కాళీ తత్వం 3 ~ దైవదర్శనం

కాళీ తత్వం 3

కాళీ సాధన వల్ల ఏమి జరుగుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యాలు సాధించ వచ్చు. లోకంలో ఇది అసాధ్యం, చస్తే జరుగదు అనుకున్న పనులు కాళీ మాత అనుగ్రహం ఉంటే చిటికెలో జరుగుతాయి.


ఇదెట్లా సాధ్యం అవుతుంది? కాళీ అనుగ్రహంతో కాల గతి త్వరితం అవుతుంది. కర్మ పరిపక్వత త్వరగా అవుతుంది. చెడు కర్మ భస్మం అవుతుంది. అనేక జన్మల్ కర్మానుభవం ఒక్క జన్మలో జరుగుతుంది.మహా కాళీ శక్తి కి ఎదురు నిలిచే శక్తి ప్రపంచంలో లేదు. ఆ శక్తియే ప్రసన్నురాలైనపుడు ఇక మానవుడు సాధించలేనిదంటూ ఉండదు.


'సైషాప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే' అంటుంది దేవీ సప్తశతి.అంటే ఆ దేవి ప్రసన్నురాలై వరదాయిని అయినపుడు మానవుడు మోక్షాన్ని పొందగలడు.దుర్లభమైన మోక్షమే సాధ్యమైనపుడు ప్రాపంచిక కోరికలు తీరవా?చాలా తేలికగా తీరుతాయి.కోహినూర్ వజ్రమే చేతిలో ఉన్నవానికి గులకరాయి దొరకదా? ఎక్కడబడితే అక్కడే దొరుకుతుంది.


వివేకానందస్వామి ఇంకా నరేంద్రునిగా ఉన్న సమయంలో ఒకరోజు ఆయనకు ధ్యానంలో ఒక దర్శనం కలిగింది. అప్పుడు ఆయనకు ఇరవై ఏళ్ల వయసు ఉండవచ్చు. ఆయనకు కాళీమంత్ర బీజాక్షరాలు జ్యోతుల మాదిరి వెలుగుతూ దర్శనం ఇచ్చాయి.సామాన్యంగా ఇటువంటి స్థితిలో కుండలినీ ప్రబోధం కలుగుతుంది.వెన్నెముక క్రింద భాగంలో కరెంటుషాక్ కొట్టినట్లు అనిపిస్తుంది.అలాగే వెన్నెముక గుండా ఏదో జరజర పాకినట్టు అనిపిస్తుంది.స్వామి సత్యానంద సరస్వతికి మొదటిసారి కుండలిని ప్రబోధం కలిగినపుడు తన కాళ్ళ క్రింద భూమి చీలిపోయి తానేక్కడికో పాతాళంలోకి పడిపోతున్నట్లు అనుభవం కలిగింది.


కొందరికి ఇతరదర్శనాలు కూడా కలుగ వచ్చు.మరింత అదృష్టవన్తులకు కాళీమాత నిజదర్శనం కలుగవచ్చు.అది ఒక్కొక్కరి కర్మ పరిపక్వతను బట్టి, మానసిక పవిత్రతను బట్టి ఉంటుంది. కాళీమాత దర్శనం కలిగితే అది తట్టుకొవటానికి చాలా చాలా సాధన కావాలి. అది అంత తేలికైన విషయం కానే కాదు.


అసలు దేవతాదర్శనాలు అంటే ఏమిటి?మనకు సంబంధించని, ఎంతో అతీతమైన స్పందనా భూమికలలో (higher vibratory levels) ఉన్న శక్తులు రూపం ధరించి మన మనోభూమికకు దిగి వచ్చి కనిపించటమే.ఇలా జరిగినప్పుడు ఆయా స్పందనలను (vibrations) తట్టుకోగల శక్తి సాధకునికి ఉండాలి.అది లేనపుడు ఏమి జరుగుతుంది?


ఒక ఉదాహరణతో చెప్తాను.ఒక చిన్నబల్బులోకి లక్ష వోల్టుల కరెంటు ప్రవహిస్తే ఏమి జరుగుతుంది?బల్బు పేలిపోతుంది.అలాగే ఇటువంటి దర్శనాలు తట్టుకునే శక్తి లేకుంటే బ్రెయిన్ సర్క్యూట్స్ ఫెయిల్ అయి పిచ్చెక్కుతుంది.లేదా ఆ షాక్ తట్టుకోలేక గుండె ఆగిపోతుంది.కాబట్టి దేవతాదర్శనాలు అందులోనూ కాళీమాత వంటి శక్తి దర్శనాలు అంత త్వరగా కలుగవు.దానికి ఆయా దేవతల అనుగ్రహమే కారణం.వారు కనిపించలేక కాదు.కనిపిస్తే సాధకుడు తట్టుకోలేడని వారికి తెలుసు.అందుకే సాధకునికి తపస్సు ద్వారా తగిన పరిపక్వత వచ్చినపుడే వారి దర్శనం కలుగుతుంది.


ఇంకొకసారి వివేకానందస్వామికి ధ్యానంలో బ్రహ్మాండమైన త్రికోణాకారం బంగారురంగులో వెలుగుతూ కనిపించింది.ఈ విషయాన్ని ఆయన శ్రీరామకృష్ణునికి చెబితే ఆయన సంతోషించి 'నీకు ఈరోజు బ్రహ్మయోని దర్శనం కలిగింది.నేను తంత్రసాధనలు చేసేరోజులలో ఆదర్శనం నాకూ కలిగింది.కాని దానినుంచి అనుక్షణం అనేక బ్రహ్మాండాలు లోకాలు జన్మిస్తున్నట్లు కూడా నేను చూచాను'.అని చెబుతారు. ఆ దర్శనం వివేకానందునికి కలుగలేదు. అంటే అనేక గెలాక్సీలను అనుక్షణం సృష్టి చేస్తున్న కాళీశక్తిని (source of creative power) వారు దర్శించారు. అంతే కాదు, శ్రీ రామకృష్ణునికి కలిగిన దర్శనంలో ఆ ఆద్యాశక్తి వచ్చి తనలోనే కలిసిపోయినట్లు,తానే ఆశక్తిని అన్న అనుభూతి ఆయనకు కలిగింది.


కాళీమాతకు కుండలినీశక్తికి సంబంధం ఉంది.ఏలాగంటే,ఆద్యాశక్తియే ప్రతి మనిషిలోనూ కుండలినీ రూపంలో నిద్రాణస్థితిలో ఉంటుంది. సూక్ష్మభూమికలను చూడగలిగే అంటే ఫీల్ అవగలిగే శక్తిలేక పోవటమే "నిద్రాణస్థితి" అంటే. కాళీమంత్రసాధకులకు కుండలినీ జాగరణ దానంతట అదే సులభంగా జరుగుతుంది. కాళీమంత్రం అద్భుతమైన క్రియాశక్తిని మనిషిలో మేల్కొలుపుతుంది. నిద్రాణంలో ఉన్న కుండలినీశక్తిని కూడా అదే సులభంగా మేల్కొల్పుతుంది.


కాళీమాత మొల చుట్టూ మానవఖండిత కరములు చుట్టుకొని ఉంటుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు వ్రాసినట్లు మన దేవీదేవతల చిత్రాలు అన్నీ గూడార్ధసంకేతాలు.ఆచిత్రాల వెనుక రహస్యమైన అర్థాలు దాగి ఉంటాయి.దీని అర్థం ఇప్పుడు వివరిస్తాను. మనుషులు పని చేసేది చేతులతోనే. చెయ్యి లేనపుడు మానవుడు ఏపనీ చెయ్యలేడు.అనగా క్రియాశక్తికి సంకేతం మానవుని చెయ్యి. ప్రపంచంలోని అందరు మానవుల చేతుల ద్వారా పని చేయిస్తూ తాను మాత్రం కనపడకుండా దాగిఉన్న శక్తి కాళిమాత.


ఇంకొక గూడార్థం.మానవుడు పూర్తిగా క్రియాకలాపాలు మాని, అనగా తన స్వంత ప్రయత్నాలు మానేయడమే తెగిపోయిన చేతికి సూచన.అంటే రమణమహర్షివలె పూర్తిగా భగవంతుని పైన ఆధారపడి,కర్మను పూర్తిగా విసర్జించినవాడే జగన్మాత ఒడిలోకి చేరుకోగలడు.వేదం కూడా ఇదే చెబుతున్నది. నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకేనమృతత్వ మానశు-- మనిషి కర్మవల్ల కాదు, సంతానంవల్ల కాదు, ధనంవల్ల కాదు-- ఒక్క త్యాగంవల్ల మాత్రమె అమృతత్వాన్ని పొందగలడు.ఈవిధంగా,తెగిన చేతులు కర్మత్యాగాన్ని సూచిస్తున్నాయి.కర్మత్యాగియే మాత ఒడికి చేరుకోగలడు.ఇట్టి కర్మత్యాగం అందరికీ సాధ్యం కాదు అని అంటారా? సాధ్యంకాదు కనుకనే కాళీమాత దర్శనం కూడా అందరికీ సాధ్యం కాదు.


మాత మెడలో పుర్రెలదండ ఉంటుంది. దీని అర్థం తెలుసుకుందాం. ఈ పుర్రెలు తంత్రశాస్త్రం ప్రకారం ఏభై ఉండాలి. తంత్రవిజ్ఞానం ప్రకారం ఇవి సంసృతంలోని ఏభై అక్షరాలు. ఈ పుర్రెలదండను వర్ణమాల అంటారు. 16 అచ్చులు 34 హల్లులు కలిపి మొత్తం 50 అక్షరములే ఈ పుర్రెలు.అక్షరములు అనే మాటలో అద్భుత అర్థం ఉంది. క్షరము లేనివి అనగా నాశనము లేనివి అక్షరములు.మనుషులు పోవచ్చు. ప్రపంచం నాశనం కావచ్చు.కాని శబ్దం మిగిలే ఉంటుంది. అక్షరములు శబ్ద రూపములు.కనుక వాటికి నాశనం లేదు.ఈ సందర్భంలో వాగర్థా వివ సంపృక్తౌ శ్లోకం గుర్తుకు వస్తున్నది. వాక్కు దాని అర్థమువలె పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అంటాడు కాళిదాసు.అనగా శబ్దం దాని అర్థంవలె ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నారని అర్థం.


పుర్రెలు శాశ్వతత్వానికి సూచన.ఎందుకని?మనిషి పోయినా పుర్రెలు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటాయి.మనిషి శరీరంలో పుర్రె ముఖ్య భాగం. ఆలోచనను ఇచ్చే మెదడు అందులోనే ఉంది. అలాగే శబ్దాలు పుర్రెలవలె శాశ్వతమైనవి, స్వచ్చమైనవి. మనుషుల తలరాతలన్నీ వాటిలో ఉన్నాయి.కనుక మాత వాటిని మెడలో ధరిస్తుంది.ఆమె అకారాది క్షకారాంతమయి.వర్ణమాల అనే తంత్రగ్రంధాన్ని చదివి ప్రేరితుడై sir John woodroffe(Arthur Avalon) ఒక అద్భుత గ్రంథం వ్రాసాడు. దాని పేరు The Garland of Letters. అందులో ఈ వివరాలన్నింటినీ తంత్ర శాస్త్రం నుంచి సేకరించి వ్రాశాడు.


ఈ పుర్రెలదండలో ఇంకొక అద్భుత అర్థం దాగి ఉంది.ఈ ఏభై అక్షరాలు షట్ చక్రాలలోని ఏభైదళాలలో ఉంటాయి.కుండలినీ సాధన చేసేవారికి ఇవి సుపరిచితాలు.మూలాధార పద్మం=4 దళములు. స్వాదిష్టాన పద్మం=6 దళములు. మణిపూరక పద్మం= 10 దళములు, అనాహత పద్మం=12 దళములు, విశుద్ధ పద్మం= 16 దళములు చివరిదైన ఆజ్ఞాపద్మం=2 దళములు అన్నీ కలిపి 50 దళములలో ఈ ఏభై అక్షరాలు వైబ్రేషన్లుగా ఉంటాయి.సమస్త మంత్రాలు ఈ ఏభై అక్షరాల వివిధ సమాహారములే.కనుక మాత సర్వ మంత్రాత్మిక. సర్వ మంత్రమయి. సర్వ మంత్ర స్వరూపిణి.


ఈ అక్షరబీజముల మంత్రజపంతో కుండలినీ సాధన చెయ్యటాన్ని రహొయాగం అంటారు.ఇది శ్రీ విద్యోపాసనలో అంతర్యాగ విధానం. అంటే బాహ్యంగా చేసే యాగంవంటిదే లోపల్లోపల చేసే అంతర్యాగ క్రమం.దీనిని చేసేవారిని గుప్తయోగులు/యోగినులు అంటారు.అంటే వీరు సాధనచేసే విధానం బయటకు కనిపించదు.దీనిని వివరిస్తూ లలితాసహస్రనామం"రహో యాగ క్రమారాద్యా రహస్తర్పణ తర్పితా" రహోయాగక్రమంలో ఆరాధించబడేదానవు,రహస్సు అనబడే తర్పణముతో తడిసిన దానవు అయిన నీకు ప్రణామము- అంటూ మాతను ప్రార్ధిస్తుంది.నా గురువుల వద్ద ఇటువంటి రహస్యాలు అనేకం నేర్చుకునే అదృష్టాన్ని మాత నాకు ప్రసాదించింది.


జ్యోతిషవిజ్ఞానంలో శాక్తేయ పరిహారాలలో శనిభగవానుని పీడలకు కాళీ ఉపాసన చక్కని ఉపాయం.కారణమేమంటే శని భగవానుడు యమునికి సంకేతం.యముడు కాలస్వరూపం.కాళిమాత కాలమునే సంహరించగలదు. కనుక శనిదశలో వచ్చే బాధలకు, ఏలినాటి శని మొదలైన గోచారబాధలకు కాళీ ఉపాసన శ్రేష్టం.కాని దీనికి ముఖ్యంగా నియమనిష్టలతో కూడిన జీవితం, అహంకారంలేని జీవితం గడపవలసి ఉంటుంది.అపుడే మాత అనుగ్రహం త్వరగా కలుగుతుంది.నియమం తప్పితే ఫలితాలు దారుణంగా ఉంటాయి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List