కృష్ణుడు నెమలి పింఛం ధరించడం లో అంతరార్ధం ఏమిటి? ~ దైవదర్శనం

కృష్ణుడు నెమలి పింఛం ధరించడం లో అంతరార్ధం ఏమిటి?



కొందరు పెద్దలు కవి హృదయంతో నెమలి లైంగిక కార్యక్రమంలో పాల్గొనకుండా సంతానం పొందే ఏకైక పక్షి అని చెప్పిన విషయాన్ని చిలవలు పలవలు చేసి మొత్తానికి వేదాన్నే తిరస్కరించాలి అని కుసంస్కారులు ప్రచారం ప్రారంభించారు. అసలు కృష్ణ తత్త్వమే తప్పని తీర్మానించేసి చంకలు గుద్దుకుంటున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి.

1. ఆయన ధరించినది నెమలిని కాదు నెమలి పింఛాన్ని. నెమలి పించ్హానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని గుర్తు చేసేదే శ్రీ కృష్ణ తత్త్వం
2. నెమలి పింఛానికి ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనబడే అన్ని రంగుల సప్తవర్ణ సమాహారం అందులో ఉంటాయి. ఈ లోకమంతా ఆకాశం ఆవరింపబడి ఉంటుంది. పగలు నీలం రంగులోను, రాత్రుళ్ళు శ్యామ వర్ణంలోను కనబడుతుంది. సూర్యోదయానికి ఒక రంగు, అస్త్యమయానికి మరొక రంగు, మండుటెండలో మరొక రంగు కనబడుతుంది. అన్ని రంగులు ఒక సమాహారంగా కనబడేది నెమలి పించంలోనే. కాలానికి ప్రతీక ఆ నెమలి పించం.
3. కృష్ణపక్షం, శుక్ల పక్షం పరంగా కాలమంతా ఈ రంగుల మయమే. మనలో ఉన్న మంచి, చెడు అన్ని రకాల ఆలోచనా తరంగాలు ఈ ఏడు రంగుల ద్వారానే ప్రకటితంఅవుతాయి. ఆ పించం మాయకు ప్రతీక
4. ప్రకృతికి మరొక ప్రతీక ఆ నెమలిపించం
5. ఒక నెమలి తాను బ్రతికినన్ని నాళ్ళు ఆ మయూరపించంలో కనబడినా వదిలివేసిన ఆ జీవం లేని నెమలి పించం ఎన్నాళ్ళో మనం దాచుకుని ఉంచుకుంటాం. అలాగే ప్రాణంతో మానుష శరీరంతో నడయాడినా ఎప్పటికీ మాసిపోని తరుగుదల లేని తత్త్వం శ్రీ కృష్ణ తత్త్వం అని తెలుపుతుంది ఆ పింఛం.
6. నెమలి పింఛాన్ని ఒకసారి చేతితో రుద్ది వదిలితే ఒక్కసారి అది రెండింతలు అయి జీవమున్న దానిలా విచ్చుకుంటుంది. దానికి కారణం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. మనసు దేనిపై రమిస్తే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతుందో తెలుపుతుంది పించం.
7. నెమలి అందానికి ప్రతీక. దానికి కారణం ఆ పించం. పుంసాం మోహన రూపాయ ఆయన. అందానికే ప్రతీక అయిన మన్మధుని తండ్రి. కోటి మన్మధాకారుడు ఆయన. ఆ పించం ఆయన అందానికి ఒక మచ్చుతునక
8. నెమలి పించం కన్ను జ్ఞానానికి ప్రతీక
9. నేటి శాస్త్రవేత్తలు ఆ పించానికి అన్ని అద్భుతమైన రంగులు ఎలా వచ్చాయి అన్న విషయం పరిశోధించగా వ్యక్తమైన వివరాలు చూసి ఆశ్చర్యపడ్డారు. ఆ రంగుల అల్లిక, ఆ మెరుపు కు కారణం 2-dimensional క్రిస్టల్ మాదిరి అమరిక. వాటి నడుమ కొంత కొంత తేడాల వల్ల రంగులు పరావర్తనం చెంది మంచి అందంగా అలా కనబడతాయి. ఒక పద్ధతి ప్రకారం మెలనిన్ రాడ్స్, కేరాటిన్ అనే పదార్ధాలు అమరి ఉంటాయి. ఆ అమరిక వలన ఆ పించం పొడవునా రకరకాల రంగులతో, రకరకాల మెరుపుతో అందంగా కనబడుతుంది. ఇదే విధంగా ఆయన సృష్టిలో రకరకాల మనుషులు చూడడానికి రెండు కళ్ళు, రెండు చేతులతో ఒకే రకంగా కనబడ్డా వారి వారి కర్మానుసారంగా వారి బుద్ధ్యానుసారంగా వేరే వేరేగా ప్రకటితం అవుతారు. ఆ వివిధ్య వ్యక్తుల సమాహారం ఆయన లోనిదే అని తెలియచేస్తుంది ఆ పింఛం
10. ఆ పింఛం ఎటువైపు చూసిన ఆ కన్ను, ఆ రంగుల కలయిక అలాగే కనబడుతుంది. తాను అంతరంగంలోను, బయటా అన్ని గమనించగలను అని చెప్పే తత్త్త్వం
11. ఒక మనిషి జీవితంలో చీకటి రోజును (బాధను) చూడవచ్చు, అదే కాంతివంతమైన రంగుల ప్రభను కూడా చూడవచ్చు. అన్నింటిలో సమబుద్ధితో వ్యవహరించమని చెబుతుంది ఆ మయూర పించం.
12. నీలమేఘశ్యాముడైన ఆయన నీలి, కృష్ణ వర్ణం కలిగిన కలిగిన ఆ పించం ధరించడం వలన ఆ అందాన్ని ఇనుమడింపచేస్తుంది అన్న ప్రేమతో అమ్మ అలంకరించిన ఆ పించాన్ని ఆయన దేహమున్నంతవరకు ధరించి ఆవిడ ప్రేమను గౌరవించి చూపించాడు.
13. ఆయన పుట్టిన జ్యోతిష్య కాలానికి (ఆయన కుండలి లో కాలసర్ప దోషం ఉందని దానికి పరిహారార్ధం ఆ నెమలి ఈక పెట్టమని పెద్దలు చెప్పిన మీదట) కొన్ని గ్రహాల అనుకూలతకోసం ఆయన నందాయశోదలు ఆయనకు అలా అలంకరించారు. ఎటువంటి దృష్టి దోషాలున్నా వాటిని హరించే శక్తి కలవి అని నమ్మిక. పుట్టిన నాటి నుండి ఎందరో రాక్షసుల చీకాకులు భరించారు ఆ తల్లిదండ్రులు. తమ కొడుకు కోసం రక్షగా వారికి తెలిసిన పరిహారాలు చేసారు. అందుకోసం ఆయనకు అలంకరించగా వారి మీద పరమ ప్రేమతో వాటిని ఆయన ధరించి వారి ప్రేమను అనుగ్రహించాడు. అసలు గ్రహాలే ఆయన ఆజ్ఞబట్టి నడుస్తాయన్న విషయం వారికి తెలియదు కదా!!

మరొక విషయం. కాల క్రమేణా కొన్ని కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. మన లో అపెండిక్స్ అనే ఒక భాగం ఒకప్పుడు అరుగుదల వ్యవస్థలో చురుకుగా పని చేసేది, నేడు దానిలోకి ఏదైనా దూరితే ఆపరేషన్ చెయ్యవలసి వస్తోంది. రామాయణ కాలంలో వానరాలు వారధిని కట్టేశక్తి కలవి, రాక్షసులతో పోరాడేగలవి, కొన్ని యోజనాల దూరం ఎగరగలిగేవి. నేడు అలా లేవు. ఒకప్పటి కాలంలో అటువంటి నెమళ్ళు ఉండి ఉండవచ్చును. నేడు అవి పునరుత్పత్తి చేసే విధానం మారి ఉండవచ్చు లేదా అప్పటి ఆ రకం నెమళ్ళు అంతరించిపోయి ఉండవచ్చును. వాటికి నేటికి సాపత్యం పెట్టనేల? అయినా ఆ తత్త్వం తెలుసుకోవాలి కానీ కోడిగుడ్డు మీద కాదు కాదు నెమలి ఈక పీకడం అంటే ఇదేనేమో.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List