. దాంతో యాజ్ఞవల్క్యుడు భాష్కలుడి దగ్గర రుగ్వేదాన్ని, జైమిని మహర్షి దగ్గర సామవేదాన్ని, అరుణి దగ్గర అధర్వణవేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడి తండ్రి యజ్ఞవల్క్యుడు తన కుమారుడిని వైశంపాయన మహర్షి దగ్గరకు పంపాడు. ఈ వైసంపాయన మహర్షి యాజ్ఞవల్క్య కి మేనమామ. అతని దగ్గర యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఆ వేదంతోపాటు మరింకా ఎన్నెన్నో విషయాలను గ్రహించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి అహంకారం, విద్యామదం లాంటివి కలిగాయి. ఆ విషయాన్ని గురువు గ్రహించాడు. ఆ లక్షణాలు కాలక్రమంలో మెల్లమెల్లగా తగ్గిపోతాయని అనుకున్నాడు ఆ గురువు. అయితే యాజ్ఞవల్క్యుడిలో నానాటికీ విద్యామదం పెరగసాగింది. అది ఆత్మాభిమానమని యాజ్ఞవల్క్యుడు అనుకున్నాడు. ఓ రోజున వైశంపాయనుడు తన మేనల్లుడు అధర్మమార్గంలో సంచరిస్తున్నాడని తెలుసుకొని కోపం పట్టలేక కాలితో అతడిని తన్నాడు.

బ్రాహ్మణుడిని కాలితో తన్నటం బ్రహ్మహత్యతో సమానమని ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాన్ని వైశంపాయనుడు కోపం చల్లారిన తర్వాత గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక ఆ పాపాన్ని ఎవరు పోగొడతారా అని మదనపడసాగాడు. ఆ విషయాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు గురువు దగ్గరగా వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం తనవల్ల తప్ప మరెవరివల్లా కాదని గర్వంగా అన్నాడు. తనపాపం పోవటం అటుంచి అంతటి కష్టకాలంలోను శిష్యుడు అంత గర్వంగా మాట్లాడటం గురువుకు కోపం తెప్పించింది. ఇక తాను ఎలాంటి విద్యలు అతడికి నేర్పబోనని, అప్పటిదాకా నేర్పినవాటినన్నింటినీ కక్కి వెళ్ళిపొమ్మని అన్నాడు.

గురుద్రోహానికి అదే తగిన శిక్ష అని అన్నాడు. అయితే అప్పటికి యాజ్ఞవల్క్యుడు తాను ఆత్మాభిమానం పేరున గర్వభావాన్ని కలిగివున్నానని తెలుసుకొన్నాడు. క్షమించమని గురువును వేడుకొన్నా లాభం లేకపోయింది. అయితే తనవంతు బాధ్యతగా యాజ్ఞవల్క్యుడు తన తపోబలంతో గురువుకు సంక్రమించిన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టి తాను నేర్చుకొన్న వేదాలను అక్కడే రక్తరూపంలో కక్కి వెళ్ళిపోయాడు. అయితే ఎంతో విచిత్రంగా యాజ్ఞవల్క్యుడు కక్కిన దానిని వైశంపాయుని శిష్యులు తిత్తిరిపక్షులుగా మారి గ్రహించారు. అవి పలికె పలుకులే తైత్తిరీయోపనిషత్తుగా ప్రసిద్ధికెక్కాయి.

గురువు దగ్గర నేర్చుకున్నదంతా అక్కడే వదిలివేసిన యాజ్ఞవల్క్యుడు దిగాలుపడి కూర్చోలేదు. ఆత్మస్త్థెర్యంతో సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన కరుణకు పాత్రుడై శుక్లయజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలూ అభ్యసించాడు. అలా అందరికన్నా ఉత్తమోత్తమ విద్యాధిపతిగా యాజ్ఞవల్క్యుడు పేరుతెచ్చుకున్నాడు. కణ్వుడు లాంటి ఉత్తమశిష్యులు ఆయనదగ్గర శిక్షణ పొందాడు. ఒకసారి జనకుడు యాగం చేస్తూ మహర్షులందరినీ ఆహ్వానించాడు.

యాజ్ఞవల్క్యుడికి ఆహ్వానం వెళ్ళింది. అలా మహర్షులందరూ రాగానే జనకుడు మీలో ఎవరు గొప్ప విద్యావంతులైతే వారొచ్చి ఇక్కడున్న ధనరాశులను తీసుకువెళ్ళవచ్చు అని గంభీరంగా అన్నాడు. అయితే రుషులంతా ఒకరిముఖాలు ఒకరు చూసుకొని తామందుకు అర్హులం కామనుకొంటూ ఊరకనే కూర్చున్నారు. యాజ్ఞవల్క్యుడు మాత్రం లేచి తన శిష్యులను పిలిచి ఆ ధనరాశులను తన ఇంటికి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. యాజ్ఞవల్క్యుడి ధైర్యాన్ని చూసిన అక్కడివారంతా అతడితో శాస్త్రవిషయాల్లో పోటీకి దిగి యాజ్ఞవల్క్యుడిని అనర్హుడిగా నిరూపించేందుకు ఎన్నోవిధాలుగా ప్రయత్నం చేశారుకానీ అవేవీ వారివల్లకాలేదు. దాంతో జనకుడు ఆ ఋషిని గొప్పగా పూజించి సత్కరించాడు. జనకునికి ఆయన అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పాడు. యాజ్ఞవల్క్యుడి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. ఓరోజున విశ్వావసుడు అనే గంధర్వుడు యాజ్ఞవల్క్యుడి దగ్గరకు వచ్చాడు. తత్త్వాన్ని ఉపదేశించమని కోరి ఎంతో నేర్చుకొని యాజ్ఞవల్క్యుడంతటి గొప్పవాడు మరొకడు లేడని ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు. అనంతరకాలంలో ఆ ఋషి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఆ రోజుల్లో కతుడు అనే ఒక రుషి ఉండేవాడు. ఆయనకు కాత్యాయని అనే పేరున్న కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యుడికిచ్చి పెళ్ళిచేశారు పెద్దలు. అయితే మిత్రుడు అనే పేరున్న ఒక బ్రాహ్మణుడి కుమార్తె, పండితురాలైన గార్గి అనే ఆమె శిష్యురాలు అయిన మైత్రేయి

యాజ్ఞవల్క్యుడిని వివాహమాడాలని పట్టుబట్టింది. అప్పటికే అతడికి కాత్యాయనితో వివాహం కావటంతో పెద్దలకు ఏంచేయాలో అర్థంకాలేదు. గార్గి ఈ సమస్యకు సమాధానాన్ని వెతికింది. మైత్రేయిని కాత్యాయనికి పరిచయంచేసి ఆ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేలా చేసింది. కాత్యాయని, మైత్రేయి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. అప్పుడు గార్గి అసలు విషయాన్ని కాత్యాయనికి చెప్పింది. కాత్యాయని కూడా మైత్రేయి కోరికను మన్నించి యాజ్ఞవల్క్యుడితో వివాహాన్ని జరిపించింది. అలా యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలయ్యారు. ఆనాటి రుషులంతా యాజ్ఞవల్క్యుడిలోని విద్యావైభవాన్ని, యోగప్రాభవాన్ని గుర్తించి యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. ఆయన ప్రకటించిన యోగవిషయాలు యోగయాజ్ఞవల్క్యంగా ప్రసిద్ధికెక్కాయి. చివరలో భార్యలకు కూడా తత్త్వాన్ని ఉపదేశించి ఆయన సన్యాసాన్ని స్వీకరించి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు. ఇంతగొప్ప మహర్షి అయిన యాజ్ఞవల్క్య గురుదేవుల వారి పాదపద్మాలకు నమస్సులు తెలుపుకుంటున్నాను.

Share:

Related Posts:

3 comments:

  1. యాజ్ఞవల్క్య మహర్షివారి విద్యార్థి దశయందు వివరించిన విషయాలు సత్య దూరాలు...వ్యాసకర్త యాజ్ఞవల్క్య లూనీ అహంకారి అంటూవాక్యాలు వ్రాయడం అభ్యంతరకరము మరియు దోషప్రదము...వ్యాసకర్త లోతైన దృష్టితో మహర్షుల వారి చరిత్రను అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

    ReplyDelete
    Replies
    1. కన్నడలో శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి గూర్చి చక్కని వివరణ సత్ప్రమాణం ఉంది. రచయిత వాటిని చూడాలి.విన్నవి. కన్నవి రాసినట్టు వుంది.

      Delete
  2. నాకు కొన్ని పుస్తకాలు కావాలి దయ చేసి సహాయము చేయగలరు.స్వామి వారి మీద .
    ఈమెయిల్ ఐడి vanisandeep@gmail.com

    ReplyDelete

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive