వేదాంత పాఠం. ~ దైవదర్శనం

వేదాంత పాఠం.


*“విద్యాదదాతి వినయం*
 *వినయాద్యాతి పాత్రతాం*
*పాత్రత్వాత్ ధన మాప్నోతి*
*ధనాద్ధర్మం తత సుఖం  !! “*

విద్య ఎన్నో ఇస్తుంది. విద్య వలన ఏమి రావాలి? విచక్షణా జ్ఞానం, వివేకం, నిత్యానిత్య విచారణ ఇత్యాదులు. సరైన విద్యార్ధికి వీటితో పాటు రావలసిన గుణం వినయం. వినయం లేని విద్య రాణించదు. ఎవడైతే తనకు అన్నీ తెలిసాయి అని అనుకుంటున్నాడో వాడికి ఏమీ తెలియవు అన్నది సుస్పష్టం. తనకు ఏదీ రాదు అని తెలుసుకున్నాడో వాడు సరైన విద్యార్ధి.  విద్య అనంతం. మనకున్న విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే కొన్ని జన్మలైనా సరిపోవు.ఇక్కడ ఎటువంటి విద్య గురించి చెబుతున్నారు. ఏ విద్య తెలుసుకుంటే అన్నీ అవగతం అవుతాయో అటువంటి ఆత్మవిద్య.

మరి వినయం వలన ఏమి వస్తుంది?
వినయం నీకు ఏమి తెలుసో ఏమి తెలియవో చెబుతూ పెద్దల వద్ద వినమ్రత నేర్పుతుంది. అనుభవం ఉన్న పెద్దల వద్ద నాకు తెలుసన్న అహంకారం ప్రదర్శిస్తే నీకు ఎలాగూ తెలుసు కదా అని వదిలేస్తారు, నువ్వు మరి ఏమి నేర్చుకోలేవు. నువ్వు నేర్చుకోవాలి అనుకుంటే ముందు కావలసినది వినయం. ఈ వినయం వలన నీలోని అహంకారం నశించి నువ్వు ఏదైతే తెలుసుకుంటే మరింకేమి తెలుసుకోవక్కర్లేదో అటువంటి విజ్ఞానానికి పాత్రుడవు అవుతావు. పాత్రత అంటే నీకు ఆ జ్ఞానాన్ని అభ్యాసం చేసి, ఆచరణలో పెట్టి సుఖం పొందగలగడానికి తగ్గ అధికారం. పాత్ర శుభ్రంగా లేకపోతే ఆ పాత్రలో పోసిన పాలు విరిగిపోతాయి. అదే ఆ పాత్ర శుభ్రంగా ఉన్న యెడల దానిలో నీకు కావలసినది వండుకోవచ్చు. మనలో ఎన్నో మలినాలు కొన్ని కోట్ల జన్మలనుండి తెచ్చిపెట్టుకున్నాము. ఈ విద్యాజ్ఞానం వలన వినయం వలన నువ్వు పాత్రత సంపాదించుకోగలవు.

పాత్రత వలన ధనం ప్రాప్తిస్తుంది. ఇక్కడ ధనం అంటే కేవలం లౌకికమైన ధనం మాత్రమె కాదు. మనకు ఎన్నో ధనాలు చెప్పబడ్డాయి, స్వర్ణాది ధనాలు, గోధనం, అశ్వధనం, గృహం, సంతానం, ఆధ్యాత్మికం, ఇలా ఎన్నో. వీటిలో ఇక్కడ మనం చర్చిస్తున్నది ఆధ్యాత్మిక ధనం అంటే జ్ఞానం. ఈ జ్ఞానం ఎరుకలోనికి రావడం వలన నీ విద్యకు సార్ధకత ఏర్పడుతుంది. ఎప్పుడూ మనల్ని కూల్చడానికి మాయ కాచుకు కూర్చుని వుంటుంది. అటువంటి మాయనుండి తప్పించగలిగినది ఈ జ్ఞాన ధనం మాత్రమె. ఇటువంటి ధనం నీకు పాత్రత వలన వస్తుంది.

ఈ ధనం నీలోనే దాచుకుని వుంటే అక్కడితే అది ఆగిపోతుంది. మనకు మహర్షులు వారికి తెలిసిన జ్ఞానాన్ని అందరికీ నిస్స్వార్ధంగా పంచి దానం చేసారు కాబట్టే నేడు మనం ఇంతటి గొప్ప వైజ్ఞానిక, వివేక, ఆధ్యాత్మిక జ్ఞాన రాశులకు వారసులం అయ్యాము. నీకు తెలిసిన ఈ జ్ఞానధనాన్ని అందరితో పంచుకుంటే నీకు వచ్చేదే శాశ్వతమైన సుఖము. ఈ ఆత్మసుఖం తెలిసిన జ్ఞానికి అంతా వైకుంఠమే.

నీకు ఇది ప్రత్యక్షంగా కనబడుతోంది, కాబట్టి దీని విధి విధానం నీకు తెలుస్తోంది. ప్రత్యక్షం కానిది అప్రత్యక్షం. మరొకటి పరోక్షం. అంటే నీకు ప్రత్యక్షంగా భౌతికంగా కనబడనిది పరోక్షం అని అన్నావంటే పరోక్షం కానిది అపరోక్షం. అటువంటి అపరోక్షానుభూతి కేవలం అనుభవించిన వారికి మాత్రమె తెలుస్తుంది. ఇది చాలా సూక్ష్మమైన సత్యం. ఎరుకలోనికి వచ్చిన వారికి శాశ్వతానందం.
ఇది మనకు శ్రీ ఆదిశంకరులు అనుగ్రహించి ఇచ్చిన ధనం.

"అపరోక్షానుభూతి"లో ఆచార్య శంకరులు,
ధ్యానంతో మనో లయాన్ని మూడు దశలుగా సాధించవచ్చు నని బోధించారు.

1)శరీరమూ అది చూసే ప్రపంచమూ నేను కాదు అని తెలుసుకుని దేహతాదాత్మ్యన్ని విడవాలి.

2)"ఆత్మనే"  నేనని తెలుసు కుని ఆ భావంలో ధ్యానంలో నిలవాలి.

3)ఆత్మజ్ఞానాన్ని కూడా మరిచి పోయి నిశ్చలంగా చైతన్యంగా నిలిచి పోవాలి.

ఈ లయ యోగాన్ని శూన్య వాదంగా పొరపడకూడదు."అన్నీ" లేవనుకుంటూ శూన్యంలో నిలిచి పోవడమే దీని లక్ష్యంకాదు.

"భగవద్గీత" గానీ,"అష్టావక్రుడు" కానీ,"ఉపనిషద్ బుషులు" కానీ ఈ శూన్యవాదాన్ని బోధించలేదు.

అహంకారం కేంద్రంగా మనస్సు అను నిత్యమూ అనేకత్వాన్ని గుర్తిస్తూ భ్రమపడుతున్నది.

ఈ భ్రమను తొలగించడానికి అద్వైత సత్యాన్ని అర్థం చేసు కుంటూ
 "ఆస్థితిలో" ,
"ఆ అనుభవంలో" నిలవగలగడాన్నే వీరందరూ బోధిస్తున్నారు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List