శ్రీ రాజరాజేశ్వరి దేవి. ~ దైవదర్శనం

శ్రీ రాజరాజేశ్వరి దేవి.

మనస్సుకు అధిపతి ‘చంద్రుడు’. చంద్రుడు వెనె్నలను బాగా పండించే ఋతువు శరదృతువు. శరదృతువులో మొదటి మాసం, ఆశ్వయజుమాసం. చంద్రుడంటే ‘తల్లి’. జన్మనిచ్చిన మాత, జగన్మాత. చంద్రుడు అనుగ్రహం ఉంటే, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలమైన మనస్సుతో ఏ కార్యాన్నైనా చేయగలుగుతాం. చంద్రానుగ్రహం, తల్లి ఆరాధనతో లభిస్తుంది. ప్రతిరోజూ జగన్మాత ఆరాధన చేసినా, శరదృతువులో ఆశ్వయుజమాసంలో శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు అనగా నవమి వరకూ తల్లి ఆరాధనకు శ్రేష్టమని విశేష ఫలితాన్నిస్తుందని పురాణములు, ఉపనిషత్తులు పేర్కొన్నాయి. నవాహ్నిక దీక్షగా (తొమ్మిది రోజులు) వ్రతాన్ని ఆచరించి, మనలో ఉన్న పశు రాక్షసత్వాన్ని పారద్రోలి, నరుడు నరోత్తముడవుతాడు.
పదవరోజు విజయదశమి. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవానికి మకుటాయమానమైన పండుగ, విజయదశమి. నవరాత్రి పూజకు జయకేతనం విజయదశమి. లోకాలనేలే ప్రభ్వి శ్రీ రాజరాజేశ్వరీ మాతను విజయదశమి రోజున పూజిస్తారు.

‘‘యాదేవీ సర్వభూతేషు, శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః’’ అన్నది దేవీ సప్తశతి. శక్తి ఆరాధన ఎందుకు చేయాలి అంటే విశ్వమంతా ‘వక్తి’మయం. శక్తిలేనిదే ఏ పనీ చేయలేం. ఆత్మశక్తిని పెంపొందించుకుంటేనే మానవుడు ప్రగతిపథంలో పయనిస్తాడు. అంతేకాదు, ఎందరికో ఆదర్శప్రాయుడై వారి జీవితాలలో కూడా వెలుగును నింపే శక్తి వంతుడవుతాడు. దీనితో సమాజ వికాసం కలుగుతుంది. ఇదే దేశాభ్యున్నతికి దోహదం చేస్తుంది.
తల్లిగా కరుణించి, లాలించి తండ్రిగా పోషించి, గురువుగా విజ్ఞానాన్ని అందించి, విశ్వంలోని ఏ పదార్థానికి ఎంత సామర్థ్యం ఉందో ఎంత ప్రాధాన్యతనివ్వాలో అన్న విషయాన్ని తెలియజేస్తూ, తప్పుదోవ తొక్కకుండా బిడ్డల్ని ఒక కంట కనిపెట్టి ఉండేది- జగన్మాత. అందుకే ఆ మహాశక్తిని ‘శ్రీమాతా’ అన్నారు. జగన్మాత సామ్రాజ్యం- మూడు లోకాలలో వ్యాపించి ఉంటుంది. బ్రహ్మాండమంతటా వ్యాపించిన తల్లి- ‘మహారాజ్ఞి’. రాజ లక్షణమైన రాజఠీవి, పరిపాలనకు ఉండవలసిన కాఠిన్యం, మాతృవాత్సల్యం- ఈ త్రిగుణాలతో సృష్టిస్థితి లయలను త్రిమూర్తులచేత చేయిస్తూ, త్రిమూర్తులకే కాక, చతుర్దశ భువనములకు ప్రభ్వి, సింహాసనేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి.

‘శ్రీ’ అంటే లక్ష్మి. సమస్త లక్ష్మీ సంతతని ప్రసాదించే త్రిజగన్మాత- శ్రీ రాజరాజేశ్వరి. తల్లి కరుణార్ద్ర నయనాలతో, విశ్వం మేల్కొంటుంది, ప్రపంచం ఉదయిస్తుంది. తల్లి ఆగ్రహిస్తే విశ్వం లయమవుతుంది. విశ్వమహాసామ్రాజ్ఞిగా, తల్లికి అందరూ సమానమే. అయితే ఋజు మార్గంలో విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే వారికి ఆమె చేయూతనిస్తుంది.
మండలాధిపతులు, భూమండలాధిపతులు, రాజ్యాధిపతుల అందరూ సామ్రాజ్య పదవీ లబ్ధులు. తన భక్తులకు భాహ్య సామ్రాజ్య పదవికన్న మిన్న అయిన ఆత్మానంద సామ్రాజ్య పదవిని అనుగ్రహించే శ్రీదేవి శ్రీ రాజరాజేశ్వరి.

ఇంద్రాది అష్ట దిక్పాలకులు రాజులయితే, వారికి రాజులు సత్వ రజ తమో గుణాతీతులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీరి చేత సృష్టి, స్థితి లయ కార్యములను గావింపజేసే ప్రభ్వి- శ్రీమాత- శ్రీ మహారాజ్ఞి, సింహసనేశ్వరి, కను
కనే శ్రీ రాజరాజేశ్వరి సార్థక నామధేయురాలైంది.
‘‘చితాభస్మాలేపో గరల మశనం దిక్పటధరో
జటాధారీ కంఠే భుజగపతి హారీ పశుపతిః
కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం
భవాని త్వత్పాణి గ్రహణ పరిపాటీఫలమిదమ్’’
చితాభస్మాన్ని పూసుకొనేవాడు, విషమే ఆహారమయినవాడు, దిక్కులే వస్త్రాలుగా గలవాడు, తలపై జడలవాడు, మెడలో పాముల దండలవాడు, పశువులకు పతి, చేతిలో తల పుఱ్ఱె కలవాడు, భూతనాధుడు- పరమశివుడు అయినా ఎల్లలోకాలకు ప్రభువు అయినాడు ‘‘ఓ భవుని రాణీ’’ అని సంభోధిస్తు అటువంటి జగదీశైక పదవి ఈశ్వరునికి లభించటానికి కారణం- నీ పాణిగ్రహణం పరిపాటే ఫలమేనని, శ్రీ రాజరాజేశ్వరీ సామ్రాజ్య వైభవాన్ని వివరించాడు శ్రీ శంకర భగవత్పాదులు. సాత్విక సాధన, పవిత్ర భావన, నిర్మల హృదయం, నిశ్చల మనస్సు- వీటితో సంపూర్ణ శరణాగతితో భక్త్భివంతో, తల్లిని స్మరిస్తే, మన యోగక్షేమాల్ని, జగన్మాత చూసుకుంటుంది. ఆ తల్లే శ్రీ రాజరాజేశ్వరి.
‘‘పరాశక్తి మనుపరాద నాపై పరాకేలనమ్మా
పురాణి ధర్మ సంవర్థని శ్రీపురాధీశ్వరి రాజరాజేశ్వరి’’
సర్పభూషణుడైన శివుడు, దేవరాజైన ఇంద్రుడు, జలజభవుడైన బ్రహ్మ, రాక్షసారులైన దేవతలు- అందరూ జగన్మాత, శ్రీ రాజరాజేశ్వరీదేవి అనుగ్రహం కోసం ప్రాకులాడతారు. లోకాధిపతులందరూ ఆ జగన్మాత కరుణా కటాక్షములతోనే శాశ్వత సౌఖ్యాన్ని పొందారని చెప్తూ, అటువంటి శ్రీ మహారాజ్ఞి రాజ్యంలో దుష్టులు అనగా సాధుజనులను నిరాకరించేవారికి ప్రవేశము లేదని, ధర్మవర్తనులకు, త్యాగశీలురకు మాత్రమే- శ్రీ రాజరాజేశ్వరి సామ్రాజ్యంలో స్థానం ఉంటుందని, వారికే ఆ జగన్మాత శాశ్వతానందాన్ని అందిస్తుందని, తిరువారూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి అయిన ధర్మసంవర్థనీ మాతను సద్గురు త్యాగరాజస్వామి, ఆద్యమైన ఆది తాళ నిబద్ధనలో, సావేరీ రాగంలో గానం చేశారు. ఇది శ్రీ రాజరాజేశ్వరీ సామ్రాజ్య స్వారాజ్య సిద్ధికి దర్పణం.

పరమేశ్వరుణ్ణి రంజింపజేసే పరమేశ్వరి- శ్రీరాజరాజేశ్వరి. ప్రపంచంలో మంచితనానికి మారుపేరు జగన్మాత. తనలాగానే బిడ్డలు కూడా మంచిగా నడుచుకోవాలని హితవు పలుకుతుంది. శ్రీచక్రం- యంత్రం, శ్రీవిద్య మంత్రం- శ్రీ సహస్రం- తంత్రం- శ్రీచక్రమునందు నవ (తొమ్మిది) ఆవరణములుంటాయి. అందులో ‘బిందు’ రూపంలో మహాచైతన్యంతో వెలిగే, మహోదాత్తశక్తి శ్రీ రాజరాజేశ్వరి. ఈ విశాల కువలయమే తల్లికి ఆలయం.

శ్రీవిద్య, శ్రీచక్ర సంబంధిత విషయాలు గురుముఖతగా తెలిసికోవాలి. అయినా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. మనశరీరమే ఒక శ్రీచక్రం. అందులో నవ ఆవరణలుంటాయి. అవి త్రైలోక్యమోహన చక్రం, సర్వాశాపరిపూర్వక చక్రం, సర్వసంక్షోభణ చక్రం, సర్వసౌభాగ్యదాయక చక్రం, సర్వార్థసాధక చక్రం, సర్వరక్షాకర చక్రం, సర్వరోగహర చక్రం, సర్వసిద్ధిప్రద చక్రం, తొమ్మిదవది సర్వానందమయ చక్రం. ముత్తుస్వామి దీక్షితులవారు నవావరణ కీర్తనలు మనకందించారు. అత్యద్భుతమైన కీర్తనలు. ‘శ్రీకమలాంబా జయతి అంబా శ్రీ కమలాంబా జయతి.. సూకరానవాద్యర్చిత మహాత్రిపుర సుందరీం రాజరాజేశ్వరీం సువాసినీం, కర సర్వానందమయ చక్రవాసినీం, చింత్రాయేహం’’ అని, దేవీ అనుగ్రహసిద్ధుడు, దేవీ ముక్తాహార వరప్రసాది, తొమ్మిదవ ఆవరణానికి మనకిచ్చిన కీర్తన, శ్రీ రాజరాజేశ్వరీ దేవి పూజకు పూర్తి స్ఫూర్తినిస్తుంది.

శక్తితత్త్వం, ఈశ్వరతత్త్వం, పైకి అనగా సామాన్య దృష్టికి వేరుగా కనపడినా, అది ఒకే తత్త్వం, అభిన్న స్వరూపాలు. ఆ రెండు తత్త్వములు వాక్కు అర్థం లాంటివి. అవి కలిసే ఉంటాయి. ఇదే శివశక్తి సామరస్యం. జీవుడు శివ శక్తుల సంయుక్తోపాసన చేయాలి. ఈ విషయానే్న ‘అంగన సహిత భుజంగ శయన ఎన్నకంగళి గుత్సవవీయో’ అనే కీర్తనలో సూచించారు. కర్నాట సంగీతానికి ఆద్యుడు, వాసుదేవ విఠలుని వాసిగా భజించిన శ్రీపురందరదాసు.

ఈ తొమ్మిది రోజులలో (తిథులలో) మహాశక్తిలో, త్రిమూర్తులు అష్టదిక్పాలకులు, సమస్త దేవతలు తమ శక్తుల్ని విలీనం చేస్తారు. ఎందుకంటే, ఏ పురుషుని చేత కాకుండా స్ర్తిమూర్తి చేతనే సంహరింపబడేటట్లు, వరములు పొందారు ఆ రాక్షసులు అందరూ. రాక్షసులనందరినీ సంహరించిన తదుపరి, విజయోత్సవంతో, మరల శివశక్తులను ఏకం చేసి అర్థనారీశ్వర తత్త్వంతో ప్రకృతీ పురుషుల ఏకత్వాన్ని, శివశక్తుల సామరస్యాన్ని విజయదశమి రోజున సాయంత్రం సంధ్యాసమయంలో, శమీవృక్షం (జమ్మిచెట్టు) దగ్గర సంయుక్తోపాసన, ఏకేశ్వరోపాసన చేస్తారు. చంద్ర నక్షత్రమైన హస్తానక్షత్రంలో కలశస్థాపన చేసి, పాడ్యమి తిథి నుంచి జగన్మాత శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభించి మరల చంద్ర నక్షత్రమున శ్రవణా నక్షత్రంలో కలశోద్వాసనతో, శమీపూజ ఏకేశ్వరోపాసనతో కలశోద్వాసనతో శరన్నవరాత్రి పూజను విజయదశమితో ముగిస్తారు.

‘‘శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాసిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శినీ’’ అన్న శ్లోకాన్ని పఠిస్తూ, శమీవృక్షానికి ప్రదక్షిణ చేస్తారు. శమీ (జమ్మి) ఆకుల్ని ఒకరికొకరు యిచ్చుకుంటారు. ఈ ఆశ్వయుజ దశమి నుండి, మరలా వచ్చే సంవత్సరం ఆశ్వయుజ దశమి వరకు, విజయాన్ని చేకూర్చి కాపాడమని, శమీ వృక్షాన్ని ప్రార్థిస్తూ, శివశక్తుల సంయుక్తోపాసనగా దర్శిస్తారు. ఈనాటికి ఆ జమ్మిచెట్టు, బ్రాహ్మణ వీధిలో విజయవాడలో ఉన్నది. అక్కడే సంయుక్తోపాసన- శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు చేస్తారు. దీనికి గొప్ప స్థల పురాణం కూడా ఉన్నది.

‘‘శ్రీ రాజరాజేశ్వరి, త్రిపురసుందరి శివే పాహిమాం, వందే పూర్ణచంద్రికా శీతలే విమలే’’- పూర్ణచంద్రునివలె చల్లనైన తల్లీ అంటూ, పూర్ణచంద్రికారాగంలో, ముత్తుస్వామి దీక్షితులు కీర్తించిన ఈ కీర్తన- చంద్ర నక్షత్రమయిన శ్రవణా నక్షత్రంలో వచ్చే విజయదశమి పండుగకు, శ్రీ రాజరాజేశ్వరీ పూజకు, సంపూర్ణ దీప్తినిస్తుంది.

‘‘శంకరి శంకరి కరుణాకరి, రాజరాజేశ్వరి, సుందరి పరాత్పరి గౌరి అంబి.. పరమ పావని, భవాని సదాశివ కుటుంబిని..’’ అని శివశక్తి సామరస్యాన్ని, కల్యాణి లయబ్రహ్మ, కామాక్షీ వరప్రసాదుడు- శ్యామశాస్ర్తీ, మనకందించిన కీర్తన, విజయదశమి రోజున అర్చనలందుకొన్న శ్రీ రాజరాజేశ్వరీ తత్త్వానికి స్ఫూర్తినిస్తుంది. ఆధునిక విజ్ఞాన సముపార్జన, వికాసము- విశ్వమానవ కల్యాణానికి ఉపకరించాలని, శ్రీమాత, శ్రీమహారాజ్ఞి, శ్రీ రాజరాజేశ్వరీ పూజ, విజయదశమి రోజున, విజయోస్తు అని చెప్తూ, విశదపరుస్తోంది.


మనకి విజయదశమి అనగానే మనము చేస్తున్న ఈ శరన్నవరాత్రుల దీక్ష పూర్తి అయ్యే దశకు వచ్చి మనము ఆ తల్లి కృపను పొందే స్థితి వచ్చింది అని చెప్పవచ్చు. అందుకే తొమ్మిదో రోజు పూజ ముఖ్యము అని చెప్పడానికి కారణం. ఈ విజయదశమి రోజు మధ్యాహ్నం సమయానికి అమ్మవారికి ఉద్వాసన చెప్పి దేవాలయములలో మరియు ఇంటిలో కూడా ఎవరెవరు ఆ తల్లి యొక్క దీక్షా స్వీకారం చేసి కొలుచుకున్నారో వారు దీక్షా విరమణ చేస్తారు. ఈ విజయదశమి రోజు సంధ్యా సమయము తరువాత నక్షత్రాలు రావడానికి మధ్య ఉన్న కాలము విజయ ముహూర్తంతో కూడి ఉంటుంది. ఈ రోజు అందుకనే ఆ తల్లిని రాజరాజేశ్వరిగా ఆరాధన చేస్తాము.

ఆ ఆపరాజితాదేవి రాజరాజేశ్వరీదేవియే. త్రిపురసుందరి మాత. మహాకామేశ్వరి గాను, కామాక్షి గాను పిలవబడుతుంది. ఈ తల్లి షోడశ తల్లిగా మనకు దర్శనము ఇస్తుంది. షోడశి అనగా 16 సంవత్సరాల పడుచుగా ఆ తల్లి ఈ రోజు మనలను అనుగ్రహిస్తుంది. ఈ రాజరాజేశ్వరీదేవిని భువనేశ్వరీమాతగా కూడా పిలుస్తూ ఉంటాము. సమస్త శక్తి ఉపాసనలకు అధిష్టానం ఈ భువనేశ్వయారీమాత. పరంజ్యోతి అయిన ఈ రాజరాజేశ్వరి ఉపాసన చాలా ఉత్క్రుష్టమయినది.

ప్రళయం సంభవించి మళ్ళీ తిరిగి సృష్టి మొదలు పెట్టాలి అని విష్ణుమూర్తి అనుకున్నప్పుడు ఆ నారాయణుడి నాభి నుండి బ్రహ్మగారు ఉద్భవించారు. మరి అప్పుడే వచ్చినటువంటి మధుకైటభులనే రాక్షసులను సంహరిద్దాము అంటే నారాయణడు యోగనిద్రలో ఉన్నాడు. అప్పుడు బ్రహ్మగారు యోగనిద్రలో ఉన్న నారాయణుని వంక చూసి ఆ నారాయణునిలో యోగనిద్రగా ఉన్న ఆ శక్తిని ఒక్కసారి స్మరించాడు. వెంటనే ఆ నారాయణుడి శక్తి కారణం వల్ల ఆ రాక్షసులను సంహరించాడు. మరి ఇప్పుడు సృష్టి చెయ్యాలంటే ఏమి చెయ్యాలి? అని, ఈ త్రిమూర్తులు అనుకుంటూ ఉండగా బ్రహ్మగారు నారాయణుడితో....నీవు యోగనిద్రలో ఉన్నప్పుడు నీలో యోగనిద్రగా ఉన్న ఆ తల్లిని ప్రార్ధించగా మన పని శులువుగా అయిపొయింది. మనము ఇప్పుడు కూడా ఆ శక్తిని అడుగుదాము. ఏమి చెయ్యాలో అని ఆ శక్తిని ప్రార్ధించగా ఒక విమానం వచ్చి వారి ఎదుట ఆగింది. అశరీరవాణి వారికి వినిపించింది. మీరు ఈ విమానం ఎక్కండి. ఇది ఎక్కడ ఆగుతుందో అక్కడ మీరు దిగండి. అని వారికి అశరీరవాణి వినిపించింది. వారు ముగ్గురూ ఆ విమానంలో కూర్చున్నారు. ఇప్పటి వరకు త్రిమూర్తులు ఉన్నది ఒక్కటే బ్రహ్మాన్డమని అనుకుంటున్నారు. కాని, ఆ విమానం అనేక బ్రహ్మాన్దాలను దాటించుకుంటూ తీసుకుని వెళ్ళింది. పైగా ప్రతి ఒక్క బ్రహ్మాణ్డమునందు దానిని సమర్ధవంతంగా పాలించడం కోసం త్రిమూర్తులను చూస్తూ వీరు ఆశ్చర్యపోతున్నారు.

ఈ విమానం వెళ్లి ఒక దివ్యధామము ముందు ఆగింది. ఆ విమానం ఆగగానే వీరు ముగ్గురూ అక్కడ దిగారు. అక్కడ అంతా అమృత సముద్రము ఉంది. ఆ సముద్రపు మధ్యలో ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో కల్పవృక్షాలు ఎన్నో ఉన్నాయి. ఈ ద్వీపాన్ని మణిద్వీపం అన్నారు. మణిద్వీపం అనగా స్వయం ప్రకాశ శక్తి కలిగిన ద్వీపమని అర్ధం. ఈ త్రిమూర్తులు ఆ మణిద్వీపంలోనికి ప్రవేశిద్దాము అని అనుకుని కోట ముఖద్వారం వద్దకు వెళ్లి లోనికి వెళ్ళడానికి ప్రయత్నించగా అచట పరిచారకులు అడ్డగించారు. మీరు ఎవరు? అని ప్రశ్నించగా మేము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులం అని వారు వారి పరిచయ వాక్యాలు తెలియచేశారు. మీరు లోనికి ప్రవేశించాలి అంటే ఈ పురుష రూపములలో లాభంలేదు. స్త్రీ రూపాలను ధరించి రండి...అనగానే, బ్రహ్మగారు బ్రాహ్మీగా, విష్ణువు వైష్ణవిగా, మహేశ్వరుడు మహేశ్వరిగా మారి ఆ ద్వీపంలోనికి ప్రవేశించారు.

అనగా ఒక రకంగా ఆలోచిస్తే మనలో ఉన్నటువంటి అహంకారమే పురుష ప్రవృత్తి అనుకుంటే....ఎప్పుడైతే మనము అహంకారాన్ని ఆ ద్వారం బయట వదిలి లోనికి వచ్చేటప్పుడు అహంకార త్యాగం వల్ల శక్తిని పొందారు. ఇదీ మనం గ్రహించవలసినది.

ఈ మణిద్వీపం అంతా కూడా ఆనందం, దీప్తి కనిపిస్తోంది. కల్పవృక్షాలతో, పక్షుల చక్కటి కిలాకిలారావాలతో చాలా శోభాయమానంగా ఉంది. ఈ మధ్యలో ఉన్న ఈ చింతామణి గృహంలో ఆ భువనేశ్వరీదేవి 16 ఏళ్ళ ప్రాయంలో ఉన్న పడుచుగా, అరుణ వర్ణంతో ఆ త్రిమూర్తి శక్తిగా ఆ తల్లి చింతామణి గృహంలో విరాజిల్లితూ ఉంటుంది.

మనకి భక్తి రెండు రకాలు. పరాభక్తి, అపరాభక్తి. పరాభక్తి అనగా తమోగుణం, రజోగుణాన్ని వదిలి సత్వ గుణంలో ఉండటం. మనం చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఉపాసన చెయ్యాలని ఆలోచించడం. మామూలుగా రాజులు పాలకులుగా ఉంటారు. మరి రాజరాజులు అనగా మనువు, కుబేరుడు, ఇంద్రుడు, వీరిపై బ్రహ్మగారు. వీళ్లందరినీ కూడా పరిపాలించేది రాజరాజేశ్వరీదేవి.

అమ్మ భక్తి అన్నింటికంటే గోప్ప సంపద. దీనిని పెంపొందించుకోవాలి అంటే ఆ తల్లికి సంబంధించిన ఆలయాలను ప్రయత్న పూర్వకంగా ఉత్సాహంగా దర్శనం చేయాలనుకోవడం, ఆ తల్లిని ఆరాధన చేసేవారితో నిత్యం స్నేహభావాన్ని ప్రదర్శించడం, ఆ తల్లికి సంబంధించిన కధలను వినడంయందు ఆసక్తి పెంపొందింపచేసుకోవడం.

ఆ తల్లి లీలలు వినేటప్పుడు ఆనందాశ్రువులు రాలడం, గొంతు బొంగురుపోవడం ఇలాంటివన్నీ కూడా ఆ తల్లి కృప వల్ల జరుగుతున్నాయి. అలాంటి కృపను అనుగ్రహించేటటువంటి తల్లి కాబట్టి ఆ రాజరాజేశ్వరీదేవి యొక్క పాదాలను గట్టిగా పట్టుకుని సర్వకాలసర్వావస్థలయందును ఆ తల్లి ఆరాధన చేసుకునేటటువంటి కృపను ఇమ్మని ఆ తల్లిని వేడుకుందాం. ఆ తల్లి యొక్క అపార కరుణా కటాక్ష వీక్షణములో మనము తడిసి ముద్దవుదాం.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List