జీవితవాజ్ఞూలం. ~ దైవదర్శనం

జీవితవాజ్ఞూలం.

ఎంత చదివినా అర్థం కాని లోతైన జ్ఞానం, ఎంత రాసినా ముగింపునకు చేరని జీవితం, ఎంత వెదికినా దొరుకని నిఖార్సయిన సమాధానం, ఎంత విన్నా సమర్థతాభిముఖం కాని గీతం జీవితం. దాని కోవ దానిదే గాని, మన కోవలోకి రాదే. ప్రశాంతంగా నడిచినన్నాళ్ళూ జీవిత ప్రాబల్యం మనల్ని అంతగా ప్రభావితం చేయదు. అదే ఒకే ఒక్క కుదుపు జీవితాన్ని తాకిందో అల్లకల్లోలం అయిపోతుంది. మరిన్ని జీవితాలను తలకిందులు చేస్తుంది. నిన్నటిదాకా నిండుగా ఉన్న జీవితం నేడు వెలితిగా మారిపోయి మరికొన్ని జీవితాలను వెలవెలబోయేలా చేస్తుంది. పైగా జీవితమంటేనే అంతనే వాజ్ఞూలాన్ని ప్రకటిస్తుంది జీవితం. వ్యక్తిగతమైన జీవితం కుటుంబంలా పరిఢవిల్లి జీవితం విలువల్ని తెలియపరుస్తూ, సంతోషాల నవ్వులనూ, కష్టాల కన్నీళ్ళనూ పరిచయం చేస్తూ సాగిపోతున్న తరుణంలో జీవితమైన కుటుంబంలోని వ్యక్తి దూరమైతే పరిస్థితులెలా మారిపోతాయి. ఆ లోటును పూడ్చలేక జీవితాలను భారంగా ఎలా నెట్టుకొస్తామనేదే ఈ పక్షులనేదే కథ.

అధర్మానికీ, ధర్మానికీ మధ్యలో జరిగే యుద్ధం తన కుటుంబాన్ని కాలరాస్తుందేమోనని మధనపడింది. ఒకవైపు తను ఏమైపోయినాసరే తన కుటుంబం బాగుండాలనే తెగింపు, మరోవైపు తానులేని తన కుటుంబం ఎలా ఉండగలుగుతుందనే తలంపు తల్లి పక్షిని అతలాకుతలం చేసింది.

- ఇట్టేడు అర్కనందనా దేవి

ఒకానొక చిన్న అడవిలో పక్షుల జంట ఒకటుండేది. ఆహారం వెదికి తెచ్చుకొని భరోసానిచ్చే నీడ దొరికి ప్రశాంతంగా బతుకుదామనుకుంటుందా జంట. కానీ బంధువర్గమే రాబందుల్లా పొడుచుకుతింటుంటే తట్టుకోలేక ఆ అడవిని విడిచి మరో చోటికి వలస వెళ్లాయి. అక్కడా ప్రశాంతమైన బతుకు దొరుకలేదు. రెక్కలు ముక్కలు చేసుకొని నిస్సహాయతను సమాజం చాతకానితనంగా ప్రకటిస్తున్నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని జీవితం చేతిలో ఒదిమిపట్టుకొని మరోచోటుకు చేరిందా పక్షి కుటుంబం. పక్షి జంట, పిల్లలూ విశాలమైన చోటుకు ప్రశాంతతనూ, జీవిత గమ్యాన్నీ వెదుక్కుంటూ వెళ్ళిందో లేదో వేటగాళ్ళ వేటుకు పక్షి జంటలోని ఒక పక్షి గాయపడింది. మరో పక్షి, పిల్ల పక్షులూ ఎంతో శ్రమించి దానిని కాపాడుకోగలిగాయి. ఆ గాయం కుటుంబాన్నంతా కుదిపేసింది. ఆ కుదుపు నుంచి బయటపడేందుకు చాలా కాలమే పట్టింది. జీవితం జీవితంలా సాగిపోతుంది. దానిని సాగించేందుకు తమ ప్రయత్నాన్ని ఎప్పుడూ మానలేదా పక్షి కుటుంబం. పిల్ల పక్షులకు రెక్కలొచ్చి ప్రపంచాన్ని చుట్టే ఆలోచనల్లో ఉన్నప్పుడు జీవితం మరో కుదుపును ప్రయోగించింది.

ప్రశాంతంగా ఉన్న కుటుంబం యుద్ధం కారణంగా అల్లకల్లోలం అవబోతుంది. ఒక పెద్ద మైదానంలో ఉన్న చెట్టుపై పక్షి జంట, పిల్ల పక్షులు జీవిస్తుండగా యుద్ధ కోలాహలం మొదలైంది. అదే కురుక్షేత్ర యుద్ధం. తల్లి పక్షి తన కుటుంబం యుద్ధం ప్రభావంతో నష్టపోకూడదని తన వంతు ప్రయత్నాలెన్నో చేసింది. ఒక రకంగా చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధం నుంచి తన కుటుంబం బయటపడేందుకు ఎన్నో గాయాలకోర్చింది. ఎంతో మధనపడింది. తానేమైపోయినా పర్వాలేదు తన కుటుంబం బాగుండాలనుకుంది. దేవుడిపై భారం వేసింది. తన సర్వశక్తులూ ఉపయోగించింది. అధర్మానికీ, ధర్మానికీ మధ్యలో జరిగే యుద్ధం తన కుటుంబాన్ని కాలరాస్తుందేమోనని మధనపడింది. ఒకవైపు తను ఏమైపోయినాసరే తన కుటుంబం బాగుండాలనే తెగింపు, మరోవైపు తానులేని తన కుటుంబం ఎలా ఉండగలుగుతుందనే తలంపు తల్లి పక్షిని అతలాకుతలం చేసింది. భారత సంగ్రామం మొదలైంది. యుద్ధ భూమిలో బిక్కుబిక్కుమంటున్న పక్షి కుటుంబం గల చెట్టు ఎప్పుడు నేల కూలుతుందోననే భయం తల్లి పక్షిలో ఒక ఆలోచనను కలిగించింది.

అల్లంత దూరంలో కృష్ణుడు సారథిలా వస్తున్న అర్జునుని రథం కనిపించింది. కానీ దానిని చేరుకోవాలంటే బాణాల తాకిడి తప్పదు. అయినా ఎదురెళ్లింది తల్లి పక్షి. ఆయుధాల తాకిడికి తల్లి పక్షి శరీరం ఛిద్రమైపోయింది. ధైర్యంతో ముందుకు వెళుతూనే ఉంది. కొనఊపిరితో కృష్ణున్ని చేరింది. తన కుటుంబం నివసిస్తున్న స్థలాన్ని చూపించింది. తన కుటుంబాన్ని చూసుకోవడానికి నేనింక ఉండలేననీ, తన కుటుంబ భారమంతా నీదే కృష్ణ అనీ, ఈ యుద్ధం నుంచి తన కుటుంబాన్ని ఎలాగైనా రక్షించి జీవితం సాగించేందుకు దారి చూపించాలనీ కోరింది. కృష్ణుడు మాట ఇచ్చాడు. కడసారి తన కుటుంబాన్ని మనఃఫలకంపైనే చూసుకుంది తల్లిపక్షి. కృష్ణుని చేయి రథాశ్వానికి ఉన్న మణికి తాకింది. ఆ మణిని పక్షి కుటుంబం ఉన్న చెట్టుకు తగిలించాడు కృష్ణుడు. భారత యుద్ధం ముగిసేవరకూ పక్షి కుటుంబం ఏ ఆపదనూ ఎదుర్కోలేదు.

తల్లి పక్షి మాత్రం జీవితపు నాటకంలో తన పాత్రను ముగిస్తూ కూడా తన కుటుంబం గురించే ఆలోచించింది. యుద్ధ భూమిలో జీవిత యుద్ధాన్ని గెలుస్తూ వీరమరణం పొందిన తల్లి పక్షి భౌతికంగా పక్షి కుటుంబానికి దూరమైనా, కుటుంబంలోని మిగతావారి మనస్సుల్లోనూ, ప్రేమల్లోనూ ఆలోచనల్లోనూ. ఆచరణల్లోనూ, విలువల్లోనూ, ధర్మంలోనూ సజీవంగా కలకాలం నిలుచుంటుదనేది వాస్తవం. తల్లి పక్షి లేకపోవడం ఆ కుటుంబానికి తీరనిలోటే. కానీ జీవిత వాజ్ఞూలాన్ని చెరిపేదెవరు? జ్ఞాపకాల దొంతరంలో గమించే జీవితం తప్ప.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive