హఠయోగము. ~ దైవదర్శనం

హఠయోగము.

చంచల మనస్సును ప్రతిబంధించుట దుర్లభము. బలవంతముగా నిగ్రహించుట, లేక హఠించుటను హఠయోగమందురు. హఠమనగా సకలేంద్రియములను వాటి వాటి గోళకములనుండి విషయముల వైపుకు వ్యాపించకుండా నిరోధించుట. కన్నులు, చెవులు, నోరు మూయవచ్చును గాని, చిత్త వృత్తులను ఆపలేము. చిత్తవృత్తులను ఆపలేకపోవుట వలన హృదయ స్థానమునకు చేరలేకపోవుట చేత, హఠయోగమునకు అవధి కలుగుచున్నది. అందువలన ఆత్మానాత్మ వివేకముతో, ముముక్షువై క్రమసాధన చేయుట వలన ప్రయోజనముండును.

          వాసనలు బలీయముగా నున్నచో ప్రాణాయామాభ్యాసము చేయవలెను. వాసనలు అంత బలముగా లేనిచో నేరుగా బ్రహ్మ జ్ఞానాభ్యాసము చేయవచ్చును. ఒక స్థాయిలో బ్రహ్మాభ్యాసము యొక్క ఫలితమునుబట్టి విద్యామదము కలిగి అవరోధమును కలిగించును. వారికి కూడా ప్రాణాయామాభ్యాసము అవసరమగును. చివరకు బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి కలుగును.


ప్రాణాయామము రెండు విధములు


1. స్మార్త ప్రాణాయామము :

ఇవి మనుధర్మ శాస్త్రము, మొదలగు శాస్త్రములందు చెప్పబడినది. స్మార్త ప్రాణాయామమనగా శ్వాస ప్రశ్వాసలను నిరోధించి, మంత్ర జపమును తీవ్రముగా చేయవలెను. ప్రణవముతోను, సప్త వ్యాహృతులతోను, శిరస్సుతోను మూడు పర్యాయములు మననము చేయవలెను. దీనిని సంధ్యావందనాది నిత్యక్రియలకు అంగముగా చేర్చి చేయవచ్చును. స్మార్త అనగా స్మరించుచుండుట. అది స్మృతి రూపమగుట.


2. తాంత్రిక ప్రాణాయామము :

సాంకేతికముగా, ఒక తంతు జరుపుచున్నట్లుగా చేయుట తాంత్రికము. దీని వివరములు పాతంజలియోగ శాస్త్రమందు గలవు.


         ఇవిగాక హఠయోగమందు రెండు సోపానములు కలవు.

1. బంధత్రయ సాధన 2. కేవల కుంభక సాధన.


1. బంధత్రయ సాధన :


 1. మూలబంధము : మల విసర్జన స్థానము వద్ద ప్రాణశక్తిని నొక్కిపట్టి సుషుమ్న నుండి తిరిగి వెనుకకు పోకుండా, స్వాధిష్ఠాన మణిపూరకముల పైకి పంపుట కొఱకు చేయు ప్రక్రియను మూలబంధము అందురు.


2. ఉడ్యానబంధము :

సుషుమ్నలోని ప్రాణశక్తిని అనాహత విశుద్ధముల పైకి పంపుటకు నాభిస్థానము వద్ద నొక్కిపట్టు ప్రక్రియను ఉడ్యానబంధము అందురు.


3. జాలంధర బంధము :

విశుద్ధము దాటిన ప్రాణ శక్తిని క్రిందికి దిగకుండా ఆజ్ఞా సహస్రారముల పైకి పంపుటకు కంఠస్థానము వద్ద నొక్కి పట్టుటను జాలంధర బంధము అందురు.

         ఈ మూడు బంధముల పర్యవసానముగా క్రమముగా బ్రహ్మ గ్రంధి, విష్ణు గ్రంధి, రుద్ర గ్రంధి అని గ్రంధిత్రయ భేదనము జరుగును.


2. కేవలకుంభక సాధన :

పై చెప్పబడిన బంధత్రయ సాధనల ఫలితముగా కుండలీశక్తి మేల్కొని సుషుమ్నలో ప్రయాణము సాగించును. మూలాధారములో గల యోగాగ్ని ప్రజ్వరిల్లును. ప్రాణ వాయువుతోపాటు అపాన వాయువును కూడా పట్టి పైకి గుంజును. యోగాగ్ని శిఖలు కదలి, రవ్వలు పుట్టి పైకి లేచును. అప్పుడు యోగి కుంభకములో ఉండును. ఇడా పింగళలో ప్రాణవాయువు యొక్క రాకడ పోకడలు ఆగిపోవును. దీనినే కేవలకుంభక సాధన అందురు.

          పైకి ఎగసిన రవ్వలు ప్రాణాపానములు రెండింటితో కూడి సుషుమ్నలో సహస్రారము వద్దకు చేరును. అక్కడినుండి పండ్రెండు అంగుళములపైన ఉన్న ద్వాదశాంత స్థానమైన చంద్రకళా స్థానమును చేరును. అక్కడున్న అమృతపు గడ్డ చల్లగా ఉన్నది. అది అగ్ని రవ్వల వలన కరిగి, అమృత ధార సహస్రారములోనికి స్రవించును. చివరకు నాడీమండలమంతా వ్యాపించును. ఈ సిద్ధిని హఠయోగి ఎప్పుడూ నిలబెట్టు కొనుచుండవలెను.  బలవంతముగా చేసే ఈ హఠయోగమును తగిన గురువు లేకుండా చేసినచో తగిన ఫలితము రాకపోగా, ప్రాణాపాయము కలిగే ప్రమాదమున్నది. ఒకవేళ మృత్యువును జయించే సిద్ధి కలిగినను, మోక్ష లక్ష్యములో ఆ సిద్ధిని పట్టించు కొనరాదు.

         హఠయోగములోనే వేరొక ప్రక్రియ రేచక పూరకములతో సంబంధము లేని కేవల కుంభక యోగము కలదు.


కేవల కుంభక యోగము :

దీనిలో శ్వాస స్థంభనతో పాటు చిత్త స్థంభన కూడా ఉండును. బాహ్యావృత్తులు ఆగిపోయి అంతర్ముఖుడైన యోగి అంతరరసమును అందుకొనును. దీని క్రమమేమనగా


1. మనస్సును అనాహతములో నిలిపి, ఏకాగ్రము చేసి, నిరంతరము అభ్యాసము చేయగా, శ్వాస సంచారము ఆగిపోవును. దానితోపాటే మనో వ్యాపారము ఆగిపోవును.


2. అనాహతమునుండి నెమ్మదిగా ఆజ్ఞా వరకు తన మనస్సును పైకి తీసుకొని పోవలెను. అక్కడ త్రికూట స్థానములో మేకుబందీ చేసినట్లుగా బిగించి ఉండవలెను.


3. అప్పుడు ప్రాణవాయువు సూర్యచంద్రనాడులను పూర్తిగా వదలి ఆజ్ఞాలోని త్రికూట స్థానములోని ఆకాశములో లయించును. ఇది విష్ణు పదము. విష్ణు పదమే త్రికూట స్థానము. అనాహతములో శ్వాసను బిగించే ప్రయత్నము అవసరము. ఆజ్ఞా చేరిన తరువాత ఆ ప్రయత్నముతో పని ఉండదు.


4. మనస్సును తత్త్వజ్ఞానముతో నింపవలెను. అప్పుడు చిత్తవృత్తులు ఆగిపోవును. తత్త్వజ్ఞానము లేని యోగి చిత్తవృత్తులు ఆగిపోయినప్పుడున్న శూన్యతకు భయపడి బహిర్ముఖమగును. అందువలన ఆ శూన్యములో ఏ దేవతామూర్తినో, గురుమూర్తినో, సద్భావననో ఉంచుకొనుటకు ప్రయత్నించును. ఏది చేసినా లక్ష్యమును అందుకొనలేడు. కనుక తప్పని సరిగా తత్త్వ జ్ఞానమును సముపార్జించుకొని యుండవలెను. అప్పుడా యోగి చిత్తలయముతో పాటు తత్త్వాకారమును పొందును. ప్రాణ చిత్తములు రెండూ కలిసి ఒకేసారి లయమగుట చాలామంది యోగులకు సాధ్యము కాదు. పరిశుద్ధ జ్ఞానసంపన్నులకే అది సుసాధ్యము.


గ్రంధి త్రయము :

మూలాధారము, స్వాధిష్ఠానములు రెండు ఒక ఖండము. ఇది సోమస్వరూపము. మణిపూరకము, అనాహతములు రెండవ ఖండము సూర్య స్వరూపము. విశుద్ధ, ఆజ్ఞలను ఖండము అగ్ని స్వరూపము, సోమ ఖండము పై భాగమున చంద్రస్థానము వద్ద బ్రహ్మగ్రంధి, సూర్య ఖండము పైభాగము వద్ద విష్ణుగ్రంధి, అగ్ని ఖండము పైభాగము వద్ద రుద్రగ్రంధి ఉన్నవి. ఇవే గ్రంధి త్రయము. వీటిని క్రమముగా భేదించిన జీవుడు సహస్రారమందున్న అర్థనారీశ్వరునిలోనికి జేరి లయమగును
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...