సింగరకొండ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రఖ్యాతి గాంచినవి. సింగరకొండ అద్దంకి నుండి 6 కి.మీ. దూరంలో ఉంది. మొదట్లో సింగన కొండ అని పిలవబడ్డ నరసింహ క్షేత్రం, అయిననూ ఆంజనేయ స్వామి క్షేత్రం గానే ప్రఖ్యాతి గాంచెను.
సింగరకొండపై లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉండగా కొండ దిగువన చెరువు ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే భూతప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని స్థానికులు చెప్తారు.
శ్రీ నరసింహ స్వామి ఆలయ చరిత్ర :..
శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని 14వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
క్షేత్ర మహత్యాన్ని అనుసరించి, 14వ శతాబ్దానికి చెందిన సింగన్న అనే నృసింహస్వామి భక్తుడు ఉండేవాడు. సింగన్న కూతురు నరసమ్మ. ఆమె రోజు ఆవులను మేపేందుకు కొండమీదికి వెళ్ళేది. ఆ ఆవుల్లో ఒక ఆవు పాలు ఇవ్వకపోవడాన్ని సింగన్న గమనించాడు. ఒకటి రెండు రోజులైతే అనుకోవచ్చు.
కానీ ఇన్ని రోజుల పాలు ఎందుకు ఇవ్వడంలేదా అని ఆలోచించాడు. అసలు సంగతి ఏమిటో కనిపెట్టాలని సింగన్న కూడా కొండమీదికి వెళ్ళాడు. పాలు ఇవ్వని ఆవును అనుసరించి వెళ్ళాడు.
ఆవు కొండపైన ఒక రాయి దగ్గరికి వెళ్ళింది. ఆ రాతిలోంచి ఒక బాలుడు ఉద్భవించి, ఆవు పాలను తాగి వెళ్ళడం చూసిన సింగన్న ఆశ్చర్యానికి అంతులేదు. తన ఆరాధ్య దైవం అయిన నృసింహ స్వామి బాలుని రూపంలో వచ్చి పాలు తాగడంతో సింగన్న మహదానందపడిపోయాడు.. తన కళ్ళతో రాయి నుండి బాలుడు రావడం చూశాడు గనుక, ఆ రాతిని పరమ పవిత్రంగా భావించి అక్కడే నృసింహస్వామికి దేవాలయం కట్టించాడు. ఇక కొండ దిగువన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామికి సంబంధించిన స్థల పురాణం తెలుసుకుందాము.
ప్రసన్నాంజనేయ స్వామి స్థల పురాణం : ..
సతమ్మ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపధం బయలుదేరిన ఆంజనేయుడు, ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారని ఒక నమ్మకం. అందుకే ఇచ్చట ఆంజనేయుడు దక్షిణాముఖుడై కనపడతారు.
అద్దంకి తాతాచార్యులు అని గొప్ప భక్తుడు సింగరకొండలో కొండపై గల నరసింహ స్వామి గుడిలో ధ్వజారొహణ చేయుచుండగా, కొండ క్రింద ఒక దివ్యపురుషుడు ఒక ఆంజనేయ విగ్రహమునకు హారతి ఇచ్చుచూ కనబడెను. పరుగు పరుగున క్రిందకు వెళ్ళిన తాతాచార్యుల వారికి పురుషుడు మాయమై, దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయ విగ్రహం కనపడింది. వాళ్ళు కొండ దిగి వచ్చి చూసేసరికి ఆ పుణ్యమూర్తి కనిపించలేదు. మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగిపోతూ కనిపించింది.
దాంతో ఆ గ్రామస్తులు, చుట్టుపక్కలవారు కలిసి, లక్ష్మీ నృసింహ దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా కట్టించారు. ఇక్కడి ఆలయంలో స్వామి వారు అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక్కడ భవనాశనీ తటాకాన్ని చూడవచ్చు.
ప్రతి శని, ఆది, మంగళవారాలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ దశమి మొదలు బహుళ పాడ్యమి వరకు బ్రహోత్సవాలు జరుగుతాయి.
పూజలు..
సింగరకొండలో ప్రతి మంగళ వారం మరియు శని వారం విశేష పూజలు జరుగును. ముఖ్య పండుగలు అయిన ఉగాది, శ్రీరామ నవమి, హనుమ జ్జయంతి, ముక్కోటి, సంక్రాంతి, బ్రహ్మోత్సవాల తిరునాల్లు ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజులలో లక్షల కొద్దీ భక్తులు వచ్చి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీశ్శులు పొందెదరు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్ష తమలపాకుల పూజ, కోటి తమలపాకుల పూజ చూడుటకు రెండు కళ్ళూ చాలవు.
నిత్యాన్నదాన పథకం..
స్వామివారిని దర్శించుకొనడానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం జరుగును. ప్రతి మంగళవారం, శనివారం 150 మంది భక్తులకు, మిగతా రోజులలో 50 మంది భక్తులకు, అన్నప్రసాద వితరణ జరుగుచున్నది.
ఆలయం దర్శనం సమయం ఉదయం 5:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తిరిగి 4:00 నుండి రాత్రి 8:00 వరకు..
వసతి:..
సింగరకొండ లో వసతి పొందాలనుకునేవారు దేవస్థానం ఏర్పాటు చేసిన కాటేజీలలో బస చేయవచ్చు. కనుక ఇక్కడికి వచ్చే యాత్రికులు మారుతి భవన్ లో వసతి పొందవచ్చు. అద్దె తక్కువ ధరకే లభిస్తుంది.
ఎలా చేరుకోవాలి..?
హైదరాబాద్ నుండి 290 కిలోమీటర్లు, విజయవాడ నుండి 110 కిలోమీటర్లు, ఒంగోలు నుండి 36 కిలోమీటర్లు, అద్దంకి నుండి 5 కిలోమీటర్ల దూరంలో సింగరకొండ కలదు..
No comments:
Post a Comment