బాహ్య ప్రపంచం నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే.!! ~ దైవదర్శనం

బాహ్య ప్రపంచం నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే.!!

నీ స్వభావము,
నీ వ్యక్తిత్వము ఎలా మారాలి?
అనే దానిమీద ద్వాదశ మార్గాలు చెప్పబడ్డాయి.
తన దివ్యత్వాన్ని సాధకుడు అనుభవించడానికి  పన్నెండు మార్గాలు వున్నాయి. ఈ మార్గాల లో
ఏ ఒక్కటైనా పరిపూర్ణంగా పటిష్టంగా చేస్తే, నువ్వు సర్వాంతర్యామి సర్వోతృష్ఠుడని నీకు తెలుస్తుంది. దానినే దివ్యత్వం అంటాం.

దివ్యత్వాన్ని సంపాదిస్తే బ్రహ్మజ్ఞానం వంటబదుతుంది. ఈ దివ్యత్వం సాధనచేత వస్తుంది. కానీ బ్రహ్మ జ్ఞానము ఏ సాధనా లేకుండానే రావాలి. ఎందుకంటే అది సాధించుకుంటే వచ్చే సాధ్య వస్తువు కాదు. అది సిద్ధ వస్తువు. అదే 'జీవోహం' నించి 'బ్రహ్మోహం'అన్న స్థితికి చేరడం. అందువల్ల ముందుగా సాధనా పరంగా ఆ  పన్నెండు మార్గాలు ఏమిటో చూద్దాం:

1. నిరీక్షణ:*

ఎడారి ఎండలో పెక్కు దినములు పడి వుండి జలము కొరకు నిరీక్షించువారు ఎట్లు ప్రాధేయ పడుదురో అట్లే నాతో ఐక్యము కోరువారు ప్రాధేయతా తృష్ణ అనుభవించవలెను. అంటే భగవంతుని దర్శనం కోసం అలా వెంపర్లాట రావాలి. దానిని నిరీక్షణ అన్నాము.

2. మనశ్శాంతి:*

 ఘనీభవించిన సరస్సు ఎంత ప్రశాంతముగా వుండునో, అంత ప్రశాంతముగా వుండగలిగిన వాడే ఆయననను తెలుసుకో గలుగుతాడు.మరి  మనసు నిశ్చలం కావాలంటే నీ మనసుని అటూఇటూ పోనివ్వకుండా తీవ్రమైన సాధనలు చేయాలి. ''ఊరక వుండుము'' అన్నాడు రమణ మహర్షి. ఊరక వుంటే మనసు నిశ్చలమవుతుంది. సరస్సు ఉపమానం చెప్పారు. ఎవరు ఎంతమంది రెచ్చకొట్టినా నువ్వు చలించకుండా వుండాలి. చుట్టూ వున్నవారివల్ల నేను బాధపడుతున్నాను వాళ్ళవల్లే నా ప్రశాంతతను కోల్పోయాను అనేభ భావనని త్యజించాలి. నిన్ను నువ్వే స్థిరపరచుకోవాలి.

3) నమ్రత:*

గురువుకి తన్ను తాను సమర్పించుకుని నిన్ను ఆయన ఎలా మలచుకుంటాడో ఆయన ఇష్టానికి వదలివేసిి నీ ఇష్టం అనేది కొంచెంకూడా లేకుండా వుండాలి.ఎలా అంటే బొమ్మలు చేసేవాడి చేతిలో మట్టి ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మగా మారడానికి వీలవుతుందో తన ఇఛ్ఛ ఏమీ లేక, తన ప్రయత్నం ఏమీ లేక, తన క్రియ ఏమీ లేక, పూర్తిగా సమర్పణ చేసి తనపరంగా ఏమీ లేకుండా ఎలా వుంటుందో అలా వుండటాన్ని నమ్రత అంటారు. రజోగుణము లేనప్పుడే ఆ నమ్రత వుంటుంది.మనశ్శాంతి అన్నప్పుడు మనసుకి సంబంధించినది, నమ్రత అనేది అహంకారానికి సంబంధించినది. నిరీక్షణ అనేది ఓర్పు తపనకు సంబంధించినది. అంత తపన అంటే తీవ్ర మోక్షేఛ్చ అన్నమాట.

4) నిస్పృహ:*

నిస్పృహ వలన మానవుడు ఏ విధముగా ప్రాణ త్యాగమునకు తెగించునో అట్లే నన్ను వీక్షించనిదే బ్రతుకజాలను అను గట్టి నిశ్చయము కలిగినవాడు, ఆ సమయమున నన్ను కాంచగలడు. ఆత్మహత్య చేసుకునే వాడు ఎంత నిస్పృహతో ఉంటాడో అదే విధంగా ప్రాపంచిక విషయాలపట్ల వున్న స్పృహ పోవాలి. లౌకిక విషయాల మీద శరీర ఇంద్రియ భోగ సంబంధంమీద ఏ స్పృహ అయితే వున్నదో ఆ స్పృహ లేకపోవడమే నిస్పృహ. ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు మార్గాలలో ఏ ఒక్క మార్గం వున్నా చాలు, నాలుగూ అవసరం లేదు.

5) విశ్వాసము:*

 పగలును రాత్రి అని చెప్పిన గురు వాక్యము ఎట్టి సందియము లేక విశ్వసించిన కళ్యాణునివలె విశ్వసించినవాడు నన్ను తెలుసుకోగలడు. గురువు నంది అంటే నంది, పంది అంటే పంది. అంతే అనాలి. అదేంటండీ? అనేమాట అనకూడదు. ఆయన కావాలనే పరీక్ష పెట్టడానికి అంటాడు. అంతరార్థమూ వుంటుంది. అంతటి దృఢ విశ్వాసం వుండాలి గురువుగారి పట్ల. ఆయనకేమీ తెలియదు, మనలోకంలో వుండడు, మనకి తెలిసినట్లు ఆయనకి తెలియదు. ఆయన అట్లాగే చెప్తారు. అక్కడక్కడ తిరగమంటారు, ఆయనకేమీ పనీ లేదు, పాటా లేదు అని అనుకుంటారు. కాని గురువులు చెప్పేదాంట్లో ఏదో నీకు ప్రయోజనము సాధనకి పనికివచ్చేది తప్పకుండా వుంటుంది.

6) అన్యోన్యత:*

 తానెరుగకున్ననూ జీవితాంతము తనతో సాహచర్యము చేయుచూ కష్ట సుఖములలో కూడా వీడక, తనకు హితుడయ్యి అహితుడు కాకుండా, శ్వాస నిన్ను ఎట్లా అనుసరిస్తుందో అట్టి శ్వాసవలే తనకు నాయందు విశ్వాసం వుండాలి. బ్రహ్మ జ్ఞానమందు పరమాత్మయందు విశ్వాసముండాలి. అప్పుడే వాడు నన్ను తెలుసుకోగలడు. నువ్వు, నీ మనసు, ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటున్నా, శ్వాస విశ్రాంతి తీసుకోకుండా ఆ గాఢ నిద్రలో కూడా శ్వాస కొనసాగుతూ నీతోపాటే వుంటుంది. శ్వాసని నువ్వు అప్పుడప్పుడూ తిట్టుకున్నా సరే, దాని పని అది చేస్తూనే వుంటుంది. బలవంతంగా ఆపితే ఉక్కిరి బిక్కిరి అయిపోయినా సరే, శ్వాస నువ్వు మళ్ళీ పీల్చుకునేలాగ చేస్తుంది. ఆ శ్వాస నీకు హితమై నిన్ను ఎట్లు అనుసరిస్తూ కాపాడుతూ రక్షిస్తూ వుందో, అట్టి శ్వాసవలే ఆ శ్వాస నిన్నెలా పట్టుకుందో నువ్వు నన్ను అలా పట్టుకో. అలా నన్ను పట్టుకుంటే తప్పకుండా నువ్వు నన్ను పొందుతావు.

7) ప్రేమతో సాధన:*

 నా యందలి ప్రేమతో విషయవాంఛలయెడల తనకున్న మోహమును దూరము చేయగలిగినప్పుడు నన్ను పొందగలడు. పరమాత్మని ప్రేమించడమంటే అందరిలో పరమాత్మ సర్వవ్యాపక చైతన్యముగా వున్నాడని నమ్మి వ్యవహరించడం. ఆ పరమాత్మ సర్వ వ్యాపకుడు కనుక సర్వమందూ పరమాత్మ వున్నాడు కనుక సర్వాన్నీ కూడా పరమాత్మగా ప్రేమించాలి. అంతేకాదు. సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటటువంటిది లక్ష్యంలో పెట్టుకున్నాం. ఈ కనబడేదంతా బ్రహ్మమే. ఈ నామరూప ప్రపంచమంతా బ్రహ్మమే అన్న భావనతో అందర్నీ, అన్నిటిని ప్రేమించాలి. ఆ దివ్య ప్రేమే  ప్రేమే బ్రహ్మ జ్ఞానానికి తీసుకువెళ్తుంది. నా మీద ప్రేమ వుంటే, విషయాలను వదిలివేయాలి. విషయాలను వదిలివేస్తే నన్ను నువ్వు ప్రేమించవలసిన రీతిగా ప్రేమిస్తావు. నీ ప్రేమ దివ్య ప్రేమగా మారుతుంది. అటువంటి ప్రేమతో జీవించే జీవుని జీవితం దివ్య జీవనంగా మారుతుంది.

8. నిస్వార్థ సేవ:*

పుణ్య పాపములు ఇది తగినదని, ఇది తగనిదని బేధము లేకుండా సృష్టి అంతటనూ ప్రకాశించుచు విశ్వ సేవను యొనర్చు సూర్యునివలే ఫలాపేక్ష లేకుండా సేవ యొనర్చిన యెడల, నన్ను జయించగలరు. పుణ్య పాపములు ఉఛ్ఛ నీచములనే బేధాలను నీవు వర్జిస్తే, విస్మరిస్తే, తప్పకుండా నువ్వు నన్ను పొందుతావు. ఎందుకంటే సమత్వం యోగముచ్యతే. అందరి విషయంలో కూడా నువ్వు నిష్పక్షపాతంగా అందరినీ కరుణగా, ప్రేమగా, సానుభూతిగా వారి బలహీనతలని పట్టించుకోకుండా మన గలగాలి. అందరిలో పురుషుడున్నాడు. అందరిలో వున్న పురుషుడు పురుషోత్తముడే. ఆ పురమునందు నివశించు పురుషుడు ఎప్పుడూ మంచివాడే. ఆ పురము ఏ సంస్కారము వలన ఏ గుణాల వలన వచ్చిందో అది మాత్రమే చెడ్డది. దానిని విస్మరించాలి. ఈ విధమైన పరిత్యాగము చేసినటువంటి స్వార్థపరుడు నన్ను పొందును. అనగా పరమాత్మానుభవము పొందును.

9) పరిత్యాగము:*

శారీరిక మానసిక ఆధ్యాత్మిక సంబంధ విషయములన్నిటినీ నా కొరకు పరిత్యజించినవాడు నన్ను పొందగలడు. పరమాత్మని పొందటానికి ఏమేమి వదలాలి? శరీర సంబంధము వదలాలి, మనసుకి సంబంధించినవి వదలాలి. ఆధ్యాత్మికతకి సంబంధించినవి కూడా వదిలివేయాలి. ఒకటి వదలితే అది త్యాగము. శరీరానికి సంబంధించినది అంటే విషయాలు ఇంద్రియ భోగాలు. మనసుకి సంబంధించినవి అంటే రాగద్వేషాలు అరిషడ్వర్గాలు, నేను నాది నావారు అనేటువంటి వాటితో కూడినటువంటి వాసనలు. ఆధ్యాత్మిక సంబంధమంటే చివరికి ''నేను''ని వదలాలి. మనసుకూడా పోయాక ఏ నేనైతే వుందో ఆ నేను మనసులేనప్పుడు ''అహం బ్రహ్మ'' అంటుంది. అటువంటి ఆధ్యాత్మిక ''నేను'' కూడా పోవాలి. పోవాలి అంటే త్యాగం చెయ్యాలి. తను మన ధనములు మూడూ త్యాగము చేయాలి. నీకు కొంత వుంచుకుని పెడితే అది దానము. నీకు వుంచుకోకుండా చేస్తే త్యాగము. త్యాగము చెసేటటువంటి కర్త కూడా లేకుంటే అది పరిత్యాగము. నేను త్యాగము చేస్తున్నాను అనేటటువంటి కర్తృ భావన లేకపోతే అది పరిత్యాగము. చివరికి ''నేనే'' లేకుండా పోయేది పరిత్యాగము. ఆధ్యాత్మికత అంటే ప్రత్యగాత్మ పరమాత్మలు అష్ట తనువులు అన్నమాట. తనువు అంటే మూడు శరీరాలు అని అర్థం. అష్ట తనువులు లేకపోవడమే పరిత్యాగము. పరమాత్మానుభవాన్ని, బ్రహ్మానందాన్ని కూడా త్యాగం చేయడము పరిత్యాగము. ఈ పరిత్యాగం వలన ద్వైతము నశిస్తుంది. అద్వైతము సిద్ధిస్తుంది.

10) విధేయత:*

విశిష్ఠముగా అహంకారము లేకుండా వుండటము వినయము. విధేతయ అంటే ఏమిటి? నీ అహంకారమును పరమాత్మయందు చేర్చి పరమాత్మతో ఐక్యతపొందించి ఈ ఐక్యత పొందినటువంటి ఏ నేను అయితే వుందో, ఆ నేను లేకుండా పోవడమే విధేయత. వినయము కంటే ఒక మెట్టు ఎక్కువ విధేయత. వినయము ఎవరి యెడల అయినా వుండవచ్చు విధేయత మాత్రము పరమాత్మతో వుంటే ఆ పరమాత్మతో ఐక్యము అవుతావు. ఇంకెవరియందైనా వుంటే వారితో ఐక్యం కావు. పరమాత్మతో వుంటేనే ఐక్యం అవుతావు. వినయములో అహంకారము తగ్గి ఉంటుంది. విధేయతలో అహంకారము సమర్పించబడుతుంది.

11) శరణాగతి

చాలాకాలంగా నిద్రపట్టని జబ్బు వున్నవాడు ఒకరోజున అకస్మాత్తుగా నిద్రపడితే నిద్రని ఎలా స్వాగతిస్తాడో, నిద్రలో ఎలా ఒదిగిపోతాడో, అట్లా ఆ పరమాత్మయొక్క ఒడిలోకివెళ్ళి ఆ నిద్రకి నిశ్చింతగా ఏ విధముగా లొంగిపోతాడో అంత మనస్ఫూర్తిగా నాకు అర్పణ అయినవాడు నన్ను పొందగలడు. మరియు నన్ను తనవానిగా చేసుకొనగలడు. శరణాగతి అంటే అది.

*12) ప్రేమ:*

భగవంతుడి పై ఎనలేని ప్రేమ ఉండడం. ఎలా అయితే గోపికలు రెప్ప వేయడం పట్టే సమయం లో ఆ స్వామిని చూడలేక పోతున్నామే అన్న భావనలో ఉంటారో, అంతలా స్వామిని ప్రేమించాలి.

అంతటి ప్రేమ ఎవరికైతే వుంటుందో అటువంటివాడు ఆ పరమాత్మను ఆనందపరచ గలడు. తృప్తి పరచగలడు. అలాగ క్షణ కాలం కూడా దూరం గా ఉండలేని భావం నిరీక్షణలో పరాకాష్ఠ. మనశ్శాంతికి పరాకాష్ఠ. నమ్రతకు పరాకాష్ఠ. శరణాగతి, ప్రేమ , నిస్వార్ధము ఇవన్నీ కూదా పరాకాష్ఠ స్థితిలో ఏ రకముగా పనిచేస్తాయో అవి అలా పనిచేసినప్పుడు నీవు పరమాత్మ దగ్గర వుంటావు. పరమాత్మ అయిపోయి వుంటావు. ఇది సాధనగా వుంది కాబట్టి పొందుట అనే మాట వాడారు. సాధన వలన సాధ్యము అయి పొంద బడతాయి.  ఆ పైన గురుకృపతో సిద్ధ వస్తువు సిద్ధించినపుడు పొందుట అనే మాట వుండదు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List