అమృతస్య పుత్రాః ~ దైవదర్శనం

అమృతస్య పుత్రాః

ప్రాచీన భారతం (ప్రస్తుత నేపాల్) నందలి కపిలవస్తు దేశానికి మహారాజైన శుద్దోధనుడు, కోళియన్ దేశ రాకుమారి అయిన మహామాయ (మాయాదేవి)ని వివాహమాడగా, ఆ దంపతులకు సిద్ధార్థుడు జన్మించాడు. అయితే సిద్ధార్థుడు తల్లి గర్భమునందున్న సమయంలో మాయాదేవికి... ఒక ఆరుదంతములున్న ఏనుగు తన గర్భములోనికి కుడివైపు నుండి ప్రవేశించినట్లుగా స్వప్నానుభవం కలుగుతుంది. ఆ తరువాత పది మాసాలకు సిద్ధార్థుడు జన్మించాడు. కాగా తొలి పురుడు పుట్టింటిలో జరగాలనే శాక్యవంశ ఆచారం ప్రకారం... గర్భవతిగానున్న మాయాదేవి ప్రసవానికి ముందు తండ్రిగారింటికి బయలుదేరగా... మార్గమధ్యంలోనే లుంబిని అనే ప్రాంతంలో ఒక సాల వృక్షం క్రింద ఒక మగబిడ్డను ప్రసవించింది. బిడ్డ పుట్టిన కొన్నిరోజులకే మాయాదేవి మరణిస్తుంది. సిద్ధార్థుడు అనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడు అని అర్థం. అతని నామకరణం అనంతరం సిద్ధార్థుని భవిష్యత్తును గూర్చి తెలుపమని జ్యోతిష్కులను కోరగా... వారిలో కౌండిన్యుడను జ్యోతిష్యశాస్త్ర పండితుడు... సిద్ధార్థుడు భవిష్యత్తులో బుద్ధుడు కాగలడని చెప్పెను. 

రాకుమారుడైన సిద్ధార్దుడు బాల్యం నుంచే విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. సిద్ధార్దుని గొప్ప చక్రవర్తిని చేయాలనే ఉద్దేశ్యంతో... శుద్దోధనుడు అతడికి ఏవిధమైన తాత్విక విషయాలు గాని, సామాన్య ప్రజల కష్టసుఖాలు గాని తెలియకుండా పెంచాడు. తన పినతల్లి అయిన మహా ప్రజాపతి పెంపకంలో పెరిగిన సిద్ధార్దుడికి అతని 16వ ఏట యశోధరతో వివాహమయ్యింది. వీరికి రాహులుడనే కుమారుడు పుట్టాడు. ఈ విధంగా సిద్దార్డు 29 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రాజభోగాలను అనుభవించాడు. ఋతువులకు అనుగుణంగా వివిధ రాజభోగాలనన్నింటినీ సమకూర్చినప్పటికీ, సిద్ధార్దుడు ప్రాపంచిక సుఖాలను అనుభవించడం జీవిత పరమ లక్ష్యం కాదని భావించేవాడు.

సిద్దార్డుడికి ప్రాపంచిక, ఐహిక కష్ట్టసుఖాలు తెలియరాదని శుద్దోధనుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, అతడి 29వ ఏట సిద్ధర్డుడు ఒక రోజు... ఒక ముదుసలి వ్యక్తిని, ఒక రోగ పీడితుడ్ని, శవ యాత్రని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రధ సారధి చెన్నుడి ద్వారా, ప్రతి మనిషీ ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది, ముసలితనాన్నీ, రోగాన్నీ, మరణాన్ని జయించాలనే సంకల్పంతో... దుఃఖరాహిత్యానికి మార్గం కనుగొనాలని నిశ్చయించుకుంటాడు.

ఫలితంగా సిద్ధార్దుడు ఒకరోజు రాత్రి... తన రధ సారధి ఛన్న సహాయంతో, రాజభవనం నుంచి కంతక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. సిద్ధార్దుడు తన సన్యాసి జీవితాన్ని మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం అయిన 'రాజగృహ' లో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కానీ బింబిసార మహారాజ సేవకులు, సిద్దార్డుని గుర్తించడంతో, బింబిసారుడు, సిద్ధార్దుని అన్వేషణకు కారణం తెలుసుకుని, అతనికి తన సింహాసనాన్ని, మహారాజ పదవిని సమర్పిస్తాడు. కాని సిద్ధర్డుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ, తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాట మాత్రం ఇచ్చాడు.

తర్వాత సిద్ధార్దుడు, రాజగృహను విడిచిపెట్టి, ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు. అలరకలమ అనే సన్యాసి, తన బోధనలలో సిద్ధార్దుని ప్రావీణ్యున్ని చేసి, తన వారసుడిగా ఉండమని కోరాడు. కాని అ బోధనలవల్ల సిద్ధార్దుని జ్ఞానతృష్ణ తీరకపోవడంతో అతని కోరికను నిరాకరించాడు. తర్వాత సిద్ధార్దుడు ఉదకరామపుత్త అనే యోగి శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్దుని జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా సిద్ధార్థుడు నిరాకరించాడు.

తర్వాత సిద్ధార్దుడు కౌండిన్యుడనే యోగి వద్ద మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్యబృందమంతా, జ్ఞాన సముపార్జన కొరకు, బాహ్య శరీర అవసరాలను (ఆహారంతో సహా) పూర్తిగా త్యజించి సాధన చేశేవారు. ఈ విధంగా సిద్ధార్దుడు రోజుకు ఒక పత్రాన్ని గాని, ఒక గింజను గాని ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింప చేసుకున్నాడు. చివరికి ఒకనాడు శరీరాన్ని శుష్కింప చేయడమనేది సరైన మార్గం కాదని తెలుసుకున్నాడు. పిదప సిద్ధార్దుడు ధ్యానం ద్వారా ఐహిక సుఖాలను, కోరికలను త్యజించి సాగించే జీవన విధానమైన 'మధ్యే మార్గాన్ని' కనిపెట్టాడు.

ఆ తరువాత గయలో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకొనుటకు ధ్యాన సాధన తీవ్రంగా చేశాడు సిద్ధార్థుడు. చివరకు తన 35వ ఏట, 49 రోజుల ధ్యానం తర్వాత... సిద్ధార్దునకు జ్ఞానోదయమయ్యింది. అప్పటి నుండి సిద్ధార్దుడు, గౌతమ బుద్ధునిగా పిలువబడ్డాడు. బౌద్ధ మతంలో ఇతనిని శాక్యముని బుద్దుడని భావిస్తారు.జ్ఞానోదయం అయిన అనంతరం గౌతమ బుద్ధుడు, మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాన్ని తెలుసుకోగలిగాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణమందురు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు, ప్రతి బుద్ధునకు ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించాడు. గౌతమ బుద్ధుడు తన 80వ ఏట...తాను మరి కొద్ది రోజులలో మహా నిర్యాణ మొందుతానని ప్రకటించినట్లు మహా పరనిభాన సూక్తం ప్రకారం తెలుస్తున్నది.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive