యగశాస్త్రాన్ని రచించిన పతంజలి మహర్షి జీవసమాధి అయిన స్థలాలు కొన్ని ఆలయాలుగా ప్రసిధ్ధిచెందాయి. విటిలో ప్రముఖమైనది తిరుప్పిడూరు అనే తిరుప్పట్టూరు.
పులికాళ్ళ మహర్షిగా పేరుగాంచిన వ్యాఘ్రపాదులవారిచే పూజించబడిన దివ్యక్షేత్రం యిది. తిరుచ్చి - చెన్నై మార్గంలో తిరుచ్చి సత్రం బస్ స్టాండ్ నుండి 30 కి.మీ దూరంలో వున్న అద్భుతమైన ఊరు.
తిరుప్పట్టూరు దర్శన భాగ్యం కేవలం దైవ యోగం వున్న వారికే కలుగుతుందని అంటారు. ఆవిధంగా తిరుప్పట్టూరు వచ్చే భక్తుల విధివ్రాతలను శుభకరంగా మార్చి వ్రాయాలని పరమశివుడు యిచ్చిన ఆనతి.
ఒకానొక కాలంలో ఆది శేషువుపై అరమూత కన్నులతో శయనించిన మహావిష్ణువు తనలో తాను నవ్వుకుంటూ పరవశించిపోతూ వున్నాడు. పరమానందంతో ఆయన శరీరం బరువెక్కింది.
మహావిష్ణువుని మోస్తున్న ఆదిశేషువుకి మహావిష్ణువు హటాత్తుగా బరువు పెరగడంతో మ్రోయడానికి శ్రమ కలిగినది. మహావిష్ణువుని భరించడం భారంగా తోచినది. మహావిష్ణువు అంత ఆనందభరితుడై వుండడానికి కారణం ఏమిటో తెలియక ఆశ్చర్యపడ్డాడు ఆదిశేషువు. స్వామినే అడిగాడు.
అందుకు మహావిష్ణువు తన్మయత్వంతో "ఆదిశేషా.. నా దేహం బరువు ఎక్కడానికి కారణం నీవు తెలుసుకోవాలనుకుంటున్నావు. చెప్తాను, విను. నేను ఇక్కడనుండే కైలాసంలో మహేశ్వరుని ఆనందతాండవం తిలకించాను. నా మనస్సు ఉప్పొంగిపోయింది. ఆ నాట్యం చూసి ఆనందించేను.
అందువలన నా దేహం మనసు ఆనందంతో బరువెక్కినది" అని తెలిపాడు. ఆదిశేషువుకి సందేహం తీరినది. కానీ ఆ శివతాండవాన్ని తాను దర్శించాలని ఉవ్విళ్ళూరాడు.
మహేశ్వరుని ఆనందతాండవాన్ని యీ దాసుడు కూడా చూడాలి. ఆ భాగ్యాన్ని కలుగజేయండని మహావిష్ణువుని వేడుకున్నాడు. అందుకు మహావిష్ణువు తెలిపిన ఆదేశం పాటిస్తూ ఆదిశేషువు కైలాసానికి దిగువన తపస్సు చేయనారంభించాడు.
ఆదిశేషువు సుదీర్ఘకాల తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆదిశేషువు కోరిక తీరే మార్గం తెలిపాడు. "నీవు భూలోకంలో వ్యాఘ్రపురంలో కశ్యప మహర్షికి కద్రువకి పుత్రునిగా పుట్టి పతంజలి అనే పేరుతో పెరిగిన పిదప అనేక ముఖ్య పుణ్యస్ధలాలలో నా తాండవలీలలు నీవు దర్శించగలవు" అని అభయమిచ్చాడు.
ఆవిధంగా భూలోకంలో జన్మించిన పతంజలి సకల శాస్త్రాలు అధ్యయనం చేసి యోగవిద్యలో పాండిత్యం సంపాదించి గొప్ప యోగి అయినాడు.
పతంజలి మహర్షికి మిత్రుడు వ్యాఘ్రపాదులు. ఈ ఇరువురు మానవరూపాలలో కనిపించినా పతంజలి మహర్షి నడుముకి కింద భాగం సర్పరూపములో, వ్యాఘ్రపాదులు పేరుకు తగినట్లు ఆయన శరీరం క్రిందిభాగం పులి రూపంలోను వుంటుంది.
ఈ ఇద్దరు ఋషులు దేశమంతా తీర్ధయాత్రలు చేసి వచ్చారు. ఆ సమయంలో వారికి దర్శనం యిచ్చిన ఈశ్వరుడు దక్షిణాదిన గల తిల్లై క్షేత్రంతో కలిపి తొమ్మిది పులియూర్ శైవక్షేత్రాలను దర్శిస్తే వారికి తన తాండవ దర్శనం లభిస్తుందని వరమిచ్చాడు.
పతంజలి, వ్యాఘ్రపాదులు ఇద్దరూ ముందుగా పుష్యమాసంలో పుష్యమి తిధిన తిల్లైగా పేరు పొందిన పులియూరుకి వచ్చారు.వారి వెంట మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు కింకరులతో, శివగణాలు, గంధర్వులు అందరూ తిల్లైకి తరలి వచ్చారు. అక్కడ ఈశ్వరుడు కనకసభాపతిగా ఆనందతాండవాన్ని ప్రదర్శించి అందరిని ఆనందపరిచాడు.
మునులు ఇద్దరికి ఆనందంతో కన్నీరు వర్షించగా "ఈశ్వరా..ఈ తాండవాన్ని దర్శించడానికే జన్మించాము. చాలు.. చాలు, మా జన్మ ధన్యమయింది. మమ్మల్ని యిప్పుడే మీలో ఐక్యం చేసుకొని ముక్తిని ప్రసాదించండి" అని వేడుకున్నారు..
"ఎప్పుడైతే కోరికలతో మీరు జన్మ ఎత్తారో అప్పుడే మీరు మాయామోహంలో చిక్కుకున్నారు అని అర్ధం. నా తాండవం చూడాలని కోరుకున్నారు. అది నెరవేరినది.
ఇప్పటికిప్పుడు వెంటనే మోక్షం అసాధ్యం. నేను చెప్పిన విధంగా మిగతా ఎనిమిది పులియూర్లను దర్శించండి. మీ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించండి, వెళ్ళండి.
ఈ ఎనిమిది క్షేత్రాలలో ఒక అద్భుతమైన స్ధలంలో మీ కోరిక నెరవేరుతుందని అనుగ్రహించాడు పరమశివుడు.
ఈ దివ్య మార్గం కేవలం ఒక్క పతంజలి, వ్యాఘ్రపాదులకు మాత్రమే చూపించిన మార్గం కాదు, మానవజన్మ ఎత్తిన వారందరికి వర్తిస్తుంది.
పరమశివుడు చెప్పినట్లుగానే పతంజలి, వ్యాఘ్రపాదుల వారుమిగతా ఎనిమిది స్ధలాలు దర్శించడానికి బయలుదేరేరు. తిల్లై అనే పులియూరు నుండి బయలుదేరి,
తిరుప్పాదిరుప్పు పులియూరు, ఎరుక్కతం పులియూరు, ఓమాం పులియూరు, సిరుపులియూరు, అత్తిపులియూరు తప్పళాపులియూరు, పెరుంపులియూరు, గానాట్టంపులియూరు అనే ఎనిమది శైవ క్షేత్రాలను దర్శించారు. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధమైన శివతాండవ దర్శనాలతో ఆనందించి పరవశించారు. లక శ్రేయస్సు కోసం తమ జీవితాలను వెచ్చించి అంతిమంగా శివైక్యం చెందారు..
No comments:
Post a Comment