(ఈ తీర్థంలో పిండప్రదానం చేస్తే పిశాచరూపంలో ఉన్న పితృలకు విమోచనం కలుగుతుంది)
కపర్ది అనే గణపుడు కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి, విమలోదకం అనే కుండాన్ని తవ్వాడు. ఆ శివలింగాన్ని కపర్దీశ్వరుడు అని పిలుస్తారు. పూర్వం 'వాల్మీకి' అనే భక్తుడు కపర్ధీశ్వరుడిని అర్చిస్తూ అక్కడ తపస్సు చేశాడు.
ఒక రోజు అతను ఘోరాకృతి కల రాక్షసుణ్ణి చూసాడు. వాల్మీకి ఆ ప్రేతను "నీవు ఎవరవు? ఎక్కడి నుండి ఇక్కడకు వచ్చావు?" అని భయపడకుండా ప్రశ్నించాడు. అప్పుడు ఆ పిశాచి నమస్కరిస్తూ "గోదావరి తీరంలో ప్రతిష్ఠానమనే గ్రామంలో, దానాలు స్వీకరిస్తూ బ్రతికే బ్రాహ్మణుడను నేను. ఆ కర్మ వలన నేనీ దశను పొందాను.
ఏవైనా పర్వలయందు దానం చేయనివారు, తీర్ధాలలో దానాలు స్వీకరించినవారు ఇట్టి జన్మ ఎత్తుతారు! ఒకనాడు ఒక బ్రాహ్మణుడను ఆవహించాను. ఆ బ్రాహ్మణుడు ధనం ఆశతో కాశీ నగరానికి వచ్చాడు. అతను కాశీలో ప్రవేశిస్తుండగా, అతని పాపాలతో సహా నేను బయటకు నెట్టివేయబడ్డాను.
ఓ తపోనిధీ! మావంటి ప్రేతలకు, మహాపాపాలకు ఈ కాశీలో ప్రవేశించే అర్హతలేదు! ఇదీ ఈశ్వరాజ్ఞ! ఈరోజు ఒక కోమటిని భక్షిద్దామని దగ్గరకు వెళ్ళాను. అతను శివనామాలను చెబుతూ ఉండడం వలన, వాటిని వినడంవల్ల నా పాపం కూడా తగ్గింది.
అందువలన ఈ కాశీ క్షేత్రంలో ప్రవేశించగలిగాను! మహాత్మా! దారుణమైన ఈ పిశాచరూపం నుండి నన్ను ఉద్ధరించుము" అని ప్రార్ధించాడు!
అప్పుడు ఆ మహాత్ముడు "ఓ పిశాచమా! నీ పాపం పోవాలంటే ఈ విమలోదకమున స్నానము చేయి! ఈ తీర్ధ ప్రభావంవల్ల, కపర్దీశుని దర్శనం వలన నీకు ఈ పిశాచత్వము పోతుంది" అని చెప్పాడు! అప్పుడు పిశాచి "జల దేవతల అనుగ్రహం నామీద లేదు" అన్నాడు. అప్పుడు వాల్మీకి తన దగ్గర ఉన్న విభూతినిచ్చి, నుదుటన ధరించమన్నాడు.
విభూతిని ధరించడంవల్ల జలదేవతలు ఏమీ చేయలేదు. అలా నీటిలో దిగి, స్నానం చేసి, ఆ నీటిని త్రాగి ఆ జలాశయం నుండి బయటకు వచ్చిన ఆ పిశాచి, తన పిశాచత్వము తొలగిపోగా, దివ్య శరీరాన్ని పొందింది!
దివ్యగంధాన్ని, దివ్య మాలలను ధరించి, దివ్య మార్గాన వెళుతూ, ఆకాశం నుండి ఆ మహాత్ముడికి నమస్కరిస్తూ.. "హే! భగవాన్! మీ వలన ఈ నీచమైన పిశాచ శరీరం నుండి, ఈ తీర్ధమహిమ వలన దివ్యమైన శరీరాన్ని పొందాను!
ఈనాటి నుండి ఇది పిశాచమోచన తీర్ధంగా పిలవబడుతుంది! ఈ తీర్ధంలో ఎవరైతే స్నానం చేసి, సంధ్యాతర్పణ పూర్వకంగా పిండప్రదానం చేస్తారో, పిశాచ శరీరాన్ని పొందిన వారి పితృపితామహులు అందరూ కూడా పైశాచ్యం నుండి విముక్తి పొందుతారు!
ఉత్తమగతిని పొందుతారు! ఈ తీర్ధంలో మాఘశీర్ష శుద్ధ చతుర్ధశినాడు స్నానాదులు చేసినా పిశాచమోచనం జరుగుతుంది.
అతడు ఎక్కడ మరణించిన పిశాచ శరీరం పొందడు! సాంవత్సరిక యాత్రను చేసినవారు తీర్ధాల్లో దానాలు స్వీకరించడం వలన వచ్చిన పాపాలు నుండి విముక్తులవుతారు.
ఇక్కడ స్నానంచేసి, కపర్దీశుణ్ణి అర్చించి, అన్నదానం చేసినవాడికి ఎక్కడా భయమేలేదు" అని నమస్కరిస్తూ దివ్యలోకాలకు వెళ్ళాడు. వాల్మీకి ఈ మహాశ్చర్యకరమైన సంఘటన చూసి, కపర్దీశుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందాడు!
ఒక్క శివయోగికి పిశాచమోచన తీర్థంలో భోజనం పెట్టినా, కోటి శివయోగులకు పెట్టిన ఫలాన్ని పొందుతారు.
ఈ అధ్యాయాన్ని విన్నవారు భూతప్రేత పిశాచాదులచే బాధింపబడరు అని సుబ్రహ్మణ్యస్వామి అగస్త్యమహర్షితో చెప్పాడు..
Pishach Mochan, Ramakanth Nagar, Chetganj, Varanasi, Uttar Pradesh 221001
https://www.google.com/maps/place/pishach+mochan+kund/@25.3212747,82.9954145,787m/data=!3m1!1e3!4m5!3m4!1s0x398e2fc207010721:0x2516f9b11b986523!8m2!3d25.3199849!4d82.9955218
No comments:
Post a Comment