మహారాష్ట్రలోని కొల్హాపూర్ పంచగంగ నది ఒడ్డున వున్నది. ఇది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవది. ఇక్కడ అమ్మవారి నయనాలు పడ్డాయంటారు. స్కాంద పురాణం, దేవీ భాగవతాలలోఈ క్షేత్రాన్ని కరవీర నగరమని, దేవిని కరవీర మహలక్ష్మి అని ప్రస్తుతించారు. పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రమో, శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఇది అవిముక్త క్షేత్రం. వారీ క్షేత్రాన్ని ఎప్పుడూ విడవకుండా వుంటారు.
ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు, మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది. అందుకే ఆవిడ కరవీర మహాలక్ష్మి అయింది అంటారు. భృగు మహర్షి చేసిన అవమానాన్ని తట్టుకోలేని మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్‌లో వెలిశారని ఒక కధ. శంకరాచార్యులవారు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ శ్రీ చక్రాన్ని స్ధాపించారు. తర్వాత విద్యాశంకర భారతి ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని గుర్తించి ఇక్కడ ఒక మఠం నిర్మించారు. దత్తాత్రేయుడు ప్రతి రోజూ మధ్యాహ్నం ఇక్కడ భిక్ష చేస్తారని ప్రతీతి. దానికి చిహ్నంగా ఇక్కడ ఆయనకి ఉపాలయం వున్నది.
అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట.
శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది. ఈ నగరాన్ని కోల్‌పూర్ అని కోల్‌గిరి అని, కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే ‘లోయ’అని, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది
స్థల పురాణం: -
ఒకప్పుడు ఈ నగరం పద్మావతి పూరాన్ని కొల అనే రాక్షసుడి పాలించేవడు. అతను తపస్సు కోసం వెళ్ళినప్పుడు, సుకేసి అనే మరొక రాక్షసుడు ఈ నగరాన్ని ఆక్రమించాడు. తపస్సు పూర్తయిన తరువాత కోలాసురుడు బ్రహ్మ నుండి అనేక వరాలు పొంది, అతని రాజధాని తిరిగి వచ్చాడు. అతను వెంటనే సుకేసిని ఓడించాడు అతని రాజ్యాన్ని పొందాడు. అతను తన కుమారుడు కరవీరుడిని ఈ నగరానికి రాజుని చేశాడు.
కానీ తరువాతి కాలములో జరిగిన యుద్ధంలో శివుడు చేత ఆ కరవీరుడు సంహరించబడతాడు. ఆ సమయంలో అతను శివ భగవానుడు నుండి ఒక వరం పొందుతాడు. ఆ వరం ప్రకారము ఈ నగరం కరవీరపురము అని పిలువబడుతుంది. పుత్రుని మరణము తో ఆగ్రహించిన కొలుడు దేవతలకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అతను మహాలక్ష్మిదేవీ కోసం ఘోర తపస్సు చేసి ఆమె 100 ఏళ్ళకు నగరంలోకి ప్రవేశించకూడదని వరము కోరుకున్నాడు. దానికి ఆమె అంగీకరించింది, ఆ తరువాత కొలుడు దేవతలకు చాలా ఇబ్బందులు సృష్టించాడు మరియు వారి స్వర్గాను కూడా ఆక్రమించాడు.
దేవతలుమహాలక్ష్మి దేవీ ని ప్రార్థించగా, ఆమె 100 సంవత్సరముల పూర్తి కావడానికి వేచి ఉండమని చెప్పింది. 100 సంవత్సరాల ముగిసిన తరువాత, ఆమె కరవీరా పురాకు వచ్చి యుద్ధంలో కొల్హాను ఓడించింది. అతను తన పొరపాటును గ్రహించి, ఆమెను ప్రశంసిస్తూ, ఆమె నుండి మూడు వరాలు పొందాడు. మొదటిది ఈ నగరం పేరు కొల్హా పేరు నుండి కొల్హాపూర్ గా మారాలి అని, రెండోది శాశ్వతంగా ఈ స్థలంలో అమ్మ నివసించాలనీ , ఈ స్థలం సిద్ద క్షేత్రము కావాలని మూడవ వరము కోరాడు. ఈ విధంగా కొల్హాపూర్ శక్తిపీఠం అయ్యింది.
గర్భగుడిలో అమ్మవారి విగ్రహం సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి దేవి ఉంటుంది. చతుర్భుజి. నాలుగు చేతులలో పండు, గద, డాలు, పానపాత్ర ధరించి వుంటుంది మూడడుగుల ఎత్తున్న మూర్తి, అనేక ఆభరణాలతో సుసజ్జిత. చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక సింహవాహనము కనబడుతుంది. మూలవిరాట్ పడమటి ముఖంగా వుంటుంది. సంవత్సరానికి 2, 3 సార్లు 3 రోజులపాటు సూర్యాస్తమయ సమయంలో సూర్యుని కిరణాలు పడమటి దిక్కులోగల చిన్న కిటికీగుండా అమ్మవారి ముఖాన్ని తాకుతాయి. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. గర్భగుడి గోడపై శ్రీచక్రం వుండటం ఇక్కడ ప్రత్యేకం
అభివృధ్ధి చెందిన ఈ మందిరం విశాల ప్రాంగణంలో హేమాడ్ పంత్ శైలిలో, శిల్పకళానైపుణ్యంతో నిర్మింపబడింది. నాలుగు దిక్కులా ముఖద్వారాలు వున్నాయి. ఆలయం 5 గోపురాలకింద వుంటుంది. మధ్యలో ఒక గోపురం, నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు. తూర్పు గోపురం కింద మహలక్ష్మి, మధ్య కుమార మండపం, పడమర గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి, మహా సరస్వతి కొలువుతీరి వున్నారు. ఉపాలయాలలో వెంకటేశ్వరస్వామి, నవగ్రహాలు, రాధాకృష్ణ, కాలభైరవ, వినాయకుడు, సింహవాహిని, తుల్జాభవాని వగైరా అనేక దేవీ దేవతలున్నారు.
No comments:
Post a Comment