*మంత్రం:* ఐం హ్రీం క్లీం
*అవతారాలు:* సతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి
సాక్షాత్ పరమశివుని స్త్రీ రూపమే శక్తి
ఆది పరాశక్తి , సర్వశక్తిమంతురాలైన దేవత. పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆది పరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది. దేవి భాగవత పురాణములో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు మరియు వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది.
శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి. ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ (పురుషుడు) మరియు ప్రకృతి శక్తికి జన్మించిన అంశములు. *దుర్గా దేవి ఆది పరాశక్తి యొక్క సమీప రూపాంతరము.* ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి, సౌందర్యానికి దేవత అయిన దుర్గా దేవి. దుర్గా దేవి సాత్విక, రాజసిక మరియు తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము. అయితే, అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిదీ, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము. ఆదిమ శక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకి కూడా తనే మూలము. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే సంపూర్ణం. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది.
ఆది పరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన. భూభాగం పై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించిననూ పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది.
సృష్టికే కాక, సకల మార్పులకీ కూడా శక్తే మూలం. శక్తే దైవత్వానికి ఉనికి. శక్తే విముక్తి. మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైన కుండలిని శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఆధారం అవసరం లేకుండా, స్వతంత్రంగా ఉండటంలోనూ, సమస్త సృష్టిపై ఆధారితమై ఉండటంలోనూ శక్తే కీలకం.
శక్తి ఆరాధన లోనూ శైవము లోనూ ఆది పరాశక్తి సర్వశక్తిమంతురాలిగా పూజించబడుతోంది. సాక్షాత్ పరమశివుడి స్త్రీ రూపమే ఆది పరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీ దేవిగా గుర్తింపబడుతోంది.
ఆది పరాశక్తి అనగా నిత్య మరియు అపరిమిత శక్తి. ఇది ఈ సృష్టిని మించిన శక్తి. యావత్ సృష్టి యొక్క పుట్టుకకి మరియు వినాశనానికి కారకమైన క్రియాత్మక అదృశ్య శక్తి.
శ్వేతాశ్వతరోపనిషత్తు - చతుర్థాధ్యాయం - మొదటి పద్యం ఆమె గూర్చి ఈ క్రింది విధంగా వర్ణించబడింది.
*య ఏకోవర్ణో బహుధా శక్తియోగాద్*
*వర్ణననేకాన్నిహితార్థో దధాతి విచైతి చాంతే విశ్వమాదౌ చ దేవ*
*స నో బుద్ధ్యా శుభయా సంయునక్తు*
*తాత్పర్యం*
రంగు లేనిది బహువిధ శక్తి గలది, సృష్టిని అంతం చేసే ప్రక్రియలో అనేక రంగులని సృష్టించేది, అన్నీ ఉద్భవించేది తన నుండే, అన్నీ కలసిపోయేది తన లోనే, తనే మనకి శుభాన్ని, అవగాహనని కలిగిస్తుంది.
నిర్గుణ శక్తి యొక్క సగుణ స్వరూపం పార్వతీ దేవి
నిర్గుణ శక్తి యొక్క సగుణ స్వరూపం పార్వతీ దేవి
పార్వతీ దేవిగా అవతరించే ముందు ఆది పరాశక్తి హిమాలయ పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనని తాను పరిచయం చేసుకొని అతనికి దివ్యోపదేశము చేసి అనంత జ్ఞానాన్ని ప్రసాదించినది. వేదములలోని పదములతో పరాశక్తి అయిన తనకి ఆద్యంతాలు లేవని వివరించినది. విశ్వంలో తానే అఖండ సత్యమని తెలిపినది. ఈ విశ్వమంతయు తన సృష్టియేనని, తనే పరబ్రహ్మ స్వరూపము అని రహస్యము తెలిపినది. జయం, విజయం తానేనని, వాటి రూపాంతరాలు కూడా తానేనన్న సత్యము తెలిపినది. బ్రహ్మ తన స్పష్టమైన రూపాంతరమేనని, విష్ణువు తన అస్పష్టమైన రూపాంతరమని, శివుడు తన అతిశయ రూపాంతరమని తెలిపినది. ఎవరూ కని, విని, ఎరుగని తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకి చూపినది. సత్యలోకాన్ని తన నుదుట, విశ్వాన్ని తన కురులలో, సూర్యచంద్రులను తన కళ్ళుగా, నాలుగు దిక్కులను తన కర్ణాలుగా, వేదాలనే తన పలుకులుగా, మృత్యువు, అనురాగం మరియు భావోద్రేకాలను తన దంతాలుగా, మాయను తన చిరునవ్వుగా చూపినది.
సప్తమాతృకలు అయిన బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి మరియు చాముండిలు బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, స్కందుడు, వరాహుడు మరియు నరసింహు ల సహధర్మచారిణులు మరియు శక్తిస్వరూపాలు. అసురులతో శక్తి చేసిన యుద్ధానికి సప్తమాతృకలు సహాయసహకారాలనందించారు.
శక్తి ఆరాధన మినహాయించి "ఆది శక్తి" ఎక్కడా ఆ పేరుతో సంబోధించబడలేదు. కానీ, పరోక్షంగా అన్ని పురాణాలు శక్తినే మహోన్నతంగా ఆరాధిస్తాయి.
వైష్ణవ పురాణాలలో ఆది శక్తి వైష్ణవులు ప్రత్యేకంగా శక్తిని ఆరాధించకపోయిననూ మాయని, యోగమాయని నమ్ముతారు. రాధని మూల ప్రకృతిగా ఆరాధిస్తారు[. మహాలక్ష్మి రాధ యొక్క వైశాల్య రూపమని భావించటం వలన విష్ణుపురాణం మరియు భాగవత పురాణం లలో కూడా ఎక్కడా ఆది శక్తి ప్రస్తావనలు లేవు.
బ్రహ్మ పురాణం మాత్రం వీటికి విరుద్ధంగా ఆది పరాశక్తి అనే బీజము తనని తాను పురుషుడు మరియు ప్రకృతిగా విభజించుకొన్నదని తెలుపుతుంది. ఆది బీజం కృష్ణుడుకి మరియు కాళికి జన్మనిచ్చినది. తర్వాత కాళి లలితా త్రిపుర సుందరిగా అవతరించి, రెండు బుడగలని సృష్టించినది. మొదటి బుడగ నుండి విష్ణువు అవతరించి బ్రహ్మకి, గౌరికీ జన్మనివ్వగా, గౌరి సతిగా, పార్వతిగా రూపాంతరం చెందినది. రెండవ బుడగ నుండి శివుడు మరియు రాధ అవతరించారు. రాధ తర్వాత లక్ష్మిగా, సరస్వతిగా మరియు గంగగా అవతరించినది.
శివ పురాణంలో శివుని ఎడమ సగభాగం నుండి ఆది పరాశక్తి పరమ ప్రకృతిగా అవతరించినట్లు ఉంది. లింగ పురాణంలో ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమైన పార్వతి యోనిగా, శివుడు లింగంగా అవతరించి వీరి సంగమమే జీవోద్భావన గావించినట్లు తెలుపుతుంది. స్కంద పురాణం మరియు మార్కండేయ పురాణం దుర్గ లేదా చండి సకల జగత్తుకీ ఆది దేవత అనీ, ఈ రూపాంతరమే ఆది శక్తి యొక్క భౌతిక రూపమనీ తెలుపుతున్నవి.
ఆది పరాశక్తి యొక్క రూపాంతరలైన సరస్వతి, లక్ష్మి, పార్వతులతో బ్రహ్మ, విష్ణ్జు, మహేశ్వరులు
ఆది పరాశక్తి యొక్క రూపాంతరలైన సరస్వతి, లక్ష్మి, పార్వతులతో బ్రహ్మ, విష్ణ్జు, మహేశ్వరులు
శ్రీమద్ దేవీ భాగవత పురాణంలో త్రిమూర్తులకు దేవి యొక్క ఆజ్ఞలు మరియు సూచనలు ఇవ్వబడ్డాయి.
శక్తి, తన గురించి - *"నేను ఆది పరాశక్తిని. భువనేశ్వరిని. సకల చరాచర సృష్టి నా స్వంతం. అఖండ సత్యాన్ని. స్త్రీ రూపంలో నేను చలనశీల శక్తిని, పురుష రూపంలో అచలన శక్తిని. నా యొక్క శక్తితో ఈ సృష్టిని మీ ముగ్గురు పాలిస్తారు. అఖండ సత్యం యొక్క పురుష రూపాలు మీరు ముగ్గురు కాగా, దాని స్త్రీ రూపాన్ని నేనే. నేను రూపరహితం. సర్వానికి అతీతం. అన్ని దైవ శక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. నేను శాశ్వతమైన, అపరిమిత శక్తిని."
బ్రహ్మతో - *"ఓ బ్రహ్మా! ఈ విశ్వానికి సృష్టికర్త నీవే. జ్ఞానానికి, సంగీతానికి గుర్తింపబడే నా రూపాంతరము శారదా దేవి (సరస్వతి) నీ భార్య. నీ భార్య తో కలసి ఈ విశ్వాన్ని సృష్టింపుము."*
విష్ణువుతో - *"ఓ నారాయణా! నీవు ఎదురులేని, మరణం లేని ఆత్మవి. నీకు రూపం లేకున్ననూ రూపాన్ని పొందుతావు. భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ నీవే అధిపతివి. ఈ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత నీదే. ఈ సృష్టిలో జీవాలని రక్షించటానికి నీవు వివిధ రూపాంతరాలని చెందుతావు. నీవు బ్రహ్మని సృష్టించావు. బ్రహ్మ ఇతర దేవదేవతలని సృష్టిస్తాడు. నా యొక్క అంతర్భాగమైన శక్తి అయిన మహాకాళి నీ యొక్క యోగ నిద్ర నుండి అవతరించినది. నీవే పరమాత్మవి. వెలుగుకి ప్రతిరూపమైన, నా మరొక రూపాంతరము శ్రీ నీ భార్య. జీవం ఉద్భవించే సమయానికి ఈ విశ్వాన్ని పరిశీలించే, పరిరక్షించే బాధ్యతలని నిర్వర్తించే విష్ణువు యొక్క రూపాన్ని నీవు పొందుతావు."
శివునితో - *"ఓ రుద్రా! మూర్తీభవించిన నీ రూపం, కాలగతికి చిహ్నం. నీవు రూపంలో లేనపుడు కాలం స్థంభిస్తుంది. నా యొక్క శక్తితో నీలో చలనము కలుగుతుంది. ఈ శక్తి ద్వారానే విశ్వ వినాశనానికి, దాని పునర్నిర్మాణానికి కారకుడవు అవుతావు. మహాశక్తిని అయిన నేనే నీ భార్యను. లక్ష్మీ సరస్వతులు కేవలం నాలోని భాగాలు. నా రూపాంతరాలు. నా పరిపూర్ణ రూపం మహా శక్తి. నీ ధ్యాన శక్తి వలన నా యొక్క అన్ని రూపాంతరాలని నీవు మించిపోతావు. అప్పుడే నేను నీ ఎడమ భాగం నుండి నేను అవతరిస్తాను.
శాక్త పురాణాలలో ఆది శక్తి దేవీ భాగవత పురాణం ప్రకారం బీజ మంత్రమైన "క్లీం"ని జపిస్తూ శివుడు ఆదిశక్తి పై దృష్టి కేంద్రీకరించి వేల యేళ్ళ కొలదీ ధ్యానం చేసాడు. శివుడి ఎడమ భాగం నుండి సిద్ధిధాత్రిగా రూపాంతరం చెంది శివుడికి ఆది శక్తి ప్రత్యక్షమైనది. అందానికి, శక్తికీ దేవత అయిన పార్వతి ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమని (మానవ రూపం) తెలుపబడింది. సత్వ, రజో, తమో గుణములు కలిగిన పార్వతీ దేవి, ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము.
ఆ అమ్మ దేవతల ఉపయోగార్థం మాయని సృష్టించి చేయవలసినవి, చేయకూడనివి నిర్దేశించి వారిని దైవం వైపు నడిపిస్తుంది.
మహావిష్ణువు మధు-కైటభులనే అసుర ద్వయాన్ని సంహరించేందుకు సహకరించి యోగమాయ లోకరక్షకురాలైనది. అంతేగాక, మహావిష్ణువుకి యోగ నిద్రని (ధ్యానాన్ని) ప్రసాదించినది. ఈ ధ్యానమే యోగులకు, మునులకు, భక్తులకు దైవములో ఐక్యము చేయటానికి నేటికీ ఉపయోగపడుతుంది.
*మహామాయ*
భ్ర్రాంతిని సమూలంగా నాశనం చేసే అమ్మవారి శక్తి. మాయని సృష్టిస్తుంది, ఛేదిస్తుంది. యోగమాయచే నియంత్రించబడేది. శారీరక శక్తి, ఆరోగ్యము మరియు సాత్విక లక్షణాలని పెంపొందించుకోవటానికి, క్రోధాన్ని, దురాశ, అహంకారాలని తగ్గించుకోవటానికి శక్తినిస్తుంది.
*మాయ*
సన్మార్గము నుండి ప్రక్కత్రోవ పట్టించి, భగవంతుని వద్దకు కాకుండా భ్రాంతి వైపు నడిపింప జేసేది. మహామాయ చే నియంత్రించబడేది. క్రోధాన్ని, దురాశని, అహంకారాలని పెంపొందించేది. మాయ యొక్క ప్రభావం కలియుగంలో అత్యధికంగా ఉండునట్లు తెలుపబడింది.
No comments:
Post a Comment