కుబేరుడు ఎవరు? ఆయన్ని ఎందుకు పూజించాలి.? ~ దైవదర్శనం

కుబేరుడు ఎవరు? ఆయన్ని ఎందుకు పూజించాలి.?


ఈ విశ్వంలో సంపద ఏదైనా ... అది ఏ రూపంలో వున్నా దానికి అధిపతి కుబేరుడే. పద్మ ... మహాపద్మ ... శంఖ ... మకర ... కచ్చప ... ముకుంద ... కుంద ... నీల ... వర్చస అనే 'నవ నిధులు' ఆయన అధీనంలో వుంటాయి.

సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అర్చావతారమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కూడా తన వివాహానికి అవసరమైన ధనాన్ని ఈయన నుంచే అప్పుగా తీసుకున్నాడు. అలాంటి కుబేరుడి అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? ఇంతకు కుబేరుడు ఎవరు? ఆయన్న ఎందుకు పూజించాలి?

కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఈయన మేరుపర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్టతో తపమాచరించుకునేవాడు.

అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు, ఋషికన్యలు, రాజర్షికన్యలు తదితరులు విహారం కోసం వచ్చేవారు. పులస్త్యుడికి వీరివల్ల తరచూ తపోభంగం కలుగుతుండేది. అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దనీ, ఒకవేళ ఎవరైనా వచ్చి, తనని చూసిన యెడల గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు.

ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి, పులస్త్యుడుని చూడటం తటస్థించింది. వెంటనే గర్భం దాల్చింది. భయాందోళనలతో, ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి, తలవాల్చి నిలుచుంది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది గమనించి ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను స్వీకరించాల్సిందిగా కోరాడు. అందుకు ఆయన అంగీకరించాడు. వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు. విశ్రవసుడి కొడుకు కుబేరుడు.

కుమారులైన మణిగ్రీవ - నలకూబరులే కాకుండా, అనేకమంది దేవతలు ఆయనను పూజిస్తుంటారు. ఇంతటి తరగని సంపదను తన అధీనంలో పెట్టుకుని, తనని పూజించిన వారిని మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడని అంటారు. ఈ కారణంగానే చాలామంది ఆయనను 'దీపావళి' రోజున పూజిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో ...అంకిత భావంతో కుబేరుడి మనసు గెలుచుకుంటే, అనతికాలంలోనే అపర కుబేరుల జాబితాలో చేరిపోవడం ఖాయమని చెప్పొచ్చు.

కుబేరుడి తల్లిదండ్రులు విశ్రావసుడు - ఇలవిల. ఈ కారణంగానే కుబేరుడిని 'వైశ్రవణుడు' అనీ ... ఐల్వల్యుడు అని పిలుస్తుంటారు. తన కఠోరమైన తపస్సుచే బ్రహ్మదేవుడిని మెప్పించి, ఆయన అనుగ్రహంతో అష్టదిక్పాలక పదవిని ... నవనిధులకు అధిపతి స్థానాన్ని సంపాదించాడు. కుబేరుడు ఒక చేతిలో గదను కలిగివుండి ... మరొక చేతితో ధనాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తాడు. ఆయన చుట్టుపక్కల నవనిధుల రాశులు దర్శనమిస్తుంటాయి.
కుబేరుడు ధనాధిదేవత. శ్రీ వేంకటేశ్వరుడు వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం.

సిరిసంపదలకు , నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, భూతేశుడు, గుహ్యకాధిపతి, కిన్నెరరాజు, మయరాజు, నరరాజు. అథర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు కూడా !కుబేరుడు అనగా అవలక్షణమయిన (లేదా అవలక్షనాలున్న) శరీరము కలవాడు (బేరము అంటే శరీరం ) అని అర్ధం.

పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరుగుజ్జులా), పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్లు, ఒకే కన్ను , ఎనిమిది పళ్లతో ఉంటాడని మన పురాణాలో చెప్పబడింది.
శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, కుబేరుడు రత్నగుర్భుడు. బంగారు వస్త్రాలతో, మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు.

ఈయన ముఖం ఎడమవైపుకి వాలినట్టు ఉంటుందని, మీసం గడ్డం కలిగి ఉంటాడనీ, దంతాల బయటకి వచ్చి (వినాయకుని దంతాల వలె)ఉంటాయని ఉంది.
అదే విదంగా శ్రీ శివ, మత్స్య , స్కాంద పురాణాల ప్రకారం, కుబేరుని శరీరరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని ఉంది.

ఎప్పుడు చేతిలో డబ్బులు నిలవడానికి ఈ కుబేర యంత్రాన్ని ఒక కాగితం పైన దానిమ్మ పుల్లతో  గోరోజనం రసంతో రాసికాని,రాగి రేకు పైన చేక్కిన్చుకొని కాని purse లో పెట్టుకోవాలి.

ఓం యక్షాయ కుభేరయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యసమృద్ధిమేం దేహితాపయ స్వాహా (౧౦౮ సార్లు) ౯౦ రోజులు నియమనిష్టలతో బ్రహ్మచర్యంతో చెయ్యాలి.

ఇంట్లో దానానికి లోటురాకుండా ఉండడానికి ,వ్యాపారంలో దిన దినాభి వృద్దికి కుబేర యంత్రాన్ని ప్రతిష్టించుకొని పూజించాలి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List